Pawan Kalyan- YCP: జనసేన అధ్యక్షుడు పవన్ ఎటువంటి విమర్శలు చేసినా మనసు పెట్టి చేస్తారు. ప్రత్యర్థుల గుండెలకు తాకేలా వ్యాఖ్యానిస్తారు. ప్రజలకు దగ్గరయ్యేలా ఆ మాటలు ఉంటాయి. ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా ఆదివారం రాత్రి నుంచి పెట్టిన ట్విట్టర్ కామెంట్లు పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఎందుకీ గర్జనలు? పేరుతో సోషల్ మీడియా వేదికగా సంధించిన ప్రశ్నలు వైరల్ అవుతున్నాయి. మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ నేతలు ఈ నెల 15 విశాఖ గర్జనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనికి పవన్ కళ్యాణ్ కౌంటర్ అటాక్ ఇస్తున్నారు. వైసీపీ నేతలకు వరుసగా ప్రశ్నలు సంధిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల నుంచి వారి అవినీతి వరకూ ఎండగడుతూ క్లీయర్ కట్ గా తన ప్రశ్నల పరంపరను కొనసాగిస్తున్నారు. మద్య నిషేధం నుంచి అమరావతి వరకూ మడమతిప్పిన వైనాన్ని… ప్రతీ అంశంపై ప్రశ్నలవర్షం కురిపిస్తున్నారు.. వైసీపీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

వైసీపీ నేతలు ప్రాంతీయ తత్వాన్ని రగిల్చే ప్రయత్నంలో ఉండగా.. అదే సమయంలో పవన్ సీన్ లోకి వచ్చారు. ఆదివారం రాత్రి నుంచి ఆయన ట్విట్టర్ ఖాతా నుంచి హాట్ హాట్ కామెంట్స్ వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను కడిగి పారేసిన పవన్ వాటిని ప్రజల ముందు ఉంచడంలో సక్సెస్ అయ్యారు. విస్తృత చర్చకు అవకాశం కల్పించారు. వైసీపీ గద్దెనెక్కిన తరువాత ప్రభుత్వ చర్యలతో ప్రతీవర్గం ఇబ్బంది పడింది. మద్యం ధరల పెంపు, ఇసుక దోపిడీ, పన్నుల పెంపు..ఇలా అన్నివర్గాలపై దాడిచేసింది. సంక్షేమం మాటున నిలువునా దోచుకునే ప్రయత్నం చేసింది. వీటిన్నింటిపైనా పవన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. వైసీపీ నేతల ప్రాంతీయ వాదం ట్రాప్ లో పడొద్దని సంకేతాలిచ్చారు. అయితే విశాఖ కేంద్రంగా జరుగుతున్న భూ బాగోతాలను పవన్ బయటపెట్టడంతో వైసీపీ నేతల విశాఖ ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్ ఆరాటం ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతోంది.

వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత కన్వర్టెట్ పాలిట్రిక్స్ జరుగుతునే ఉన్నాయి. ప్రభుత్వ వైఫల్యాలు బయటపడినప్పుడు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఏదో ఒక ఇష్యూను తెరపైకి తెస్తున్నారు. సంబంధం లేని అంశాలను తెరపైకి తెచ్చి కొత్త చర్చకు నాంది పలుకుతున్నారు. ప్రజల్లో ఒకరకమైన అయోమయాన్ని, గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. విపక్ష నేతగా నాడు జగన్ అమరావతి రాజధానికి సమ్మతించారు. మద్దతు ప్రకటించారు కూడా. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానులంటూ మడత పెచీ వేశారు. సాధ్యం కాదని తెలిసినా ప్రజల మధ్య ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొట్టేలా వైసీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలో పవన్ వైసీపీకి కౌంటర్ ఇచ్చారు. ప్రజల ముందు నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే పవన్ అడిగిన ప్రశ్నలకు వైసీపీ నేతల దగ్గర సమాధానాలు ఉండవు. కానీ తమ సహజ శైలిని బయటపెట్టి పవన్ పై వ్యక్తిగత విమర్శలకు దిగుతారు. ఈ సారి కూడా అదే ఉంటుంది. అంతకు మించి ఊహించుకోవడానికి వైసీపీ నేతల వద్ద ఏమీ ఉండదని అందరికీ తెలిసిందే.