ప్రభుత్వ మత్తు వైద్యుడు సుధాకర్ ఎట్టకేలకు విశాఖ మానసిక వైద్యశాల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సుధాకర్ తల్లి కావేరిబాయి దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టుకు సుధాకర్ ను పోలీసులు, సిబిఐ అరెస్ట్ చేయలేదని ప్రభుత్వం తెలిపింది. దీంతో అతను డిశ్చార్జ్ అవ్వాలనుకుంటే ఆసుపత్రి నిబంధనల ప్రకారం అవ్వచ్చని సూచిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో సుధాకర్ విశాఖ మానసిక ఆసుపత్రి సూపరింటెండెంట్ కు తాను డిశ్చార్జి అవుతానని దరఖాస్తు చేశారు. దరఖాస్తు పరిశీలించిన సూపరింటెండెంట్ డిశ్చార్జ్ అయ్యేందుకు అనుమతి ఇచ్చారు.
దీంతో మానసిక ఆసుపత్రికి సుధాకర్ కుటుంబ సభ్యులు వచ్చి ఆయనను తీసుకువెళ్లారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులకు ఆసుపత్రి వైద్యులు కొన్ని సూచనలు చేశారు. సుధాకర్ కు మరికొన్ని రోజులపాటు చికిత్స కొనసాగించాల్సిన అవసరం ఉందని వేరే ఆసుపత్రిలోనైనా చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచించారు. అనంతరం కుటుంబ సభ్యులు సుధాకర్ ను అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయారు.
కరోనాను ఎదుర్కొనేందుకు మాస్కులు ఇవ్వడం లేదని ప్రభుత్వంపై విమర్శలు చేసిన మత్తు వైద్యుడు సుధాకర్ రావు తొలుత ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అనంతరం గత నెల 16వ తేదీన విశాఖ నగర వీధుల్లో డా.సుధాకర్ ను పబ్లిక్ ప్లేస్ లో న్యూనెన్స్ చేస్తున్నాదంటూ తాటిచెట్లపాలెం పోర్టు ఆస్పత్రి వద్ద తాళ్లతో కట్టేసి పోలీసులు లాఠీలతో దారుణంగా కొట్టిన 4వ టౌన్ పోలీసులు స్టేషన్ కు తరలించి, అనంతరం అక్కడి నుంచి విశాఖ మానసిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తెలుగు మహిళ వి.అనిత హైకోర్టుకు లేఖ రాయడంతో సుమోటోగా కేసు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.