
దేశంలోని చైనా వైరస్ ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం లాక్డౌన్ 4.0 కొనసాగుతోంది. మే 31తో లాక్డౌన్ 4.0 ముగియనుంది. లాక్డౌన్ 3.0 నుంచి కేంద్రం పలు సడలింపులిస్తూ వస్తోంది. క్రమంగా ఒక్కో రంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులిస్తున్నారు. ఈనేపథ్యంలో లాక్డౌన్ 3.0లో, లాక్డౌన్ 4.0లో దాదాపుగా అన్నిరంగాలకు సడలింపులు వచ్చినట్లే కన్పిస్తోంది. అయితే కొన్ని భారీ పరిశ్రమలు, థియేటర్లు, దేవాలయాలు, ప్రార్థనామందిరాలు, పాఠశాలలు, కళాశాలలకు మాత్రం మినహాయింపు మాత్రం లభించడం లేదు. అయితే లాక్డౌన్ 5.0లో మరికొన్ని రంగాలకు మినహాయింపు లభించే అవకాశం ఉంది. అయితే ఇందులో విద్యారంగం ఉంటుందా? అనేది మాత్రం తేలాల్సి ఉంది. విద్యార్థులకు పరీక్ష నిర్వహించకపోతే ఆ ప్రభావం అకాడమిక్ క్యాలెండర్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్షల నిర్వహాణపై తగు చర్యలు తీసుకుంటున్నాయి.
డిగ్రీ, పీజీ పరీక్షలపై క్లారిటీ..
ఇప్పటికే తెలంగాణలో పదో తరగతి పరీక్షల తేదీలను విద్యాశాఖ ప్రకటించింది. జూన్ 8నుంచి నుంచి జూలై 5 వరకు పరీక్షలు జరుగనున్నాయి. తాజాగా డిగ్రీ, పీజీ పరీక్షలకు సంబంధించిన మార్గదర్శకాలను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు జూన్ 20నుంచి పరీక్షలు నిర్వహించుకోవచ్చని యూనివర్సిటీలకు అనుమతినిచ్చింది. తుది సెమిస్టర్ పరీక్షలు మాత్రమే నిర్వహించాలని సూచించింది.
అదే విధంగా పరీక్షా సమయాన్ని రెండు గంటలకు కుదించాలని, ప్రశ్నాపత్రంలోనూ ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వాలని సూచించింది. ప్రాజెక్టులు, సెమినార్లు, వైవాలు ఆన్‌లైన్లోనే నిర్వహించాలని స్పష్టం చేసింది. మిగతా సెమిస్టర్లు రాసే విద్యార్థులకు నవంబర్ లేదా డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. ఈ విద్యార్థులను పరీక్షలు లేకుండానే తాత్కాలికంగా ప్రమోట్ చేయాలని ఉన్నతా విద్యామండలి సూచనలు చేసింది.