KCR- TRS MLAs Purchase Case: తెలంగాణలో సంచలనం రేపిన మోయినాబాద్ ఫామ్‌హౌస్ ఘటనపై జాతీయ పార్టీలు స్పందించడం లేదు. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ప్రయత్నించిందని స్టింగ్ ఆపరేషన్‌తో బయట పెట్టినా.. కేసీఆర్‌కు జాతీయ స్థాయిలో మద్దతు కనిపించడం లేదు. బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించేవారు కూడా ఈ ఘటనను లైట్ తీసుకున్నారు. ఈ ఇష్యూను దేశవ్యాప్తంగా సంచలనం చేసి బీజేపీని డ్యామేజ్ చేయాలని, తాను రాజకీయ లబ్ధి పొందాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భావించారు. కానీ, ఆశించిన మైలేజీ రాకపోగా, ఈ ఘటన రివర్స్ కావడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది. దీంతో జాతీయ పార్టీల నాయకులతోపాటు, ఇతర రాష్ట్రాల్లో అధికారంలోఉన్న ప్రాంతీయ పార్టీల నాయకులు కూడా పట్టించుకోవడం లేదు.

దేశవ్యాప్తంగా హైలెట్ కావాలి..
కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాలను గురి పెట్టారు. టీఆర్‌ఎస్ పార్టీని ఇటీవలే బీఆర్‌ఎస్‌గా మార్చారు. ఇక ఏం చేసినాం జాతీయ స్థాయిలో హైలెట్ చేద్దామనుకుంటున్నారు. అందుకే మోయినాబాద్ ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ నేత బీఎల్.సంతోష్ పేర్లు బయట పెట్టేలా చేశారు. అయినా.. బీజేపీ వ్యతిరేక పార్టీలు స్పందించడం లేదు. జాతీయస్థాయిలో కేసీఆర్‌కు మద్దతు రావడం లేదు. ఢిల్లీలో ప్రభుత్వాన్ని కూల్చబోతున్నారని ఆడియో టేపుల్లో ఉన్నా కేజ్రీవాల్ స్పందించలేదు. మనీష్ సిసోడియా మాత్రమే ముక్తసరిగా స్పందించారు. బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేస్తామని ప్రకటించిన కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు. వీరిద్దరు మినహా మరో జాతీయ, ప్రాంతీయ పార్టీ నేత కూడా కేసీఆర్‌కు సంఘిభావం చెప్పలేదు. పలువురు ఫోన్లు చేశారని మీడియాలో ప్రచారం జరిగింది కానీ అదంతా ప్రచారమే.
ముఖ్యమంత్రుల మౌనం..
బీజేపీ ఆకర్ష్‌కు బలైపోయిన శివసేన లాంటి పార్టీలు కూడా స్పందించలేదు. బీజేపీని వ్యతిరేకించే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఓడిశా, కేరళ సీఎంలు స్టాలిన్, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, పినరయి విజయన్ కూడా ఈ ఘటనను లైట్ తీసుకున్నారు. బీహార్ సీఎం ఇటీవలే ఎన్డీయే నుంచి బటయకు వచ్చారు. జీవితంలో ఇక బీజేపీతో కలవబోనని కూడా ప్రకటించారు. ఆయన కూడా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎర ఘటనపై మౌనం వహిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ ప్రతిపక్ష నేత, సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్ కూడా కేసీఆర్‌కు మద్దతుగా నిలవలేదు.
కేసీఆర్ డైరక్షన్‌లో జరిగినట్లుగా అనుమానం..
మోయినాబాద్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఘటన తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలోనే జరిగిందని విపక్ష పార్టీల జాతీయ నేతలు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ వ్యతిరేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇదే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ తన స్వపప్రయోజనాల కోసమే రాజకీయాలు చేస్తారని, ఆయన చసే పోరాటం వెనుక దేశ ప్రయోజనాలుగానీ, ప్రజలకు సబంధించిన సమస్యలు కానీ లేవన్న భావనలో విపక్షాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో బీజేపీతో అంటకాగి, తెలంగాణలో బీజేపీ బలపడిన తర్వాత మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న తీరును జాతీయ నేతలతోపాటు ఇతర రాష్ట్రాల సీఎంలు గమనిస్తున్నారు. అందుకే విపక్షాలు కూటమిగా ఏర్పడినా కేసీఆర్‌ను మాత్రం అందులో చేర్చుకోవడం లేదు. ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల సమయంలోను కేసీఆర్‌ను విపక్షాలు లైట్ తీసుకున్నాయి. ఇప్పుడు జాతీయ పార్టీ పెట్టిన నేపథ్యంలో ఆయనకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్న భావనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

గతంలో టీఆర్‌ఎస్ చేసింది ఏమిటి..
బీజేపీ తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనాలని చూసిందని కేసీఆర్ ప్రచారం చేస్తున్నా.. టీఆర్‌ఎస్ పార్టీ ఏమైనా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తోందా అన్న అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. ఎలాంటి హామీలు ఇవ్వకుండానే మొదటి సారి అధికారంలోకి వచ్చినప్పుడు కానీ.. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు కానీ కేసీఆర్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారా అని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల బీజేపీకి చెందిన స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ ఏమీ ఆశించకుండానే టీఆర్‌ఎస్‌లో చేరారా అని అంటున్నారు. తెలంగాణలో ప్రతిపక్షమే లేకుండా చేయాలని భావిస్తున్న కేసీఆర్‌కు తమ ఎమ్మెల్యేలను బీజేపీ కొనాలని చూస్తోందని ఆరోపించే నైతిక హక్కు ఎక్కడిదని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు నిలదీస్తున్నారు. తెలంగాణ రాజకీయాలను ముందు నుంచి గమనిస్తున్న విపక్ష నేతలు కూడా కేసీఆర్‌కు మద్దతు ఇవ్వడానికి వెనుకాడుతున్నారు.
అందుకే ఎమ్మెల్యేలకు ఎర అంశాన్ని టీఆర్‌ఎస్ కూడా జాతీయ స్థాయిలో హైలెట్ చేయలేకపోతోందన్న వాదన వినిపిస్తోంది. ఇతర పార్టీల నేతలు కూడా.. తాము సమర్థిస్తే.. ఇదే అంటారన్న భావనతో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే కేసీఆర్ ఆశించిన మద్దతు విపక్షాల నుంచి లభించడం లేదని సమాచారం.