Economic Recession 2023: మరోసారి ప్రపంచం ఆర్థిక మాంద్యం ముంగిట నిలిచిందా? యూరప్ నుంచి అమెరికా దాకా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలనున్నాయా? మరోసారి పెద్దపెద్ద సంస్థలన్నీ దివాళా తీయనున్నాయా? దీనికి ఔననే సమాధానం చెబుతోంది అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ. ఆర్థికవేత్తలు, కేంద్ర బ్యాంకులు, పలు ప్రపంచ ఏజెన్సీలు వ్యక్తం చేస్తున్న మాంద్యం భయాలను ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ తాజాగా ధ్రువపరిచింది. అధిక ద్రవ్యోల్బణం, ద్రవ్య విధాన కట్టడితో ఆర్థిక వ్యవస్థ వచ్చే ఏడాది మాంద్యంలో చిక్కుకుంటుందని హెచ్చరించింది. కనీవిని ఎరుగని స్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడం, నగదు సరఫరాను తగ్గించడం వంటి చర్యలను చేపడుతున్నాయి. ఫలితంగా ఈ ఏడాది మధ్యలోనే మాంద్యం భయాలు తలెత్తాయని మంగళవారం విడుదల చేసిన గ్లోబల్ ఫైనాన్షియల్ రిపోర్టులో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వివరించింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు సాధారణ స్థాయి కంటే అధికంగా పెంచిన ప్రతిసారి అమెరికా ఆర్థిక వ్యవస్థలో మాంద్యం ఆవరిస్తుందని గుర్తు చేసింది. “అంతర్జాతీయ ఆర్థిక వాతావరణన్ని కారు మబ్బులు కమ్ముకుంటున్నాయి. ద్రవ్యోల్బణం దశాబ్దాల గరిష్టానికి ఎగబాకింది. ఇది అన్ని దేశాలకు వ్యాప్తి చెందుతోంది. దేశంలో ఆర్థిక పరిస్థితి అంతకంతకు దిగజారుతోంది. ఇదే సమయంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వ్యాపిస్తున్నాయి. ఇది ప్రపంచానికి ఏమాత్రం మంచిది కాదని” అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

భారతదేశ అభివృద్ధిలో భారీ కోత
ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం వంటి పరిస్థితులు నెలకొని ఉండటంతో భారత దేశ వృద్ధిలో పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, వెయిటింగ్ ఏజెన్సీలు కోత పెడుతున్నాయి. తాజాగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ కూడా భారతదేశ వృద్ధిరేటును భారీగా తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022 – 23లో భారత్ జీడీపీ వృద్ధి 6.8 శాతానికి పరిమితం అవుతుందని తన నివేదికలో వెలువరించింది. వచ్చే ఏడాది వృద్ధి 6.1% ఉంటుందని పేర్కొన్నది. ఇదే సంస్థ ఈ ఏడాది జూలై నెలలో వృద్ధిరేటును 7.4 % అంచనా వేసింది. ఇప్పుడు అందులో 60 బేసిస్ పాయింట్లు కుదించింది. 2022 ఏప్రిల్ లో ఈ అంచనా 8.2%గా ఉంది. 2021- 22 ఆర్థిక సంవత్సరానికి గానూ భారత్ ఆర్థిక అభివృద్ధి 8.7% కాగా ప్రస్తుత ఏడాది ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం 1.9% మేర వృద్ధి తగ్గనున్నది. విదేశాల్లో భారత వస్తువుల ఉత్పత్తులకు డిమాండ్ బలహీన పడినందువల్ల ఈ ద్వితీయ త్రైమాసికంలో జిడిపి గణనీయంగా తగ్గుతుందని తెలిపింది.
2001 తర్వాత
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు 2022లో 3.2 శాతానికి పరిమితం అవుతుందని, 2023లో ఇది 2.7 శాతం ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. 2001 తర్వాత వృద్ధి ఇంతగా బలహీన పడటం ఇదే ప్రథమం అని తెలిపింది.. 2021లో అంతర్జాతీయ వృద్ధి 6 శాతంగా ఉంది. 2022 ప్రధమార్ధంలో యూఎస్ జిడిపి తగ్గుతుందని, యూరప్ జోన్ కూడా ద్వితీయార్థంలో ప్రతికూల వృద్ధిరేటును నమోదు చేస్తుందని తన రిపోర్టులో వెలువరించింది. కోవిడ్, వరుస లాక్ డౌన్ లు, రియల్టీ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడం తో చైనా వృద్ధి సైతం దెబ్బతింటుందని ఐఎంఎఫ్ వివరించింది.

ఇక ఇదే క్రమంలో మూడు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, యూరోపియన్ యూనియన్, చైనా దేశాల వృద్ధి స్తంభించిపోతుందని, మూడో వంతు ప్రపంచంలో మాంద్యం ఆవరిస్తుందని ఐఎంఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇక వచ్చే ఏడాదిలో ప్రపంచ జనాభా మాంద్యంలో ఉన్నట్టే భావిస్తారని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ రీసెర్చ్ డైరెక్టర్ పియరీ ఒలీవర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ పై రష్యా దాడి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా అస్థిరపరిచిందని ఆయన వివరించారు. వచ్చే ఏడాది అమెరికా వృద్ధిరేటు ఒక శాతానికి తగ్గుతుందని, చైనా జి డి పి రేటు 4.4 శాతానికి పరిమితమవుతుందని వివరించారు. కేంద్ర బ్యాంకులు ద్రవ్య విధానాన్ని కఠిన తరం చేయడం వల్ల వడ్డీ వ్యయాలు పెరిగి అన్ని వ్యాపారాలు దెబ్బతింటున్నాయన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కోవిడ్ కంటే ఎక్కువ దుష్పరిణామాలను ప్రపంచం చవి చూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.