తిరుమల వేంకటేశ్వరస్వామిని భక్తులంతా ’గోవిందా’ అని స్తుతిస్తుంటారు. స్వామివారికి కూడా పిలిపించుకోవడం చాలా ఇష్టమట. అయితే స్వామి వారికి ఇలా గోవిందా అనే పేరు రావడం వెనుక పెద్ద కథే ఉంది. అదేంటంటే..
వేంకటేశ్వర స్వామివారు ఒకరోజు కొండదిగి వచ్చి అగస్త్యముని ఆశ్రమానికి వెళ్తాడు. ‘‘నన్ను శ్రీనివాసుడు అంటారు. మీ ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నాయి కదా. నాకు ఒకటి ఇవ్వు’’ అని అడుగుతాడు. ఇందుకు సంతోషించిన అగస్త్యముని, ‘‘స్వామీ.. నీకు ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ, మన వేదాల ప్రకారం ధర్మపత్ని లేకుండా వచ్చిన వారికి గోదానం చేయకూడదని అంటారు.కాబట్టి మీ ధర్మపత్నిని తీసుకొని మరోసారి ఆశ్రమానికి రాగలరు’’ అని చెబుతాడు. దీంతో స్వామివారు అలాగేనని చెప్పి వెళ్తారు.
వేంకటేశ్వర స్వామివారు మరోరోజు పద్మావతి అమ్మవారిని వెంటబెట్టుకొని అగస్త్యముని ఆశ్రమానికి వస్తాడు. అయితే ఆ సమయంలో ఆశ్రమంలో అగస్త్యముని ఉండరు. ఆయన శిష్యుడు ఉంటాడు. దీంతో స్వామివారు అతనితో, ‘‘మీ గురువుగారు నాకు గోవును ఇస్తానన్నారు. సతీమణిని వెంటబెట్టుకొని రమ్మని చెప్పారు. అలాగే వచ్చాను. మరి.. నాకు గోవును ఇవ్వు’’ అని అడుగుతారు. అయితే ఆ శిష్యుడు ఇందుకు నిరాకారిస్తాడు. ‘‘స్వామీ.. మా గురువుగారు ఆశ్రమంలో లేరు. ఆయన ఉన్న సమయంలో మరోసారి రాగలరు’’ అని స్వామివారిని కోరతాడు.
అగస్త్యముని శిష్యుని సమాధానంతో వేంకటేశ్వర స్వామివారు ఆగ్రహించి తిరుమల కొండవైపు గబగబా నడుచుకుంటూ వెళతాడు. అంతలోనే ఆశ్రమానికి అగస్త్యముని వస్తారు. జరిగిన విషయాన్ని శిష్యుడు ఆయనకు వివరిస్తాడు. దీంతో అగస్త్యముని శిష్యునితోపాటు మరికొంత మందిని వెంటబెట్టుకొని, గోవును తీసుకొని స్వామివారి వద్దకు పరిగెడతారు. కొద్ది దూరంల స్వామివారిని చూసి.. స్వామీ అని పిలుస్తాడు. కానీ, ఆగ్రహంతో ఉన్న స్వామివారు పట్టించుకోరు. దీంతో స్వామీ.. గోవు ఇందా అంటాడు. ఇందా అంటే ఇదిగో అని అర్థం.
అయినా స్వామివారు పట్టించకోకుండా ముందుకు సాగుతారు. అగస్త్యముని.. స్వామీ.. గోవు ఇందా, గోవు ఇందా.. గోవిందా.. గోవిందా అని అరుస్తూనే ఉంటారు. వీరు ఇలా గోవిందా అని అరుస్తుండగానే స్వామివారు ఆలయానికి వెళ్లి అద్రుశ్యమైపోతారు. వేంకటేశ్వర స్వామికి గోవిందా అనే పేరు ఇలా వచ్చింది. గోవులంటే ఆయనకు అంత ప్రీతి కాబట్టే కొండదిగి వచ్చాడని చెబుతుంటారు.