
ఆడు మగడ్రా బుజ్జీ.. అంటున్నారట ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను చూసి.. అమెరికాకు ధీటుగా ఎదిగి.. ఆర్థిక వ్యవస్థతో అగ్రరాజ్యాన్నే ఢీకొట్టాలని చూస్తున్న చైనాకు ట్రంప్ గట్టి షాక్ ఇచ్చాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థను గుప్పిట పట్టి చైనా చేస్తున్న ఆగడాలకు చెక్ పెట్టాడు. ఇప్పుడు డబ్ల్యూ.హెచ్.వోతోపాటు చైనాపై ఆంక్షలు వేసి ట్రంప్ మొండోడిని అని అనిపించుకున్నారు. ఇంతవరకూ ఏ అమెరికా అధ్యక్షుడు చేయలేని సాహసాన్ని చేసి ట్రంప్ ఔరా అనిపించుకున్నాడు.
*ఇంతకీ ట్రంప్ ఏం చేశాడు?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.వో)తో తాము పూర్తిగా తెగదెంపులు చేసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నెలకొల్పిన ఐక్యరాజ్యసమితిలో భాగమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికా వైదొలగడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది ఇప్పుడు ఆందోళనగా ఉంది. ఎందుకంటే ఐక్యరాజ్యసమితి సహా ప్రపంచ ఆరోగ్య సంస్థలు నడిచేవి అమెరికా ఇచ్చే నిధులతోనే. అలాంటిది అమెరికా ఇప్పుడు వైదొలగడం డబ్ల్యూహెచ్.వోకు పెద్ద ఎదురుదెబ్బగా చెబుతున్నారు.
*చైనాను వెనకేసుకొచ్చినందుకు ఈ చర్య
శుక్రవారం వైట్ హౌస్ లో ట్రంప్ మాట్లాడారు. మహమ్మారి విషయంలో చైనాను డబ్ల్యూ.హెచ్.వో వెనకేసుకొచ్చి నిర్లక్ష్యం వహించి ప్రపంచవ్యాప్తంగా అపార ప్రాణ, ఆర్థిక నష్టాలకు కారణమయ్యాయని ఆరోపించారు. డబ్ల్యూ.హెచ్.వోకు ఇచ్చే నిధులను ఇతర ప్రపంచ ప్రజారోగ్య సంస్థలకు మళ్లిస్తామని ట్రంప్ తెలిపారు.
*చైనాపై ఆంక్షలతో ట్రంప్ సంచలనం
డబ్ల్యూ.హెచ్.వోపైనే కాదు.. వైరస్ విషయంలో నిజాలను దాచిన చైనాపై ఆంక్షలు విధిస్తున్నట్టు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. తమ దేశ చట్టాలను గౌరవించని చైనా కంపెనీలపై చర్యలు తీసుకుంటామని ట్రంప్ తెలిపారు. తమ దేశ భద్రతకు ముప్పుగా పరిణమించే చైనా పౌరులను ఇకపై అమెరికాలోకి అనుమతించబోమని తేల్చిచెప్పారు.
*అమెరికాలో చైనా పెట్టుబడులకు చెక్
ఇక నుంచి అమెరికాలో చైనా పెట్టుబడుల విషయంలోనూ నిబంధనల్ని కఠినతరం చేస్తామని ట్రంప్ ప్రకటించారు. హాంకాంగ్ స్వేచ్ఛకు తూట్లు పొడిచే బిల్లును చైనా ఆమోదించడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా అమెరికాను చైనా కొల్లగొడుతోందని ట్రంప్ ఆరోపించారు. మేధో హక్కులతోపాటు బిలియన్ల డాలర్ల విలువైన పెట్టుబడుల్ని అక్రమమార్గాన మళ్లించుకుందన్నారు. దేశ ప్రయోజనాల విషయంలో చైనాతో రాజీపడమని ట్రంప్ తేల్చిచెప్పారు.
*ప్రపంచానికే షాకిచ్చిన ట్రంప్
ఇలా ట్రంప్ ఇన్నాళ్లు చైనాను కేవలం బెదిరిస్తున్నాడనే అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు నిజంగా ఆంక్షలువేస్తూ.. చైనా కంపెనీలకు అమెరికాలో చెక్ పెడుతూ తీసుకున్న సంచలన నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను విస్తుపోయేలా చేశాయి. చైనాకు ఇది పెద్ద ఆర్థికనష్టంగా అభివర్ణిస్తున్నారు. వచ్చే అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ట్రంప్ అమెరికా ఫస్ట్ అనే నినాదానికి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే కరోనాను వ్యాపించిన చైనాపై చర్యలకు దిగి అమెరికన్ల సానుభూతి కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. చైనాపై ఆంక్షలతో ప్రపంచానికే షాకిచ్చేలా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో నిజంగానే ట్రంప్ మగాడ్రా బుజ్జి అని అనిపించుకున్నాడు
–నరేశ్ ఎన్నం