AP Elections 2024: ఏపీలో ఎన్నికల సందడి ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరపడానికి ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా ఏపీకి ఎలక్షన్ కమిషన్ కీలక అధికారులు క్యూ కడుతున్నారు. అన్ని జిల్లాల అధికార యంత్రాంగం తో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా చూసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు.దీంతో ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ వెల్లడించేందుకు ఈసీ కసరత్తు చేస్తున్నట్లు సన్నాహాలు తెలియజేస్తున్నాయి.
ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం ఉందని తెలుస్తోంది. ఏపీలో అధికార పార్టీ రాజకీయ వ్యూహాలను సైతం ప్రారంభించింది. అటు తెలంగాణ ప్రభుత్వం సైతం ఎంపీ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. 20 రోజులు ముందుగానే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. గత కొద్ది రోజులుగా ఎన్నికల సంఘం అధికారులు ఏపీలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే 18 జిల్లాల అధికారులతో సమీక్ష చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని.. యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని.. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు తావు లేకుండా చూసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమంతా ఎలక్షన్ కమిషన్ పరిధిలో చేరుతుంది. ఈ తరుణంలో ఈసీ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేయడం విశేషం. ఇప్పటికే జిల్లాల వారీగా కలెక్టర్లు, ఎస్పీలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈసీ బృందానికి పరిస్థితులు వివరించారు. ఎన్నికల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించేందుకు ఐటీ వేదికలను ఉపయోగించుకోవాలని కీలక అధికారులు సూచించినట్లు సమాచారం. మరోవైపు ఓట్ల తొలగింపు పంచాయితీపై ఆరా తీసినట్లు తెలుస్తోంది.
2019 ఎన్నికల షెడ్యూల్ గురించి కూడా అధికారులు సమీక్షలో ప్రస్తావించినట్లు సమాచారం. పెరిగిన ఓటర్లను అనుసరించి పోలింగ్ ప్రక్రియ ఉంటుందని.. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ లో సార్వత్రిక ఎన్నికలు ఉంటాయని ఈసీ సూచనప్రాయంగా వెల్లడించిందని.. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ- 2024 ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతోందని రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. మొత్తానికైతే ఏపీలో ఎన్నికల సన్నాహాలు మొదలైనట్టే.