Homeజాతీయ వార్తలుBRS: కారు ఎక్కేందుకు వైద్య నారాయణులు.. కెసిఆర్ ఒప్పుకుంటాడో లేదో?/

BRS: కారు ఎక్కేందుకు వైద్య నారాయణులు.. కెసిఆర్ ఒప్పుకుంటాడో లేదో?/

BRS: రాజకీయమంటే ఒకప్పుడు ఒక సెక్షన్ మాత్రమే అందులోకి వచ్చేందుకు ఇష్టపడేది. కానీ ఎప్పుడైతే డబ్బు చుట్టూ రాజకీయాలు తిరగడం ప్రారంభించాయో.. అప్పటినుంచి బిగ్ షాట్స్ మొత్తం అందులో ప్రవేశిస్తున్నారు. రియల్ ఎస్టేట్ నుంచి లిక్కర్ వ్యాపారం చేసే వారంతా రాజకీయ నాయకులుగా చలామణి అవుతున్నారు. పార్టీలకు దండిగా ఫండ్స్ ఇస్తూ మంత్రులు, ఎంపీలు అయిపోతున్నారు. బీహార్ నుంచి తెలంగాణ దాకా ఇదే పరిస్థితి. అయితే తెలంగాణలో మాత్రం ఈ పరిస్థితి ఇంకా కొంచెం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా అధికార భారత రాష్ట్ర సమితిలో ఎమ్మెల్యేలు, ఎంపీలయిన వ్యాపారవేత్తలే చాలా ఎక్కువమంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఇది కూడా పాతదైపోయింది. ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా కీలక స్థానంలో ఉన్న అధికారులు ఈ దఫా ఎన్నికల్లో గులాబీ కండువా కప్పుకునేందుకు తహతహలాడుతున్నారు. అయితే ప్రభుత్వంలోని అన్ని విభాగాల్లో కల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఈ జాబితాలో ఎక్కువ శాతం ఉండడం విశేషం.

జనవరి 16న తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసిన నేపథ్యంలో.. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మరోవైపు తెలంగాణలో 117 అసెంబ్లీ స్థానాలకు ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటిస్తామని కెసిఆర్ ప్రకటించిన నేపథ్యంలో.. ఆశావాహులు ప్రగతి భవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అయితే వీరిలో వైద్యారోగ్య శాఖకు చెందిన కీలక అధికారులు ఉండటం విశేషం. సుమారు ఆరుగురు అధికారులు అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు పోటీలు పడుతున్నారు. ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావు పేరు ఇన్ని రోజులు కొత్తగూడెం అసెంబ్లీ స్థానానికి పోటీ పడబోతున్నారని ప్రచారం జరిగింది. ఎన్నికల రేసులో ఆయన ఉన్నారని వార్తల్లో వినిపించేది. తాజాగా వైద్య విద్య సంచాలకుడు డాక్టర్ రమేష్ రెడ్డి పేరు కూడా ఈ జాబితాలో చేరింది. అంతేకాదు, రమేష్ రెడ్డికి టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయని ప్రచారం కూడా జరుగుతుంది.

2017 నుంచి డీఎంఈ గా అవుతున్న రమేష్ రెడ్డికి సీఎం కేసీఆర్ వద్ద మంచి పేరు ఉంది. ఆ ప్రచారమే ఆయనకు లాభం చేకూర్చుతుందని తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున ప్రధాన కార్యదర్శిగా పోటీ చేసి గెలిచిన రమేష్ రెడ్డికి విద్యార్థి నాయకుడిగా చేసిన అనుభవమూ ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న రమేష్ రెడ్డి భారత రాష్ట్ర సమితి నుంచి టికెట్ ఆశిస్తున్నారని ఆయన సన్నిత వర్గాలు చెబుతున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కూడా రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. జహీరాబాద్ లేదా కంటోన్మెంట్ నుంచి ఆయన టికెట్ ఆశిస్తున్నారు. నిజానికి 2018లో ఉమ్మడి జిల్లా ఆందోల్ సీటు ఆశించినప్పటికీ.. అధిష్టానం ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఇక రంగారెడ్డి డిఎంహెచ్వో ఆఫీసులో పనిచేస్తున్న టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్ సంగారెడ్డి నియోజకవర్గం నుంచి భారత రాష్ట్ర సమితి టికెట్ ఆశిస్తున్నారు. రాజేందర్ ఇప్పటికే సేవా కార్యక్రమాల పేరుతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారని ఉద్యోగ సంఘాల నాయకులు చెప్తున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు డిఎంహెచ్వో తో పాటు, నిలోఫర్ ఆసుపత్రిలో డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్ కూడా భారత రాష్ట్ర సమితి టికెట్ ఆశిస్తున్నారు. లాలూ ప్రసాద్ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఎస్టి స్థానమైన దేవరకొండ నుంచి పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు.

ప్రజారోగ్య శాఖ సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావు కొత్తగూడెం నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే తన తండ్రి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తన సొంత సామాజిక వర్గం ఓట్లు 35వేల దాకా ఉండడంతో కచ్చితంగా గెలుస్తానని దీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా భారత రాష్ట్ర సమితి కి చెందిన వనమా వెంకటేశ్వరరావు ఉన్నారు. వయోభారం వల్ల వచ్చే ఎన్నికల్లో దాదాపు ఆయన పోటీ చేయకపోవచ్చు. ఆయన కుమారుడు వనమా రాఘవ మీద తీవ్రమైన ఆరోపణలు ఉండడంతో అధిష్టానం గడల శ్రీనివాసరావు వైపే మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular