Rashmika Mandanna: కెరీర్ జోరుగా సాగుతుండగా రష్మిక మందానను వివాదాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఆమెను కన్నడ పరిశ్రమ బ్యాన్ చేసిందంటూ కొద్దిరోజులుగా వార్తలు వెలువడుతున్నాయి. కన్నడ భాషతో పాటు కాంతార చిత్రాన్ని ఉద్దేశిస్తూ రష్మిక చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. డియర్ కామ్రేడ్ చిత్ర ప్రమోషన్స్ సమయంలో ఇతర భాషల మాదిరి కన్నడ కూడా నేను అనర్గళంగా మాట్లాడలేనని రష్మిక కామెంట్ చేశారు. మాతృభాష రాదన్న రష్మిక మాటలు కన్నడిగులను హర్ట్ చేశాయి. అలాగే ఆమె హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ జరుపుకొని క్యాన్సిల్ చేశారు.

ఈ రెండు సంఘటనలు రష్మికపై కన్నడ పరిశ్రమలో అసహనానికి బీజం వేశాయి. తాజాగా కన్నడ పరిశ్రమకు చెందిన కాంతార చిత్రం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. విడుదలైన అన్ని భాషల్లో విజయం సాధించి రికార్డు వసూళ్లు సాధించింది. ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులు కాంతార చిత్రం చూశారా? అని రష్మికను అడిగారు. రష్మిక ఆ చిత్రాన్ని చూడలేదని సమాధానం చెప్పారు. ఆమె సమాధానం కాంతార చిత్రాన్ని కించపరచేదిగా ఉందని కన్నడ పరిశ్రమ వర్గాలు మండిపడ్డాయి.
కొందరు రష్మికకు యాటిట్యూడ్ ఎక్కువైందని కామెంట్స్ కూడా చేశారు. ఈ క్రమంలో రష్మికను కన్నడలో బ్యాన్ చేయాలని నిర్ణయించుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ పరిణామాలపై రష్మిక పెదవి విప్పారు. కన్నడ పరిశ్రమ నన్ను బ్యాన్ చేసిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అలాగే నాకు ఆ పరిశ్రమ పట్ల ప్రేమ, గౌరవం ఉన్నాయి. కాంతార మూవీ నేను మొదట చూడలేదు. అందుకే మీడియా అడిగితే చూడలేదని చెప్పాను. తర్వాత నేను కాంతార చిత్రాన్ని చూసి చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియజేశాను. వారు తిరిగి నాకు రిప్లై కూడా ఇచ్చారు.

ఇవన్నీ నా వ్యక్తిగత విషయాలు. నా పర్సనల్ లైఫ్ ని కూడా కెమెరాల్లో బంధించి చూపించలేను కదా… అని రష్మిక తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని పబ్లిక్ కి తెలియజేయాల్సిన అవసరం లేదని రష్మిక పరోక్షంగా వెల్లడించారు. కాంతార దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి రష్మికను హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. కిరాక్ పార్టీ మూవీ ఆయన దర్శకత్వంలో తెరకెక్కినదే. రక్షిత్ శెట్టి హీరోగా నటించాడు. ఆ మూవీ సమయంలోనే రష్మిక-రక్షిత్ ప్రేమలో పడటం… ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది.