DRDO Scientist Pradeep Kurulkar: మిస్సైల్స్ తయారుచేసిన ఆయన.. హనీ ట్రాప్ నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు. పదవీ విరమణ ముందు అడ్డంగా బుక్కయ్యాడు ప్రదీప్ కురుల్కర్. పాకిస్తాన్ హనీట్రాప్ లో పడిన డీఆర్డీవోలోని ప్రముఖ శాస్త్రవేత్త ఆయన. సోషల్ మీడియా ద్వారా సున్నితమైన రహస్యాలను పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ లతో పంచుకున్నారు. ఈ ఆరోపణలపై యాంటీ టెర్రరిజం స్వ్కాడ్ ప్రదీప్ కురుల్కర్ ను ఈ ఏడాది మే 4న అరెస్ట్ చేసింది. డాక్టర్ జరాదాస్ గుప్తా పేరిట ఉన్న అకౌంట్ లో మాట్లాడుతూ దేశీయ రహస్యాలను ఏవిధంగా చెరవేసింది.. పాకిస్తాన్ హనిట్రాప్ లో ఏ విధంగా పడ్డారో సవివరంగా చార్జిషీట్ నమోదుచేసింది. శాస్త్రవేత్త, పెద్ద మనిషి ముసుగులో ప్రదీప్ కురుల్కర్ సాగించిన ఈ అడ్డగోలు వ్యవహారం జుగుప్సాకరంగా ఉంది.
కాగా ఈ కేసుకు సంబంధించి విచారణ పూణేలోని ప్రత్యేక కోర్టులో జూలై 7న సాగింది. భారత అమ్ములపొదిలో ఉండే అనేక రహస్యాలను చేరవేశానన్న కనీస బాధ, పశ్చాత్తాపం కురుల్కర్ లో అసలు కనిపించలేదు. ఆయన వ్యాఖ్యల్లో వ్యంగ్యం కనిపించింది జడ్జికి నమస్కరిస్తూ ‘జైహింద్ సార్’ అని చేసిన సంభోధన కూడా అసాధారణమైన అభివాదంగా కనిపించడం లేదు. ప్రత్యేకించి సాయుధ దళాల్లో మాత్రమే వినిపించే ఈ మాట గూఢచార్యంలో పట్టుబడిన ఓ శాస్త్రవేత్త అత్యంత వ్యంగ్యంగా మాట్లాడడం విమర్శలకు తావిస్తోంది. ఆయనపై మోపిన అభియోగాలకు మించి ఆయన ప్రవర్తన ఉంది.
కాగా 1988లొ సీవీఆర్డీఈ, అవాడి వద్ద ఉన్న డీఆర్డీవోలో ప్రదీప్ చేరారు. సీవోఈపీ పుణేలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేశారు. ఐఐటీ కాన్పూర్ నుంచి పవర్ ఎలక్ట్రానిక్స్‌లో అడ్వాన్స్డ్ కోర్సులను పూర్తిచేశారు. మిలటరీ వాడకం కోసం మిసైల్ లాంచర్లు, మిలటరీ ఇంజినీరింగ్ ఎక్విప్‌మెంట్, అడ్వాన్స్డ్ రోబోటిక్స్, మొబైల్ అన్‌నేమ్డ్ సిస్టమ్స్‌ను రూపొందించడంలో కురుల్కర్ నిపుణుడు.డీఆర్‌డీవోలో ఎన్నో ముఖ్యమైన ప్రాజెక్టులలో కురుల్కర్ పనిచేశారు.
మిసైల్ లాంచ్, గ్రౌండ్ సిస్టమ్స్‌ను అభివృద్ధి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.యాంటీ శాటిలైట్ మిసైల్ ‘మిషన్ శక్తి’ని కురుల్కర్ నేతృత్వంలోనే డీఆర్‌డీవో అభివృద్ధి చేసింది.2000లో ఉత్తమ ప్రచురణకు గాను సైన్స్ డే అవార్డు వచ్చింది. అలాగే 2002లో డీఆర్‌డీవో అగ్ని అవార్డు, ఆకాశ్ ప్రాజెక్ట్‌కు 2008లో డీఆర్‌డీవో అవార్డును కురుల్కర్ పొందారు.మరికొన్ని నెలల్లో కురుల్కర్ పదవీ విరమణ పొందనున్నారు. ఈ సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.