వ్యాక్సిన్. వైద్యశాస్త్రంలో ఇదో అద్భుత ఆవిష్కరణ. వ్యాధిసోకిన తర్వాత చికిత్స చేయడం సాధారణం. కానీ.. వ్యాధి రాకుండా అడ్డుకునేందుకు మందు వేయడం అసాధారణమే. 17వ శతాబ్దం చివర్లో స్మాల్ పాక్స్ ను నివారించేందుకు వచ్చిన మొదటి వ్యాక్సిన్ నుంచి.. ఇప్పటి కరోనా వ్యాక్సిన్ వరకు ఎన్నో కనిపెట్టారు. అయితే.. నోటి ద్వారా ఇచ్చే పోలియో వ్యాక్సిన్ వంటివి పక్కన పెడితే.. చాలా వరకు ఇంజెక్షన్ ద్వారా ఇచ్చేవే. అయితే.. ఇవన్నీ చేతికే ఎందుకు వేస్తారు? అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచిస్తే.. సమాధానం దొరికిందా? లేదు అంటే మాత్రం.. ఇప్పుడు తెలుసుకోండి.
యాంటీ బయాటిక్స్ వంటి సూది మందులు నడుము కింద వేస్తారన్నది తెలిసిందే. గతంలో రేబిస్ వ్యాక్సిన్ అయితే.. బొడ్డు చుట్టూ వేసేవారు. పోలియో వ్యాక్సిన్ లిక్విడ్ రూపంలో వేస్తారు. ఇవి కాకుండా మిగిలినవన్నీ చాలా వరకు చేతికే వేస్తారు. ఇలా ఎందుకు చేతికే వేయాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు మనం విషయం లోతుల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. వైరస్ పై దాడిచేయడంలో కీలక పాత్రపోషించే వాటిలో Tకణాలు, Bకణాలను యాక్టివ్ చేయడమే వ్యాక్సిన్ లక్ష్యం. ఈ కణాలు కండరాల్లో ఉంటాయి.
డెల్టాయిడ్ రకంగా పిలిచే కండరాల్లో ఈ కణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కండరాల్లోకి వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు దాని పనితీరు చాలా మెరుగ్గా ఉంటుంది. అంతేకాకుండా.. వ్యాక్సిన్ తో వచ్చే దుష్ప్రభావాలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కండరాలు లేని చోట వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు శరీరంలో యాంటీ బాడీలు తక్కువగా ఉత్పత్తి అవుతాయి. అంతేకాదు.. వాటి పనితీరు కూడా త్వరగా తగ్గిపోతుందని చెబుతున్నారు.
అందువల్ల ఈ కండరాలు ఎక్కువగా ఉండే చేతికే ఈ వ్యాక్సిన్ వేస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇదేకాకుండా.. చేతికి వేయడానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. అవికూడా చూద్దాం. అయితే.. పిల్లల్లో వ్యాక్సిన్లు పిరుదులకు వేస్తారు. మరి, పెద్దలకు ఎందుకు వేయరు అన్నదానికి నిపుణులు ఆన్సర్ ఇస్తున్నారు. చిన్నారులకు డెల్టాయిడ్ కండరాలు పిరుదుల్లో ఎక్కువగా ఉంటాయట. పెద్దల విషయానికి వచ్చే సరికి పరిస్థితి మారిపోతుందని అంటున్నారు. అంతేకాకుండా.. పెద్దవాళ్లకు పిరుదుల్లో ఎక్కువగా కొవ్వు చేరుతుంది. ఈ కొవ్వు భాగంలో వ్యాక్సిన్ వేస్తే.. రోగ నిరోధక కణాలకు యాంటిజెన్లు చేరడానికి చాలా ఆలస్యం అవుతుంది. ఇదే జరిగితే.. యాంటీ బాడీస్ యాక్టివ్ కావడానికి కూడా లేట్ అవుతుందట.
అంతేకాకుండా.. దీనికి భౌతిక కారణాలు కూడా తోడవుతున్నాయి. పిరుదులకు వ్యాక్సిన్ ఇవ్వడం అనేది కాస్త ఇబ్బందికర విషయం. పడుకోవాల్సి ఉంటుంది. బట్టలు తొలగించాల్సి ఉంటుంది. ఆడవాళ్ల విషయంలో ఇది కాస్త ఇబ్బందికరంగా మారుతుంది. అదే చేతికి వేయాల్సి వస్తే.. చాలా సులభంగా పని అయిపోతుంది. కూర్చుని వ్యాక్సిన్ తీసుకోవచ్చు. పైగా.. చేతికి ఉన్న దుస్తులను కాస్త పైకి జరిపితే చాలు. దీనివల్ల ఈజీగా.. వేగంగా వ్యాక్సినేషన్ జరపడానికి కూడా అవకాశం ఉంటుంది.
అయితే.. చేతికి ఇచ్చే వ్యాక్సినే ఫైనల్ కాదు. ఇప్పటి వరకు ఉన్న విధానాల్లో ప్రముఖమైనది మాత్రమే. రాబోయే రోజుల్లో ఈ పద్ధతికూడా మారబోతోంది. ఇప్పటికే ఇన్ ఫ్లూయెంజా వ్యాక్సిన్ ను ముక్కు ద్వారా ఇస్తున్నారు. శరీరానికి పట్టీ వేయడం ద్వారా, స్ప్రే చేయడం ద్వారా వ్యాక్సిన్ ఇచ్చే పద్ధతి కూడా రబోతోంది. ప్రస్తుతం ఇవి ప్రయోగదశలో ఉన్నాయి. ఇప్పటికే.. కొవిడ్ వ్యాక్సిన్ ను ముక్కు ద్వారా ఇచ్చేందుకు అమెరికాలో ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి. ఇంజెక్షన్ అంటే భయపడే వారికి ఈ పద్ధతులు ఎంతో సౌకర్యంగా ఉండనున్నాయి.