
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. వలస కార్మికులు, నిరుపేదలకు భద్రత, ఆహారం, వసతి, రవాణా సౌకర్యం కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. నాలుగు అంశాలపై ‘స్పీకప్ ఇండియా’ పేరుతో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో సోషల్ మీడియా పోరాటం కొనసాగుతోందని ఈ సందర్భంగా ఉత్తమ్ తెలిపారు. ఏఐసీసీ పిలుపు మేరకు ఈ అన్ లైన్ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొంటున్నారని ఉత్తమ్ వివరించారు.
హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలోనే అత్యంత తక్కువ కరోనా పరీక్షలు జరిగింది ఒక్క తెలంగాణలోనే అని ఉత్తమ్ అన్నారు. రోజుకు 5 వేల కరోనా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్.. ఆ దిశగా ఎందుకు కరోనా పరీక్షలు చేయడంలేదో చెప్పాలన్నారు. హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా కరోనా పరీక్షల విషయంలో ప్రభుత్వం తీరుమార్చుకోవడం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు.