Nani’s challenge: కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటాన్ని ఆపార్టీ నేతలు గట్టిగానే సద్వినియోగం చేసుకుంటున్నారు. తెలంగాణ బీజేపీ నేతలతో టీఆర్ఎస్ సర్కారుతో ఢీ అంటే ఢీ అంటూ పార్టీని ముందుకు తీసుకెళుతున్నారు. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అనే స్థాయికి తెలంగాణ బీజేపీ ఎదిగింది. దీంతో తెలంగాణ బీజేపీ నేతల్లో కొత్త ఉత్సాహం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది.

ఏపీలో మాత్రం బీజేపీ పరిస్థితి భిన్నంగా ఉంది. ఉమ్మడి రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ తోపాటు బీజేపీ కూడా కారణమని ఏపీవాసులు బలంగా నమ్ముతున్నారు. దీంతో బీజేపీకి ఇక్కడ పెద్దగా ఎదుగుదల లేకుండా పోతుంది. ఇలాంటి సమయంలోనే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకం అయ్యాక బీజేపీ కొంతగాడిన పడినట్లు కన్పిస్తోంది. పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేలా ఆయన వరుస కార్యక్రమాలు చేస్తూ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు.
Also Read: AP Theaters Issue: జగన్ తో భేటీ… ఏమైనా మేలు జరుగుతుందా ?
జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకోవడం కూడా ఆపార్టీకి బాగానే కలిసి వచ్చింది. మరోవైపు జగన్ సర్కారును సోము వీర్రాజు ప్రజా సమస్యలపై గట్టిగా నిలదీస్తూ ఎదురుదాడికి దిగుతున్నారు. బీజేపీలోని కోవర్డులను పని పడుతున్న సోమువీర్రాజు జగన్ సర్కారు వైఫల్యాలను అదే స్థాయిలో ప్రజల్లో ఎండగడుతుండటం ఆపార్టీకి బాగా కలిసి వస్తోంది.
ఈక్రమంలోనే 2024 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని సోము వీర్రాజు మీడియాముఖంగా బల్లగుద్ది వాదిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలపై తాజాగా మంత్రి కోడాలి నాని తనదైన శైలిలో స్పందించారు. బీజేపీ నేతల వ్యాఖ్యలు కొడాలి నానికి ఇరిటేట్ తెప్పించాయో ఏమోకానీ ఆపార్టీ అధ్యక్షుడికి బహిరంగ సవాల్ విసిరారు.
రాబోయే ఎన్నికల్లో బీజేపీ పట్టుమని 35స్థానాల్లో కనీసం డిపాజిట్ తెచ్చుకోవాలన్నారు. 10నుంచి 20శాతం ఓట్లు తెచ్చుకున్నా గొప్ప విషయమేనని ఎద్దేవా చేశారు. ఏపీలో ప్రతిపక్షాలు ఉన్నాయని చెప్పుకోవడమే కానీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదన్నారు. బీజేపీ 35 స్థానాల్లో ముందుగా డిపాజిట్ తెచ్చుకోవాలని ఆ తర్వాత అధికారం గురించి మాట్లాడాలంటూ ఆపార్టీ గాలిమొత్తం తీసేశారు.
కొడాలి నాని వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీకి ఏపీలో అసలు బలముందా? అన్న చర్చ నడుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసినా ఎక్కడ కూడా డిపాజిట్లు దక్కలేదు. ఇక ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఆపార్టీకి నియోజకవర్గాల్లో అభ్యర్థులు దొరకక పక్క నియోజకవర్గాల నేతలను తెచ్చుకోవాల్సి వచ్చింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేక చతికిబడింది.
ఈనేపథ్యంలోనే కొడాలి నాని పదేపదే అధికారంలోకి వస్తాయని చెబుతున్న బీజేపీపై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. అయితే నాని సవాలును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీసుకుంటారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అలాగే మంత్రి వ్యాఖ్యలపై వీర్రాజు ఎలా రియాక్ట్ అవుతారో వేచిచూడాల్సిందే..!
Also Read: Theaters VS AP Govt: ఏపీలో థియేటర్లు పూర్తిగా మూతపడిపోనున్నాయా?