
Etela Rajender: తీవ్ర ఉత్కంఠ రేపిన హుజూరాబాద్ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు కూడా వచ్చాయి. ఇందులో మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై 24 వేల పైచిలుకు ఓట్లతో ఈటల భారీ విజయం సాధించారు. ఈటలకు అంత మెజారిటీ వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ నడుస్తుందని, ఎవరు గెలిచినా దాదాపు 10 నుంచి 15 వేల ఓట్ల తేడాతోనే గెలుస్తారని రాజకీయ విశ్లేషకులు భావించారు. అయితే మొదటి రౌండ్ నుంచి 11వ రౌండ్ వరకు వెలువడిన ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకొని అక్కడ ఈటల గెలవబోతున్నాడని, కానీ దుబ్బాక ఫలితమే ఇక్కడ కూడా రాబోతుందని భావించారు. కానీ 24 వేల మెజారిటీ ఎవరూ ఊహించలేదు.
ఈ గెలుపు వెనక ఉన్నది ఎవరు ?
ఈటల రాజేందర్(Etela Rajender) విజయం సాధించాలని హుజూరాబాద్ ప్రజలే కాదు. రాష్ట్రంలో చాలా మంది అదే కోరుకున్నారు. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. అయితే హుజూరాబాద్‌లో ఈటల గెలుపునకు ఆయన వ్యక్తిగత చరిష్మా కారణమా ? లేక బీజేపీ ప్రభాల్యం కారణమా అనే కోణంలో విశ్లేషణలు వెలువడుతున్నాయి. హుజూరాబాద్ లో గెలుపు ఈటల వ్యక్తిగత పలుకుబడి, అభిమానంతోనే సాధ్యం అయ్యిందని, అందులో బీజేపీది పెద్ద పాత్ర లేదని చెబుతున్నారు. ఈటల కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా, లేక ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా, లేదా ఏ చిన్న రాజకీయ పార్టీ నుంచి పోటీ చేసినా తప్పకుండా విజయం సాధించేవారని చెబుతున్నారు. దాదాపు 17 ఏళ్లుగా ఈటల అక్కడి ప్రజలతో మమేకమై ఉన్నారు. శుభ, అశుభ కార్యాలకు వెళ్తూ అందరి నోళ్లో నాలుకగా ఉండేవారు. మొదటి నుంచి అక్కడి ప్రజల మనస్సులో స్థానం సంపాదించుకున్నారు. అందుకే అధికార పార్టీ నుంచి ఒక్క ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్‌ల మద్దతు లేకుండానే ఆయన సునాయాసంగా గెలుపొందారు.
మొదటి నుంచి టీఆర్ఎస్ నాయకుడిగా ఉన్న ఈటలను ఇప్పుడు కేసీఆర్ కావాలనే ఇబ్బందులకు గురి చేస్తున్నారని అక్కడి ప్రజలు భావించారు. ఎందరో మంత్రులపై, ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు వచ్చినా పట్టించుకోని సీఎం ఈటల విషయంలోనే ఇలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించుకున్నారు. ఈటలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ దగ్గరుండి గమనించారు. అందుకే హుజూరాబాద్ ప్రజలు ఆయనకే ఓటేశారు. ఇది తన ఆత్మాభిమానానికి సంబంధించిన విషయమని, తను హుజూరాబాద్ ప్రజలనే నమ్ముకున్నానని, తన భవిష్యత్ ప్రజలపై ఆధారపడి ఉంటుందని ప్రచారంలో భాగంగా చెప్పారు. హుజూరాబాద్ మనస్సులో చెరగని స్థానం సంపాదించుకున్న ఈటల వల్లే అక్కడ బీజేపీ గెలిచింది. ఈ గెలుపుతో రాష్ట్రంలో బీజేపీ బలపడిందని చెప్పుకోవడానికి కూడా లేదు. మరీ అంత బలహీనంగా కూడా లేదు. అయితే బీజేపీ ప్రాబల్యం ఇలాగే పెరుకుంటూ పోతే మాత్రం టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ నష్టం జరగవచ్చు.
Also Read: వరుసగా ఏడోసారి ఈటల ఎలా గెలిచాడు? అసలు కారణాలేంటి?
కేసీఆర్ ఆప్తుడే ఇప్పుడు శత్రువైన వేళ.. ఈటల రాజేందర్ ప్రస్థానం ఇదీ..