అయితే వారికి చెందిన సుమారు రూ.9371 కోట్ల ఆస్తులను ఆయా బ్యాంకులకు ఈడీ బదిలీ చేసింది. ఈ ముగ్గురికి చెందిన సుమారు రూ.18,170.02 కోట్ల ఆస్తులను సీజ్ చేసినట్లు ఈడీ పేర్కొంది. దీంతో విదేశాల్లో ఉన్న రూ.969 కోట్ల ఆస్తులు కూడా ఉన్నాయి. ముగ్గురి వల్ల బ్యాంకులకు జరిగిన నష్టంతో వారి ఆస్తులు అటాచ్ చేసి సీజ్ చేసిన మొత్తం విలువ రూ.80.45 శాతంగా ఉన్నట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తెలిపింది.
నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యాలు ప్రస్తుతం విదేశాల్లో తల దాచుకుంటున్నారు. వారిని భారతదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ముగ్గురూ దేశీయ బ్యాంకుల నుంచి సుమారు రూ. 22,585 కోట్ల రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ముగ్గురికి చెందిన లావాదేవీలను సమీక్షించింది.
డమ్మీసంస్థలతో ఈ ముగ్గురు బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకుని పరారయ్యారు. విజయ్ మాల్యాను అప్పగించేందుకు బ్రిటన్ కోర్టు అంగీకరించింది. ముగ్గురికి చెందిన ఆస్తులను త్వరలో వేలం వేయనున్నారు. దీని ద్వారా ఆయా బ్యాంకులకు సుమారు రూ.7981 కోట్లు జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.