BJP Parthasarathy: ఏపీలో రాజ్యసభ సీట్ల కేటాయింపు వివాదాస్పదమైంది.ఏపీలో ఎంతో మంది బడుగు బలహీన వర్గాలు ఉండగా.. వారందరినీ కాదని తెలంగాణకు చెందిన ఆర్. కృష్ణయ్య, నిరంజన్ రెడ్డిలకు అత్యున్నత రాజ్యసభ సీట్లు కేటాయించడం వివాదాస్పదమైంది. ఈ క్రమంలోనే దీన్నొక ఉద్యమంగా మలిచేందుకు బీజేపీ రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే ఏపీ రాజ్యసభ సీట్లకు అసలు ఆంధ్రాలో అర్హులైన బీసీలే లేరా? అని తాజాగా ప్రశ్నించారు బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డాక్టర్ పార్థసారథి. రెండు రాజ్యసభ సీట్లు ఇచ్చి బీసీలను ఉద్ధరించమని చెప్పడం హాస్యాస్పదమని ఆయన విమర్శించారు. గత మూడు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ పాలనలో బీసీలు అన్ని రకాలుగా నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈరోజు కర్నూలు పార్లమెంటులోని ఆలూరు నియోజకవర్గం, మండల కేంద్రంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పార్థసారథి మాట్లాడారు. జనాభాలో 54 శాతం ఉన్న 147 బీసీ కులాలకు ఏ విధంగా న్యాయం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో 175 ఎమ్మెల్యే స్థానాల్లో ఎంతమంది బీసీలకు టికెట్ ఇచ్చారని నిలదీశారు. 151 ఎమ్మెల్యేలలో వైసిపి పార్టీలో ఉంటే ఎంత మంది బీసీలు ఉన్నారో లెక్క చెప్పండని ప్రశ్నించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో.. సర్పంచులు , జడ్పీటీసీలు , ఎంపీటీసీల , మున్సిపాలిటీ, కార్పొరేషన్ల ఎన్నికల్లో బీసీలకు రాజ్యాంగ బద్ధంగా ఉన్న 33 శాతం రిజర్వేషన్ ను 18 శాతానికి తగ్గించారని పార్థసారథి ఆరోపించారు. దీని ద్వారా వేలాది మంది బీసీలు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు పొందే అవకాశాన్ని పోగొట్టుకున్నారన్నారు.
రాష్ట్ర బీసీ కార్పొరేషన్ ను.. కులానికి ఒక్క కార్పొరేషన్ గా యాభై మూడు ముక్కలు చేసి , నిధులు లేకుండా నిర్వీర్యం చేసిన ఘనత మీది కాదా? అని పార్థసారథి.. జగన్ ప్రభుత్వాన్ని కడిగేశారు. దేశంలో బీసీలకు రాజ్యాంగబద్ధంగా ఉన్నా 27 శాతం రిజర్వేషన్ ను విద్యలో , ఉద్యోగాల్లో అమలు చేయని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు..
రాష్ట్రంలోని బీసీలు ఈ ప్రభుత్వాన్ని క్షమించరని.. బీసీలకు జరిగిన అన్యాయం పట్ల ప్రజలను గ్రామగ్రామాన తిరిగి చైతన్యం చేస్తామని బీజేపీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. ఈ ప్రభుత్వాన్ని ప్రజల మధ్య దోషిగా నిలబెడతామని స్పష్టం చేశారు.