Bhogapuram Airport : ‘నేను ఒకటి సెప్తా ఉన్నా. ప్రభుత్వం వచ్చిన ప్రారంభంలో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తే చిత్తశుద్ధి అవుతుంది. అదే ఎన్నికల ముంగిట ప్రారంభిస్తే మాత్రం మోసమే అవుతుంది’..ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబునుద్దేశించి జగన్ చేసిన మాట ఇది. సీఎంగా చంద్రబాబు ఫెయిలయ్యారని ప్రజల ముందు చూపెట్టేందుకు ఇలా జగన్ ఘాటైన వ్యాఖ్యలు చేసేవారు. వాటిని ప్రజలు కూడా బలంగా నమ్మారు. అందుకే అంతులేని విజయాన్ని కట్టబెట్టారు. నాటి జగన్ మాటలను గుర్తుచేసుకొని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రాజెక్టులు కట్టేస్తారని.. పరిశ్రమలు ఏర్పాటుచేసి యువతకు ఉద్యోగాలిస్తారని భావించారు. అయితే ముందు బటన్ నొక్కుడుకే పరిమితయ్యారు. నాలుగేళ్ల కాలం బటన్ నొక్కుడుతో సరిపెట్టుకున్నారు. ఇప్పుడు వరుస శంకుస్థాపనలతో దుమ్ము దులుపుతున్నారు.
ఎట్టకేలకు..
ప్రభుత్వం ఆయుష్షు అలా తగ్గుతునే వస్తోంది. నాలుగో ఏడాది రావడంతో తత్వం బోధపడింది. దీంతో పెండింగ్ ప్రాజెక్టులకు, గతంలో శంకుస్థాపనలు చేసిన వాటికి సైతం ప్రారంభిస్తున్నారు. ప్రతి పదిహేను రోజులకో శంకుస్థాపన చేస్తున్నారు. తాజాగా భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రెండు వారాల కిందట శ్రీకాకుళం జిల్లా మూలపేట ఎయిర్ పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించారు. కానీ ఒక్క దానికి రూపాయి కూడా బడ్జెట్ లేదు. మెడికల్ కాలేజీల నిర్మాణాలు ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నాయి. పద్దెనిమిది కాలేజీలు కట్టేస్తున్నామని ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరును కూడా మార్చేసుకున్నారు. కానీ ఒక్కటీ నిర్మాణం కాలేదు. కనీసం పునాదులు దాటడం లేదు. రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి పని జరగడం లేదు. పోర్టులు.. ఎయిర్ పోర్టులు.. రోడ్లు అన్నీ మూలన పడి ఉన్నాయి.కానీ శంకుస్థాపనలు మాత్రం ఎన్నికలకు ముందు జోరుగా చేస్తున్నారు. ఫుల్ పేజీ ప్రకటలు ఇస్తున్నారు. రూ. కోట్లకు కోట్లు… సొంత మీడియాకు తరలించుకుంటున్నారు.
నో పర్మిషన్స్…
సందట్లో సడేమియా అన్నట్టు తాజాగా రెండోసారి శంకుస్థాపన చేసిన భోగాపురం ఎయిర్ పోర్టుకు ఇంతవరకూ అనుమతులు లభించలేదట. ఐదేళ్ల క్రితం అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. పనులు చేయాల్సిన జగన్ .. టెండర్లు రద్దు చేసి.. మళ్లీ అవే టెండర్లను చంద్రబాబు టైంలో దక్కించుకున్న జీఎంఆర్‌కు రివర్స్ టెండర్లు వేసి ఐదు వందల ఎకరాలు తగ్గించి ఇచ్చారు.కానీ అనుమతులు మాత్రం సాధించలేకపోయారు. ప్రధానితో శంకుస్థాపన చేయిస్తామని చాలా సార్లు గొప్పలు చెప్పారు. గత నవంబరులో విశాఖ పర్యటనకు వచ్చే సమయంలో ప్రధాని శంకుస్తాపన చేస్తారని ఆర్భాటం చేశారు. కానీ అది జరగలేదు. ఇప్పుడు సీఎం జగన్ ఒక్కరే శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధులు రాకపోవడంతో అనుమానపు చూపులు ప్రారంభమయ్యాయి.
నాడు ఎగదోతతో..
భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి భూసేకరణ ఇంకా కొలిక్కి రాలేదు. గత ప్రభుత్వ హయాంలో విపక్ష నేతగా ఉన్న జగన్ భూములకు పరిహారం చాలదని నిర్వాసితులకు ఎగదోశారు. దీంతో వారు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఇప్పుడవే కేసులు కొనసాగుతున్నాయి. ఎయిర్ పోర్టు కు సంబంధించిన అనుమతుల ప్రక్రియపై ప్రభుత్వం గోప్యత పాటిస్తోంది. ఐదు వందలఎకరాలు తగ్గించడం.. ఎయిర్ పోర్టు ప్లాన్ ను మార్చడం వల్ల మళ్లీ కేంద్రం అనుమతులు తీసుకోవాల్సి వచ్చింది. అయితే అన్ని రకాల అనుమతులు వచ్చాయా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. జీఎంఆర్‌కే మళ్లీ కాంట్రాక్ట్ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా.. ఇంత వరకూ ప్రారంభించకపోవడానిక అనుమతులతో పాటు భూముల సమస్య కూడా ఉంది. అయితే జగన్ విపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన చిత్తశుద్ధి, మోసం కాన్సెప్టుల్లో ఇప్పడు ఆయనకు ఏది వర్తిస్తుందో ఆయనకే ఎరుక.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Does bhogapuram airport have no permits
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com