Narendra Modi: అటల్ బిహారీ వాజ్ పేయ్.. పరిచయం అక్కర్లేని పేరు. సంస్కరణలకు అధ్యుడు. తన మార్కు పాలనతో దేశాన్ని ఏలిన మాజీ ప్రధాని సుపరిపాలన అందించి ప్రత్యర్థి పార్టీల మనసును గెలుచుకున్న మహోన్నతుడు. ముఖ్యంగా జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఆయన చేపట్టిన స్వర్ణ చతుర్భుజి పథకం భారత దేశ చరిత్రలో నిలిచిపోతుందనడంలో అతిశయోక్తి కాదు. అందుకే ఆ మహనీయుడును స్మరించుకుంటూ గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరపాలక సంస్థ ఒక వినూత్న బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది. అరుదైన కట్టడానికి ముద్దుగా అటల్ బ్రిడ్జిగా నామకరణం చేసింది. ప్రధాని మోదీ ఇటీవల ఈ బ్రిడ్జిని ప్రారంభించారు. జాతికి అంకితం చేశారు. ఆ ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు. అటల్ జీ పేరిట నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించడం ఆనందంగా ఉంది. చూడచక్కటగా ఉంది ఈ బ్రిడ్జి. ఆధునిక హంగులతో నిర్మించిన ఈ బ్రిడ్జి ఎంతో అందంగా ఉంది అంటూ దాని ప్రత్యేకతలు తెలుపుతూ ప్రధాని మోదీ ఫొటోలను షేర్ చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

అహ్మదాబాద్ నగరాన్ని వేరుచేస్తూ సబర్మతి నది ప్రవహిస్తుంది. చూడచక్కగా ఉంటుంది ఈ నది. అయితే పెరిగిన ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకొని అక్కడి కార్పొరేషన్ నడక మార్గంతో వెళ్లేవారికి ప్రత్యేకంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సంకల్పించింది. నది తూర్పు, పడమర గట్లను కలిపే విధంగా 300 మీటర్ల మేర బ్రిడ్జిని నిర్మించింది. ప్రత్యేకమైన డిజైన్లతో బ్రిడ్జిని రూపొందించారు. పూర్తిగా స్వదేశీ నైపుణ్యంతో నిర్మించిన బ్రిడ్జికి రూ.74 కోట్లు ఖర్చు చేశారు. కళ్లు చెదిరే ఎల్ఈడీ లైటింగ్ లతో జిగేల్ మంటోంది ఈ పాదచారుల వంతెన.

తొలుత పాదచారులకే అనుకున్నా.. సైక్లిస్టులు వెళ్లే మార్గాన్ని సైతం ఏర్పాటు చేశారు. వంతెన మధ్య నుంచి అటు నది..ఇటు నగర అందాలను వీక్షించే ఏర్పాట్లు చేశారు. వంతెన మధ్య ఫ్లవర్ పార్కు, ఎగ్జిబిషన్ సెంటర్, ఈవెంట్ గ్రౌండ్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు సీనియర్ సిటిజెన్స్, మహిళలు కూర్చొని సేదదీరేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అభివృద్ది చెందుతున్న నగరాల్లో అహ్మదాబాద్ ఒకటి. అందుకే అక్కడి కార్పొరేషన్ వినూత్న కార్యక్రమాలతో ముందుకు సాగాలని నిర్ణయించింది. అటు ప్రజలకు మెరుగైన సేవలందిస్తూనే..పర్యాటకంగా సబర్మతి నదీ పరీవాహక ప్రాంతాల్లో వివిధ నిర్మాణాలు చేపట్టాలని సంకల్పించింది. అందులో భాగంగా పురుడు పోసుకున్నదే ఈ అటల్ బ్రిడ్జి.అందునా ప్రధాని మోదీ సొంత రాష్ట్రం కావడంతో ఈ వినూత్న బ్రడ్జికి ఇప్పుడు ఎనలేని ఫోకస్ కనిపిస్తోంది. అటు ప్రధాని అంతటి వారే ఫొటోలను షేర్ చేసి బ్రిడ్జి ప్రాధాన్యతను పెంచడంతో నెటిజన్లు తెగ ఆసక్తికనబరుస్తున్నారు.