
AP Debt to Central: అప్పుల మీద ఆధారపడ్డ ఏపీ ప్రభుత్వానికి కేంద్రం మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. నెల నెల కేంద్రం నిధులు ఇస్తున్నా, ఈ సారి మాత్రం కొంత ఎక్కువగానే ఇచ్చింది. చెల్లింపులకు ఆపసోపాలు పడుతున్న జగన్ ప్రభుత్వానికి ఇది పెద్ద శుభవార్తే. ఒక్కసారే అన్ని నిధులు వస్తుండటంతో అధికారులు కూడా ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం పొందుతున్నారు.
ఆర్థిక మాసాంతం మార్చిలో బిల్లుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. జమ ఖర్చుల వివరాలను లెక్కలేసుకునే పనిలో ట్రెజరీ శాఖ బాగా బిజీగా ఉంది. ఈ నెలలో విడుదల కావాల్సిన నిధుల కోసం బిల్లుల అప్ లోడింగ్ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులకు బకాయిలు, కాంట్రాక్టర్లకు బకాయిలు విడుదల చేయాలని ఒత్తిడి తీసుకువస్తున్నారు. మరోపక్క సంక్షేమ పథకాలకు నిధులు అందజేయాలి. మొత్తం ఒక్కసారిగా జరగాలంటే నిధులు కూడా ఎక్కువే అవసరం.
ప్రతీసారి ఈ నెల గడిస్తే చాలన్నట్లుగా వ్యవహరిస్తున్న వైసీపీ ప్రభుత్వం కేంద్రం వంకకు చూడటం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ ఒక్క నెలలోనే సుమారుగా అప్పుల పరిమితి, వివిధ గ్రాంట్ల కింద రూ.15,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. రాష్ట్రాలకు రెండు నెలల పన్నుల వాటా కింది విడుదల చేసిన రూ.1,40,318 కోట్లలో ఆంధ్రప్రదేశ్‌కు రూ 5,474 కోట్లు వచ్చాయి.
ఉద్యోగులకు బకాయిల రూపంలో రూ.3 వేల కోట్లను చెల్లించాలనే హామీ ఉంది. అంతేగాక, ఎమ్మెల్సీ అనంతరం తమకు రావాల్సిన భవిష్య నిధి, ఇతర అలవెన్సులను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని గంపెడాశతో ఉన్నారు. వీటి కోసం మూడేళ్ల నుంచి ఉద్యోగులు దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేసే పరిస్థితి లేకపోవడంతో బకాయిల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సింది.
కాగా, కేంద్రం ఇచ్చిన నిధులు ఆర్థిక సంవత్సరం అవసరాలకు సరిపోతాయి. అవన్నీ నెలాఖరుకు అందుతాయి. నవరత్నాలకు కూడా ఏ ఢోకా ఉండదు. 2023-24 బడ్జెట్ రూపకల్పన చేయాల్సి ఉంది. వచ్చే నెల నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. మరలా కొత్త అప్పుల కోసం వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెడుతుందనడంలో సందేహం లేదు.