ABN RK Vs YS Jagan: ‘ఏపీ సీఎం జగన్ సమర్థుడు. తలచుకుంటే ఆయన ఏమైనా చేయగలడు. ఆంజనేయుడి కంటే శక్తిమంతుడు. చేతిలో రూపాయ లేకుండానే వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించగలిగిన ఒక ఆర్ధిక మేధావి జగన్’…ఇలా కీర్తించిన వారెవరో తెలుసా ప్రముఖ మీడియా అధిపతి, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ. ఈ వారం ఆయన రాసిన కొత్త పలుకులో సింహభాగం జగన్ పొగడ్తలకే కేటాయించారు. జగన్ ఏదైనా చేయగలరు. ఆయనకు ఆ సామర్థ్యముంది అంటూ సీఎం జగన్ 20 ఏళ్ల వెనుకటి చరిత్రను ఆర్కే వివరించారు. ‘సూర్యవంశం’ సినిమాలో ఒక పాటలోనే కథానాయకుడు బస్సు క్లీనరు నుంచి ఓనరుగా… రైస్ మిల్లు నుంచి సుగర్ ఫ్యాక్టరీ ఎండీగా మారిపోతాడు. ఆయన భార్య సాధారణ గృహిణి నుంచి జిల్లా కలెక్టర్ గా ఎంపికై శిక్షణ తీసుకొని అదే జిల్లాలో అడుగు పెడుతుంది. ఈ కథను పోలినట్టే జగన్ చరిత్రను తన కొత్త పలుకులో సింపుల్ గా, సుత్తి లేకుండా వివరించగలిగారు ఆర్కే. అమరావతిని నిర్మించలేని చేతులెత్తేసిన సీఎం జగన్ కు అంత శక్తి ఉందని.. ఆంజనేయుడికి ఉన్న శక్తి ఇతరులు ఆయన చెప్పేవరకూ తెలియదన్న విషయాన్ని గుర్తుచేశారు. సీఎం జగన్ శక్తిని గుర్తుచేసే గురుతర బాధ్యతను రాధాకృష్ణ తీసుకున్నారు.

20 ఏళ్ల వెనుకటి చరిత్రతో..
ఆర్కే తన వ్యంగ్యోక్తులతో ఈ వారం కొత్త పలుకును రక్తికట్టించారు. జగన్ వ్యాపార సామ్రాజ్య విస్తరణ ఎలా చేశారో సాదోహరణంగా వివరించారు. అసెంబ్లీలో అమరావతి గురించి, మూడు రాజధానుల గురించి జగన్ మాట్లాడిన అంశాలను ప్రస్తావిస్తూ ఆర్కే విశ్లేషణ చేశారు. అమరావతి కట్టలేనని సీఎం జగన్ నిస్సహాయత అబద్ధమని.. ఆయనకు ఆ సామర్ధ్యం ఉందని విశ్లేషించారు. కానీ దానిని రాష్ట్ర ప్రయోజనాలకు కాకుండా.. సొంతానికి, స్వార్థానికి వాడుకుంటున్నారని గుర్తుచేశారు. కాంట్రాక్టర్ల దగ్గర కోటి నుంచి రూ.5 కోట్ల వరకూ సబ్ కాంట్రాక్టర్లు పొందే జగన్ కు అనతికాలంలో వేల కోట్ల రూపాయల కంపెనీలు, మీడియా సంస్థలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. 2004లో తండ్రి వైఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత కర్నాటకలోని సండూరు పవర్ కంపెనీ చేతిలోకి వచ్చిందని… నాడు పెట్టుబడికి డబ్బులు లేక హైదరాబాద్ లోని ఇల్లు అమ్మకం పెట్టారని గుర్తుచేశారు. కానీ తండ్రి అధికారంతో వెల్లువలా వచ్చిన పెట్టుబడులతో ఇల్లు అమ్మకం వాయిదా వేశారని గుర్తుచేశారు. ఇప్పుడు అదే ఇంటి స్థలంపై భారీ భవంతులు నిర్మించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. అనతికాలంలోనే చేతిలో చిల్లిగవ్వలేని జగన్ వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యం సృష్టించలేనిది.. వేల ఎకరాల భూమి అందుబాటులో ఉండి.. అపార వనరులు ఉండి అమరావతిని అభిృవృద్ధి చేయలేరా అని ప్రశ్నించారు. అయితే ఆర్కే చాలా లాజీక్కులతో సీఎం జగన్ ను ఇరుకునే పెట్టే ప్రయత్నం చేశారు. ఒకటి ఆయన చేయగలరు..కానీ చేయలేరు, రెండూ ఆయన చేసుకుంటున్నారు.. కానీ సొంత ప్రయోజనాల కోసం…మూడు రాష్ట్ర సొమ్మును వాడేస్తున్నారు..కానీ తన రాజకీయ ప్రయోజనాల కోసమంటూ విశ్లేషించారు. స్లోగా ప్రజల మైండ్లోకి ఈ అంశాలు వెళ్లేలా ఆర్కే గట్టి ప్రయత్నమే చేశారన్న మాట.
చేసే సత్తా ఉన్నా చేయలేనని…
అదే సమయంలో జగన్ సీఎంగా ఫెయిల్యూర్స్ ను కూడా ఆర్కే ప్రస్తావించారు. రాజధాని విషయంలో సీఎం మాట్లాడకూడనిది మాట్లాడరని తప్పుపట్టారు. తాను చేయలేనని చేతులెత్తేయడం సీఎం పదవికి మాయని మచ్చగా అభివర్ణించారు. చేయలేనని మాటకు జగన్ అలవాటు పడిపోయారని కూడా అభిప్రాయపడ్డారు. సీపీఎస్ రద్దు, మద్యనిషేధం ఇవన్నీ సీఎం చేయలేని జాబితాలో ఉన్నవేనంటూ గుర్తుచేశారు. ఆయన వైఫల్యాలను గుర్తుచేస్తూనే.. ఆయన చేయలేక కాదు అని.. చేయనని భీష్మించుకొని కూర్చున్నందునే వాటికి మోక్షం కలగడం లేదన్నారు. ఆర్కే కొత్త ఈ వారం రెండు పార్శాల్లో సాగింది. మిడిమిడి తెలివితేటలు ఉన్నవారు మాత్రం జగన్ ఇంత తెలివైనవాడా?అని అనిపిస్తుంది. లోతుగా అధ్యయనం చేసిన వారికి మాత్రం జగన్ ఇలాంటి వ్యక్తా అన్న అభిప్రాయం నెలకొంటుంది. అయితే ఆర్కే రాసిన కొత్త పలుకును జగన్ వైఫల్యాలు తెలుసుకునే వారే ఎక్కువగా చదువుతుంటారు. వారి కోసమే అన్నట్టూ నిగూడార్థాలతో ఆర్కే తన మార్కు విశ్లేషణతో ముందుకు సాగారు.

కేసీఆర్ చర్యలపై కూడా...
అటు పనిలో పనిగా ఆర్కే తెలంగాణ రాజకీయాలను ప్రస్తావించారు. కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు, జాతీయ నేతలను కలవడం వంటి వాటి గురించి విశ్లేషించారు. ఒక విధంగా అపహాస్యం చేశారనే చెప్పాలి. షెడ్డుకెళ్లిన నేతలను విమానంలో రప్పించుకొని పొగిడించుకుంటే ఏమోస్తుందని కేసీఆర్ ను ప్రశ్నించారు.రేపు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో పోటీచేస్తే అది ఇట్టే తెలిసిపోతుందని కూడా సూచించారు. ప్రస్తుతం కేసీఆర్ జాతీయ స్థాయిలో విపక్ష నేతలను ఏకం చేసే పనిలో పడ్డారు. ఉత్తరాధి నుంచి దక్షిణాది రాష్ట్రాల నాయకుల వరకూ కలుస్తున్నారు. ఏపీలో మాత్రం తన మిత్రుడు జగన్ ను కలవడం లేదు. అలాగని రాజకీయ విరోధి చంద్రబాబును సంప్రదించడం లేదు. అయితే ఈ ప్రయత్నాలను ప్రస్తావిస్తూ ఆర్కే తన విశ్లేషణతో కేసీఆర్ చర్యలను తప్పుపట్టినట్టుంది. కాదు చులకనగా చూసినట్టు మాత్రం అవగతమవుతోంది.