Jagan- KCR: తెలంగాణలో కేసీఆర్ ఓడిపోతాడని జగన్ కు ముందే తెలుసా? అక్కడి రాజకీయ పరిణామాలు అంచనా వేసే అడుగులు వేశారా? అందుకే జల జగడానికి దిగారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. కావేరి జలాల వివాదం మాదిరిగా.. కృష్ణా జలాల వివాదాన్ని సజీవంగా ఉంచేందుకే ఈ ప్రయత్నం చేశారన్న విశ్లేషణలు సైతం ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల్లో జగన్, కెసిఆర్ పరస్పరం సహకారమందించుకున్నారు. ఏపీలో వైసీపీకి ప్రత్యర్థైన తెలుగుదేశం పార్టీ 2018లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. దీంతో జగన్ కేసీఆర్ కు దగ్గరయ్యారు. ఆ ఎన్నికల్లో సహకారం అందించారు. సోషల్ మీడియా నుంచి క్షేత్రస్థాయికి వచ్చేవరకు ప్రతి అంశంలోనూ కెసిఆర్ కు జగన్ సహకారం అందింది. అక్కడ రెండోసారి కేసీఆర్ అధికారంలోకి రాగలిగారు. 2019 ఏపీ ఎన్నికల్లో జగన్ కు సహకారం అందించగలిగారు. ఫలితంగా జగన్ అధికారంలోకి రాగలిగారు.
తాజాగా తెలంగాణ ఎన్నికల్లో కెసిఆర్ కు మునుపటిలా జగన్ సహకరించలేదు. వైసిపి సోషల్ మీడియా సైతం సైలెంట్ అయ్యింది. రెడ్డి సామాజిక వర్గం సైతం కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపినట్లు ప్రచారం జరిగింది. ఇదంతా కెసిఆర్ ఓడిపోతారని గమనించి జగన్ సైలెంట్ అయినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే రాజకీయంగా ఓ అంశాన్ని సజీవంగా ఉంచాలన్న ఉద్దేశంతోనే.. వ్యూహాత్మకంగా నాగార్జునసాగర్ పై దండయాత్ర చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కావేరి జలవివాదం మంటల్లో రాజకీయ పార్టీలు చలికాచుకుంటున్నాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదం సజీవంగా వుస్తేనే.. అవి ప్రతిపక్షాలకు, రాజకీయ పక్షాల మనుగడకు దోహదపడుతుంది. గత నాలుగున్నర సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో జగన్ వెనుకబడ్డారన్న అపవాదు ఉంది. ఇప్పుడు ఉన్నఫలంగా ఈ తాజా నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం అదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఏపీలో తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందని ఒక విశ్లేషణ ఉంది. అదే జరిగితే అక్కడ కెసిఆర్, ఇక్కడ జగన్ విపక్షంలో కూర్చోవాల్సి ఉంటుంది. అటువంటి సమయంలో సెంటిమెంట్ ను రగిల్చే అంశంగా కృష్ణా జలాల వివాదం సజీవంగా ఉంటుంది. అది ఉభయతారకంగా అటు కెసిఆర్ కు, ఇటు జగన్ కు ప్రయోజన కారిగా మారుతుంది. అందుకే సాగర్ పై దండయాత్ర చేశారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి సమస్యను పరిష్కరించింది కానీ.. మున్ముందు ఈ వివాదం రాజకీయ జఠిలంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.