
Economy Of Telangana: తెలంగాణ రాష్ర్టం అభివృద్ధిలో దూసుకుపోతోంది. రాష్ర్టం ఏర్పడిన ఏడేళ్లలో గణనీయమైన అభివృద్ధి సాధించింది. కరోనా కాలంలో కూడా అన్ని ప్రాంతాలు వెనుకబడిపోయినా తెలంగాణ మాత్రం తగు రీతిలో పురోగమిస్తోంది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు అద్భుతంగా ముందుకు వెళ్తున్నాయి. తెలంగాణ 18.5 శాతం ప్రగతి సాధించి ఔరా అనిపిస్తోంది. జాతీయ స్థాయిలో 6.6 శాతం మాత్రమే ఉంది. రాష్ర్టం ఏర్పడ్డాక జీఎస్డీపీ 93.5 శాతం పెరిగింది. దక్షిణాది స్టేట్లలో తెలంగాణ ఆవిర్భావం సమయంలో 4 శాతం వాటా ఉండగా ప్రస్తుతం 5 శాతంగా నమోదైంది. తలసరి ఆదాయంలో కూడా తెలంగాణ మూడో స్థానంలో ఉంది. రాష్ర్ట ఆవిర్భావ సమయంలో పదకొండో స్థానంలో ఉండేది.
తెలంగాణ(Economy Of Telangana) రాష్ర్టం ఏర్పడిన తరువాత ఏడేళ్లలో ధాన్యం ఉత్పత్తి గణనీయంగా అయిదు రెట్లు పెరిగింది. దీంతో మిషన్ కాకతీయ, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, పెండింగులోని సాగనీటి ప్రాజెక్టుల పూర్తి, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ పథకాలతో రాష్ర్టం ముందంజలో ఉంటోంది. రాష్ర్టం ప్రగతి పథంలో నడుస్తోంది. పంటలు బాగా పండటంతో ఆదాయం కూడా పెరుగుతోంది.
మౌలిక రంగాల్లో వృద్ధి పెరగడంతో రాష్ర్టం మెరుగైన వృద్ధి నమోదు చేస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్ లాంటి రంగాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. కరోనా కాలంలో కూడా తెలంగాణ అభివృద్ధికి ఢోకా లేకుండా పోయిందంటే ఎంత డెవలప్ మెంట్ సాధించిందో తెలుస్తూనే ఉంది. దీనికి కారణం పాలకుల పథకాలు కాకుండా ప్రజల సంపాదన కూడా రెట్టింపు అయింది.
ఐటీ రంగంలో కూడా దూసుకెళ్లిపోతోంది. పరిశ్రమల ఏర్పాటుతో కూడా రాష్ర్ట ఆదాయం ఇనుమడిస్తోంది. దీంతో రాష్ర్టం అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధించింది. తెలంగాణ అద్భుత ప్రగతి సాధించేందుకు దోహదపడుతున్న పరిస్థితుల నేపథ్యంలో దేశంలో కూడా మెరుగైన ర్యాంకునే కలిగి ఉంటోంది. దీంతో పలు రంగాల్లో రాష్ర్టం తనదైన ముద్ర వేస్తూ అభివృద్ధి బాట పడుతోంది.