KCR- EC: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి ఎన్ని సంవత్సరాలైనా, రెండు దఫాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం పరిపాలిస్తున్నా తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరూ గుర్తించటం లేదా? అన్నఅంశం తాజాగా తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఆంధ్రాను మళ్లీ కలపాలని ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ కోరుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ నేతలు వాటిని తిప్పి కొడుతున్నారు. ఇదే సమయంలో టీఆర్‌ఎస్ పార్టీని బీఆర్‌ఎస్ పార్టీగా మార్చడానికి ఆమోదం తెలుపుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు అధికారికంగా పంపపింది. అయితే ఆ లేఖ కేసీఆర్‌తోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలను విస్మయానికి గురిచేసింది.

అడ్రస్ మార్చకుండానే..
గులాబీ పార్టీ అధినేత కేసీఆర్‌కు ఈసీ పంపించిన లేఖలో తెలంగాణలో రాష్ట్ర ప్లేసులో ఆంధ్రప్రదేశ్ అని పాత లెటర్ హెడ్ తోనే లేఖ పంపించటం అందరినీ షాక్‌కు గురి చేసింది. తెలంగాణ రాష్ట్రం విడిపోయి ఎనిమిది సంవత్సరాలు దాటినా కూడా ఇంకా ఆంధ్ర ప్రదేశ్ అని కేంద్ర ఎన్నికల సంఘం లేఖ పంపించడం, రాష్ట్ర విభజన జరగక ముందు పంపిన అడ్రస్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంతవరకూ తెలంగాణగా మార్చకపోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది.
అన్ని చోట్ల మారిన రాష్ట్రం పేరు
టీఆర్‌ఎస్ పార్టీ 2001లో ఆవిర్భవించినప్పుడు పార్టీ అడ్రస్ అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరుతో రిజిస్ట్రేషన్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 గా పేర్కొంటూ రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే పార్టీ ఏర్పడిన 13 ఏళ్లకు 2014వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. ఇక అప్పటి నుంచి అధికారికంగా ఆంధ్రప్రదేశ్ అని రాసి ఉన్న అన్ని చోట్ల తెలంగాణ పేరు మారుతూ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఎనిమిది సంవత్సరాలు దాటింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగగా, మూడో అసెంబ్లీ ఎన్నికలు కూడా తెలంగాణ రాష్ట్రం సిద్ధమైంది. ఇక దేశానికే తెలంగాణ మార్గనిర్దేశం చేస్తుందని కూడా కేసీఆర్ పదేపదే చెప్తున్నారు. అయితే తెలంగాణను ఎవరూ గుర్తించటం లేదా అన్న చర్చ ఈసీ లేఖతో జరుగుతుంది.

కేంద్ర ఎన్నికల సంఘం మరచిపోయిందా?
తెలంగాణకు రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించిన కేంద్ర ఎన్నిల సంఘం ఇంతవరకూ తెలంగాణ రాష్ట్ర సమితి అడ్రస్‌ను తన కార్యాలయంలో, వెబ్‌సైట్‌లో మార్చకపోవటంపై విస్మయం వ్యక్తమవుతోంది. టీఆర్‌ఎస్ పార్టీ అడ్రస్‌లో ఇంకా ఆంధ్రప్రదేశ్ అని ఉండడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్రాన్ని గుర్తించడం లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అడ్రస్‌తో ఈసీ పంపిన లేఖ హల్‌చల్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రంతోపాటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా మరిచిపోయిందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.