Etela Rajender: హుజూరాబాద్ ఎన్నిక దగ్గరకొచ్చింది. రేపు ఈ సమయానికి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ గెలుపోటముల సమీకరణలు మారిపోతున్నాయి. హుజూరాబాద్ తమదే లేదు తమదే నంటూ రెండు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మొదటి నుంచి స్థానిక నేతగా గుర్తింపు పొందిన ఈటల రాజేందర్ మరింత నమ్మకంతో ఉన్నారు. తనకు వ్యక్తిగతంగా ఉన్న అభిమానమే గెలిపిస్తుందని గట్టిగా చెబుతున్నారు.

ఈ గెలుపు ఈటలకు, బీజేపీకి అత్యవసరం..
ఆత్మగౌరవం అనే నినాదంతో మంత్రి, ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు ఈటల రాజేందర్. అనేక చర్చల తరువాత ఆయన బీజేపీలోకి చేరారు. అదే పార్టీ నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇటు టీఆర్ఎస్ కూడా స్థానిక విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవన్‌ను రంగంలోకి దింపింది. బీసీ బిడ్డ, స్థానికుడు, ఉద్యమ నాయకుడు అనే నినాదంతో ప్రచారంలోకి దిగింది. ఈ ఎన్నికలను టీఆర్ ఎస్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండు పార్టీలు హోరా హోరీగా ప్రచారంలో దూసుకెళ్లాయి. అయితే ఈ గెలుపు రెండు పార్టీలకు చాలా అవసరం. రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ భవితవ్యం తేల్చే ఎన్నికలుగా దీనిని భావిస్తున్నారు. టీఆర్ఎస్ గెలిస్తే ఇక పార్టీకి తిరుగులేదని నిరూపించవచ్చని ఆ పార్టీ నాయకులు అనుకుంటున్నారు.
అయితే విజయం ఈటల రాజేందర్‌కు, బీజేపీకి చాలా అవసరం. బీజేపీ గెలిస్తే రాష్ట్రంలో పార్టీ బలంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టేందుకు అవకాశం ఉంటుందని ఆ పార్టీ భావిస్తోంది. ఈ విజయం బీజేపీకి అనుకూలంగా వస్తే రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనపై అసంతృప్తిగా ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు, నాయకులు బయటకి వచ్చే అవకాశం ఉందని అనుకుంటోంది. ఇది తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆ పార్టీ నాయకులు అనుకుంటున్నారు.
Also Read: YSRTP: వైఎస్ఆర్ టీపీ బలోపేతం కోసం టీఆర్ఎస్ కృషి..
ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్‌ను తేల్చేవి ?
ఈ ఎన్నికలు ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్‌ను తేల్చే ఎన్నికలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చాలా ఏళ్లుగా క్రీయాశీల రాజకీయాల్లో చురుకుగా ఉన్న రాజేందర్.. ఇటీవల జరిగిన పరిణామాల వల్ల కొంత ఇబ్బందికి గురి అయ్యారు. ఆయనకు బీసీ నాయకుడిగా, బలమైన వ్యక్తిత్వం ఉన్న మనిషిగా తెలంగాణలో గుర్తింపు ఉంది. తెలంగాణ ఉద్యమంలో ముందు నుంచి చాలా కీలకంగా పని చేశారు. అయితే కొన్ని రాజకీయ పరిణామాల వల్ల ఆయన టీఆర్ ఎస్ వదిలి బీజేపీలోకి చేరాల్సి వచ్చింది. ఈ ఎన్నికలు ఆయన వ్యక్తిగత చరిష్మాను రుజువు చేయనున్నాయి. స్థానికుల్లో ఆయనకు ఉన్న అభిమానాన్ని తెలియజేయనున్నాయి. మరి హుజూరాబాద్ ఓటరు ఏం చేయబోతున్నాడో తెలియాలంటే నవంబర్ 2వ తేదీ వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది.
Also Read: Revanth Reddy: కేసీఆర్ తెలంగాణవాదంపై అనుమానం వ్యక్తం చేస్తున్న రేవంత్ ? ఎందుకు ?