Turkey Underground City: సాధారణంగా మనం ఈ భూమి మీద నివసించాలి అంటే ఎలాంటి చోట వసతి ఏర్పాటు చేసుకుంటాం? మనకు అనుకూలమైన ప్రదేశంలో.. అందంగా నిర్మించుకుంటాం. మన స్థాయికి తగ్గట్టుగా సౌకర్యాలు కల్పించుకుంటాం. గృహమే కదా స్వర్గసీమ అనుకుంటూ అందులో జీవిస్తాం. ఇక ప్రకృతి విపత్తులు సంభవించే ప్రాంతాల్లో అయితే కొంత తేలికపాటిగా గృహాలు నిర్మించుకుంటారు. ఎందుకంటే భూకంపం లాంటివి సంభవించినప్పుడు భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్త పడేందుకే అలాంటి ఏర్పాట్లు చేసుకుంటారు. అసలు ఇదంతా కాదు.. భూగర్భంలోనే ఇళ్ళు ఏర్పాటు చేసుకుంటే..అందులోనూ ఒక నగరాన్ని నిర్మించుకుంటే..ఆ నగరిలో 20,000 మంది వరకు నివాసం ఉండి ఉంటే.. చదువుతుంటే ఆశ్చర్యం కలుగుతోంది కదూ.. ఇంతకీ ఆ స్టోరీ ఏమిటో మీరూ చదివేయండి.
తుర్కీయాలో భూగర్భ నగరం
తుర్కియా.. ఈ భూమ్మీద అత్యంత ప్రాచీన ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడ దొరికే ఆనవాళ్లు పురాతత్వ శాస్త్రవేత్తలకు ఎప్పటికప్పుడు సవాళ్లు విసురుతాయి. వాటి ఆధారంగా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల తమకు లభించిన కొన్ని ఆనవాళ్లను శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయగా ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి.. తుర్కియాలోని కపడోషియా ప్రాంతంలో భూగర్భ నగరాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. భూమి లోపల 285 అడుగుల లోతున 11 అంతస్తుల్లో ఈ నగరాన్ని నిర్మించారు. వాస్తు, నిర్మాణ శైలిని పరిశీలిస్తే ఇది పర్షియన్ సామ్రాజ్యానికి చెందినదిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ భూగర్భ నగరాన్ని క్రీస్తుపూర్వం 550 సంవత్సరం ప్రాంతంలో నిర్మించి ఉంటారని తత్వ శాస్త్రవేత్తలు ఒక అంచనాకు వచ్చారు. అంతే కాదు ఈ భూగర్భ నగరంలో 20వేల మంది నివసించారని వారు చెబుతున్నారు.
ఆశ్చర్యం గొలిపించే ఏర్పాట్లు
ఇక ఈ భూగర్భ నగరంలో నూనె గానుగలు, మద్యం పీపాలు భద్రపరచుకునే గదులు, తిండి గింజలు భద్రపరచుకునే గదులు, ప్రార్థన మందిరాలు వంటివి ఉన్నాయి. ఈ గదుల్లోకి గాలి, వెలుతురు ప్రసరించే విధంగా 180 అడుగుల పొడవైన మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ నగరంలోని గోడలపై అందమైన రంగులతో చిత్రాలు రూపొందించారు. చూసేందుకు అవి నకాషి చిత్రాలను పోలి ఉన్నాయి. అంటే ఆ కాలంలోనే ప్రజలు సాంస్కృతికాంశాలపై ఆసక్తి ప్రదర్శించేవారని అర్థమవుతోంది. అయితే 1963లో ఈ ప్రాంతంలో విహారయాత్రకు వచ్చిన ఓ కుటుంబం ఈ భూగర్భ నగరాన్ని గుర్తించింది. అప్పుడే అది ప్రపంచానికి తెలిసింది. తుర్కియా ప్రాంతంలో దీనికి డెరింకియు అని పేరు పెట్టారు. దానికి తెలుగులో నేలమాలిగ అని అర్థం.