
Siddipet Additional Collector: తెలంగాణలో ఒకవైపు లిక్కర్ స్కాం.. ఇంకోవైపు ప్రశ్నపత్రాల లీకేజీ అంశాలు హాట్ టాపిక్ అవుతుంటే.. మరోవైపు వీధికుక్కల దాడులు మళ్లీ పెరుగుతున్నాయి. నెల క్రితం హైదరాబాద్ అంబర్‌పేటలో ఓ బాలుడిని కుక్కలు చంపేశాయి. ఆ తర్వాత అనేక ఘటనలు వెలుగు చూశాయి. తాజాగా సిద్దిపేట అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి కూడా వీధికుక్క బారిన పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన శనివారమే జరిగినట్లు తెలుస్తోంది. సిద్ధిపేట కలెక్టర్ క్వార్టర్స్ దగ్గర వీధికుక్కలు వచ్చీపోయేవాళ్ల మీద దాడులకు తెగబడుతున్నా.. ఇంతకాలం మున్సిపల్ సిబ్బంది పట్టించుకోలేదు. తాజాగా అదనపు కలెక్టర్‌నే కరవడంతో రంగంలోకి దిగారు.
తమదాకా వస్తేకానీ…
ఏదైనా సమస్య, బాధ గురించి ప్రజలు అధికారులకు చెబితే లైట్ తీసుకుంటారు. అదే సమస్య, బాధ తమవరకు వస్తేకానీ దాని తీవ్రత అర్థం కాదు. కలెక్టరేట్ క్వార్టర్స్‌లో ఉండే అదనపు కలెక్టర్(రెవెన్యూ) శ్రీనివాస్‌రెడ్డి శనివారం రాత్రి వాకింగ్ చేస్తుండగా వీధికుక్క దాడి చేసినట్లు తెలుస్తోంది. వాకింగ్ చేస్తున్న సమయంలో ఓ కుక్క ఆయన పిక్కలను పట్టేసి గాయపరిచింది. ఆయన కేకలు వేయడంతో అక్కడే ఉన్న కొందరు ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ఆయనపై దాడి తర్వాత ఆ శునకం.. మరో బాలుడిపై, అలాగే కలెక్టర్ పెంపుడు కుక్కపైనా దాడి చేసి కరిచిందని స్థానికులు చెప్తున్నారు.
ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా..
సిద్దిపేట పట్టణంలో కుక్కల స్వైర విహారంపై ప్రజలు అనేకసార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ ఆ ఫిర్యాదులను లైట్‌గా తీసుకున్నారు. మొక్కుబడిగా కుక్కలను పట్టుకున్నట్లు చేసి చేతులు దులుపుకున్నారు. తాజాగా అదనపు కలెక్టర్‌పైనే దాడిచేయడంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మున్సిపల్ సిబ్బంది కుక్కల వేట మొదలు పెట్టారు. జీహెచ్‌ఎంసీలో కూడా ఇదే తరహాలో బాలుడిపై దాడి తర్వాతనే మున్సిపల్ సిబ్బంది శునకాల తరలింపు మొదలు పెట్టారు.
హరీశ్‌రావు ఇలాఖాలో..
సిద్దిపేట అనగానే రాష్ట్ర ప్రజలకు హరీశ్‌రావు, ఆయన చేసిన అభివృద్ధి గుర్తొస్తుంది. రాష్ట్ర అర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఇలాఖాలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగతా గ్రామాలు, పట్టణాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్న విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా వరుస ఘటనలు జరుగుతున్నా.. తన నియోజకవర్గ కేంద్రంలో ఉన్న సమస్యను మాత్రం హరీశ్‌రావు పట్టించుకోవడం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇందుకు తాజాగా అదనపు కలెక్టర్‌పై కుక్క దాడిచేయడమే ఇందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు.

కలెక్టర్ క్వార్టర్స్ వద్ద వీధికుక్కల సంచారంపై గతంలోనూ ఫిర్యాదు చేసినా ఏనాడూ పట్టించుకోలేదని, ఇప్పుడు ఉన్నతాధికారి మీద దాడి చేయడంతో ఆగమేఘాల మీద చర్యలకు దిగారని విమర్శిస్తున్నారు స్థానికులు. ఊళ్లో కుక్కల బెడద తీరాలంటే.. అవి ముందుగా స్థానిక అధికారినో, ప్రజా ప్రతినిధినో కరవాలని అంటున్నారు.