Homeఆంధ్రప్రదేశ్‌Krishna River- Cable Bridge: కృష్ణా నదిపై రెండంతస్థుల కేబుల్ బ్రిడ్జి... కేంద్రం గ్రీన్...

Krishna River- Cable Bridge: కృష్ణా నదిపై రెండంతస్థుల కేబుల్ బ్రిడ్జి… కేంద్రం గ్రీన్ సిగ్నల్

Krishna River- Cable Bridge: తెలుగు రాష్ట్రాలకు శుభవార్త. దేశంలోనే తొలి రెండంతస్తుల కేబుల్ వంతెన కృష్ణా నదిపై నిర్మితం కానుంది. సోమశీల వద్ద ప్రతిపాదించిన బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర రవాణా, హైవేల మంత్రిత్వ శాఖల ఆధీనంలోని స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ ఆమోదముద్ర వేసింది. ఇటీవల ఢిల్లీలో కమిటీ సమావేశమైంది. మరో రెండు నెలల్లో జాతీయ రహదారుల విభాగం టెండర్లకు పిలవనుంది. వీలైనంత త్వరగా వంతెన నిర్మాణం చేపట్టాలని కేంద్ర రవాణా శాఖ కృతనిశ్చయంతో ఉంది. నిర్మాణ బాధ్యతలు తీసుకునే కంపెనీ రెండేళ్లలో వంతెన నిర్మాణం పూర్తిచేసేలా ఒప్పందం కుదుర్చుకోనుంది. తెలంగాణ, ఆంధ్రాలను కలుపుతూ వంతెన నిర్మించనున్నారు. వంతెన పైన వాహన రాకపోకలకు వీలుగా క్యారేజ్ వే ఉంటుంది. కిందన సోమశీల ప్రాజెక్టు పరిసరాల అందాలను, కృష్ణా నది పరవళ్లను తిలకించేందుకు గాజు వంతెన నిర్మించనున్నారు.

Krishna River- Cable Bridge
Krishna River- Cable Bridge

తెలంగాణ నుంచి రాయలసీమకు దూరాభారాన్ని తగ్గించేందుకే కొత్తగా ఈ కేబుల్ వంతెన నిర్మాణానికి ప్రతిపాదించారు. నంద్యాల, తిరుపతి వెళ్లాలంటే కర్నూలు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. అదే కొల్లాపూర్ మీదుగా కృష్ణా నదిపై వంతెన నిర్మిస్తే దాదాపు 90 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, శ్రీశైలం రహదారిని నాలుగు లేన్లగా విస్తరించాలని నిర్ణయించారు. ఇందుకు కృష్ణా నదిపై వంతెన నిర్మాణం తప్పనిసరి. కానీ ఏదో సాదాసీదాగా కాకుండా ఐకానిక్ ప్రాజెక్టుగా నిర్మించాలని అధికారులు భావించారు. అందుకు ప్రతిపాదనలు పంపించారు. 800 మీటర్ల పొడవు ఉన్న వంతెనపై క్యారేజ్ వే తో పాటు గాజు బ్రిడ్జి నిర్మాణానికి రూ.1,082 కోట్లు అవసరమని అంచనా వేశారు. దీనికి కేంద్ర రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ ఆమోదముద్ర వేయడం, టెండర్ల ప్రక్రియకు సిద్ధపడడంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Krishna River- Cable Bridge
Krishna River- Cable Bridge

ఈ వంతెన నిర్మాణం పూర్తయితే ఇదో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని అధికారులు భావిస్తున్నారు. పాపికొండలు తరహాలో మధురానుభూతులు ఇస్తుందని చెబుతున్నారు. సోమశీల ప్రాజెక్టు పరిసరాలు, కృష్ణానదిని తిలకించేందుకు నిత్యం వేలాది మంది పర్యాటకులు ఈ ప్రాంతానికి తరలివస్తుంటారు. సరైన రవాణా సదుపాయం లేకున్నప్పుడే పర్యాటకు తాకిడి అధికంగా ఉంటుంది. అటువంటిది వంతెన నిర్మాణం పూర్తయితే తిరుపతి,శ్రీశైలం వచ్చే భక్తలు తప్పనిసరిగా సోమశీల ప్రాజెక్టు, కృష్ణా నదిని సందర్శిస్తారు.పర్యాటకంగా కూడాఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సైతం మెరుగుపడతాయి. అసలు స్తంభాలు లేకుండా.. ఇరువైపులా 15+15 తీగలను ఏర్పాటుచేసి అత్యాధునిక టెక్నాలజీతో వంతెన నిర్మాణం చేపట్టనున్నారు. తెలుగు రాష్ట్రాలకు ఇదో ఐకాన్ ప్రాజెక్టుగా రూపొందుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version