JD Lakshminarayana: “ఆయనే ఉంటే ఈ తెల్ల చీర ఎందుకు” అన్నట్టుంది సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాటలు. తాజాగా ఆయన ప్రత్యేక హోదా పల్లవి అందుకున్నారు. ఇస్తామన్న బిజెపి ఇవ్వలేదు. తెస్తామన్న టిడిపి తేలేకపోయింది. మెడలు వంచుతామన్న వైసిపి సైలెంట్ అయ్యింది. ఈ తరుణంలో ముందుకు వచ్చిన జేడీ లక్ష్మీనారాయణ ప్రత్యేక హోదాను ప్రస్తావించడం.. అన్ని పార్టీలు ప్రత్యేక హోదాను మరుగున పడేసేయని ఆక్షేపించడం చూస్తుంటే ఆయన అదే లైన్ తీసుకొని పోరాటాం చేయాలని భావిస్తున్నట్టు ఉన్నారు . అన్ని పార్టీలను నిందించారు. తాను మాత్రం కొత్త తరహా రాజకీయాలు చేస్తానని చెప్పుకొచ్చారు. అయితే ఆయన మాటలు చెప్పడం కంటే.. చేతలుగా చూపించే ప్రయత్నం, అందుకు ఉన్న సాధ్యాసాధ్యాలు గురించి చర్చ నడుస్తోంది. సరిగ్గా రెండు నెలలు ఎన్నికలు ఉన్నాయనగా ఆయన రాజకీయ పార్టీని ప్రకటించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
సమాజంలో జేడీ లక్ష్మీనారాయణకు ఒక గౌరవం ఉంది. బాధ్యత గల అధికారిగా గుర్తింపు ఉంది. ఆయన ఆ స్థాయిలోనే మాట్లాడితే ప్రజలు గుర్తించే అవకాశం ఉంది. కొత్త రాజకీయాలు చేస్తానన్న ఆయన చివరికి సాంప్రదాయ రాజకీయ నేతల మాదిరిగా వ్యవహరిస్తున్నారు. అదే తరహా ప్రకటనలు చేశారు. ఇటువంటి మాటలు చెప్పే నాయకులు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారు. అంతెందుకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సైతం ఇదే తరహా ప్రకటనలు చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. లేనిపోని ప్రకటనలు చేసి నవ్వుల పాలయ్యారు కూడా. ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ కొత్త ఆదర్శాలు చెబుతున్నారు. మొన్నటికి మొన్న జగన్ సర్కార్ విధానాలను పొగిడారు. అప్పుడే అందరిలోనూ అనుమానం మొదలైంది. కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో సొంత పార్టీ పెట్టుకున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. జెడి లాంటి ఇమేజ్ కలిగిన వ్యక్తి సైలెంట్ గా ఉండడం, లేకుంటే సాహసం చేసి పోరాటంలోకి దిగడం ఉత్తమం. కానీ సరిగ్గా ఎన్నికలకు రోజుల వ్యవధి ఉందనగా ఇప్పుడు కొత్త పాటలు చెబుతుండడాన్ని మాత్రం ప్రజలు నమ్మలేకపోతున్నారు.
ప్రత్యేక హోదా పేరు చెప్పి అన్ని పార్టీలు మోసం చేశాయి. విభజన హామీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సూచించింది. అటు తర్వాత వచ్చిన బిజెపి సైతం లేనిపోని భ్రమలు కల్పించింది. ప్రత్యేక హోదా బదులు నిధులు అంగీకరించిన చంద్రబాబు అడ్డంగా బుక్కయ్యారు. ప్రత్యేక హోదా పేరు చెప్పి కేంద్రం మెడలు వంచుతాను అన్న వైసిపి సైతం నైరాశ్యంలోకి వెళ్లిపోయింది. దేవుడిపై భారాన్ని మోపి.. మనకింతే ప్రాప్తం అన్నట్టు వ్యవహరిస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలో ప్రత్యేక హోదా వారు తేలేకపోయారు. వారు అసమర్థులు. నేను తేగలనని చెబుతున్న జేడీ లక్ష్మీనారాయణ చెబుతుండడం మాత్రం నమ్మశక్యం కావడం లేదు. ఇన్ని పార్టీలు మోసం చేసి.. మరుగున పడేసిన అంశం.. తెరపైకి తెచ్చిన జేడీ పెద్ద సాహసమే చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.