Minister KTR : కేటీఆర్.. తెలంగాణలో నిక్కర్ వేసిన పిల్లవాడి నుంచి పండు ముసలి వరకు తెలిసిన పేరు. తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న నేత. వాక్‌చాతుర్యం.. నేర్పరితనం.. మాటలతో మెప్పించే గుణం ఉన్న రాజకీయ నాయకుడు. అయితే కొన్ని రోజులుగా మారుతున్న రాజకీయ పరిణామాలు కేటీఆర్‌లోనూ వైఖరిలోనూ మార్పు తెస్తున్నాయి. అసహనం పెంచుతున్నాయి. మాట తుళ్లుతున్నారు. పదవి, హోదాతో సంబంధం లేకుండా ఎవరిని పడితే వారిని వాడు.. వీడు అనేంతగా కేటీఆర్‌లో అసహనం పెరిగింది. ఆశించిన పదవి అందదేమో అన్న ఆందోళనా.. లేక తమ స్వార్థం బయట పడుతుందన్న భయమో తెలియదు కానీ ఏ వాక్‌చాతుర్యమైతే కేటీఆర్‌ను జనంలో గొప్పగా చేసిందో.. ఇప్పుడు అదే మాటతీరు ఆయనపై చులకన భావం పెంచుతున్నాయి. తాజాగా సిరిసిల్ల పర్యటనకు వచ్చిన కేటీఆర్ తనను అడ్డుకోబోయిన యువకులు(ఏబీవీపీ నాయకులు)పై మండి పడ్డారు. తనను అడ్డుకోవడానికి కారణాలు చెప్పాలన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే ప్రధాని మోదీని, బండి సంజయ్‌ని అడ్డుకోవాలని సూచించారు.
ఆ నలుగురు అంటూ..
బీజేపీ నాయకులు యువకులను రెచ్చగొట్టాలని చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్‌ఎస్ నేతలపై మంత్రులపై యువతను ఉసిగొల్పే ప్రయత్నాలు విపక్షాలు చేస్తున్నాయని మండి పడ్డారు. తాను సిరిసిల్లకు వస్తుండగా అడ్డుకున్న నలుగురు యువకులకు సూచనలు చేశారు. తనను ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలన్నారు. అడ్డుకునే ముందు ఆలోచన ఉండాలన్నారు. తాను సిరిసిల్లకు మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ, అగ్రికల్చర్ కాలేజీ తెచ్చానన్నారు. బండి సంజయ్ ఎంపీగా నాలుగేళ్లలో సిరిసిల్లకు ఏం తెచ్చాడో చెప్పాలని డిమాండ్ చేశారు. యువకులు, నాయులు, ప్రజలు ఈమేరకు నిలదీయాలన్నారు.
ట్రిపుల్ ఐటీ రాకుండా పోయింది..
ఎంపీగా వినోద్‌కుమార్ ఉన్నప్పుడు కరీంనగర్‌కు ట్రిపుల్ ఐటీ మంజూరు చేయించేలా కృషి చేశారన్నారు. కొన్ని రోజులైతే మంజూరయ్యేదన్నారు. ఇంతోనే ఎన్నికల వచ్చాయని, వినోద్‌కుమార్ ఓడిపోవడం, సంజయ్‌కుమార్ గెలవడంతో ట్రిపుల్ ఐటీ రాకుండా పోయిందని ఆరోపించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మాట తప్పిన మోదీని ఎందుకు నిలదీయొద్దని ప్రశ్నించారు.
కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు దీటుగా..
ఇక కేసీఆర్‌పై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ రెండు రోజుల క్రితం నిర్వహించిన నిరసన దీక్షలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాస్‌పోర్టు బ్రోకర్.. కవిత లిక్కర్ దందా.. కేటీఆర్ లీకు వీరుడు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ ఘాటుగా, దీటుగా స్పందించారు. నేను మోదీని అనలేనా అంటూ.. అదాని గాడికి మోదీ బ్రోకర్ అని నేనూ అనగలను అంటూ వ్యాఖ్యానించారు. దేశమంతా అంటుందని పేర్కొన్నారు. కానీ, నాకు గౌరవం అడ్డు వస్తుందని తెలిపాడు. అనాల్సిన మాట అని తర్వాత గౌరవం అని మాట్లాడడం కేటీఆర్‌లోని అసహనాన్ని తెలియజేస్తుందని బీఆర్‌ఎస్ నేతలే గుసగుసలాడడం గమనార్హం.