
ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన వైఎస్ఆర్ గుర్తులు ఇంకా పోవడం లేదు. ఆయన చేసిన సంక్షేమం, అభివృద్ధికి గుర్తుగా అటు ఏపీలో వైఎస్ జగన్ ‘వైఎస్ఆర్.సీపీ’ని పెట్టి అధికారంలోకి రాగా.. ఇప్పుడు ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల ‘వైఎస్ఆర్.టీపీ’ అంటూ తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చారు. తెలంగాణలో వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీ పేరును ‘వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ’ అని పిలవాలని ఇప్పటికే ప్రకటించారు. ఇదే పేరును భారత ఎన్నికల సంఘం కూడా ఆమోదించింది. ఇప్పటిదాకా ఆ పేరుపై ఎలాంటి అభ్యంతరాలు రాలేదని సమాచారం.
వైఎస్ఆర్ భార్య అయిన విజయమ్మ తన భర్త పేరును తన కుమార్తె వాడినందుకు.. ఆ రాజకీయ పార్టీపై అభ్యంతరం లేదని ఎన్నికల సంఘానికి నో అబ్జక్షన్ లేఖను ఇచ్చింది. రాజకీయాపార్టీలో ‘వైఎస్ఆర్’ అనే పేరును సంక్షిప్తం చేయాలని ఈసీఐ సూచించినట్టు తెలిసింది.
జగన్ తన పార్టీ పేరును ‘యువజన శ్రామిక రైతు పార్టీ’ అని వైఎస్ఆర్ కలిసేలా పెట్టాడు. ఇక షర్మిల మాత్రం యువతను నమ్ముకుంది. ‘యువశక్తి రైతు రాజ్యం తెలంగాణ పార్టీ’ అని (వైఎస్ఆర్.టీపీ) అని షర్మిల తన పార్టీపేరు రైతులు, యువతను పెట్టి తీర్చిదిద్దారు. షర్మిల కొత్త పార్టీ రంగులు కూడా జగన్ పార్టీతో సమానంగా ఉంటాయి. నీలం, తెలుపు, ఆకుపచ్చ రంగులను కలిగి ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
జూలై 8న వైఎస్ఆర్ టీపీని ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫిల్మ్ నగర్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో సుమారు 1000 మంది కార్యకర్తల సమక్షంలో జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలోని లక్షమందిని పార్టీ ప్రారంభానికి తరలించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడే భవిష్యత్ కార్యాచరణను షర్మిల ప్రకటించనున్నారు.