Pawan Kalyan Yuvashakti Sabha: నిశ్శబ్ధ విప్లవం.. బానిసత్వం పెచ్చుమీరినప్పుడు.. ప్రజల ఆకాంక్షలకు బలమైన గొంతు తోడైనప్పుడు వచ్చే ప్రజా ఉద్యమమే నిశ్శబ్ధ విప్లవం. ఇప్పుడీ మాట ఉత్తరాంధ్రలో కనిపిస్తోంది.. వినిపిస్తోంది. దిక్కులు పిక్కటిల్లేలా యువగళం వినిపిస్తోంది. ఇంతింతై వటుడింతై అన్న చందంగా యువశక్తి అజేయమైన శక్తిగా మారుతోంది. ఊరూ వాడలను సంఘటితం చేసి వైసీపీ ప్రభుత్వ నిరాంకుశ పాలనకు చరమగీతం పాడేలా ఒక మార్గం చూపింది. ఉత్తరాంధ్రను పవన్ ‘యువశక్తి’ ఉర్రూతలూగించింది. ఉత్తరాంధ్ర ప్రజల్లో స్పష్టమైన మార్పును సంకేతమైంది. యువతలో ఆక్రోశం, ఆవేదన , ఆవేశం వేదికగా జరిగిన యువశక్తి ఇప్పుడు రీ సౌండ్ చేస్తోంది. దశాబ్దాలుగా రాజకీయ దగాకు గురైన ప్రాంతం …కొన్ని కుటుంబాల కబంధ హస్తాల్లో ఉన్న ఉత్తరాంధ్ర బయట పడే మార్గం దొరికింది. ఈ వేదికకు స్పష్టమైన ఫలితం దక్కేలా కనిపిస్తోంది.

సమాజంలో యువ ప్రాతినిధ్యం పెరిగిన నాడే దేశం అభివృద్ధి సాధిస్తుందని వివేకానందుడి స్ఫూర్తిదాయక మాటలకు అనుగుణంగా పవన్ యువశక్తి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అందుకు అత్యంత వెనుకబాటుతనం అన్న అపవాదును బలంగా నెట్టబడిన ఉత్తరాంధ్రను వేదికగా చేసుకున్నారు. ‘రణ’స్థలినే సమాజ మార్పునకు దిక్సూచిగా మలచడంలో పవన్ సక్సెస్ అయ్యారు. నిజాయతీగా కష్టించే మనస్తత్వం… గుండెల నిండా ఆశయ స్ఫూర్తి… బతుకు కోసం పోరాడే ధైర్యం… ఉత్తరాంధ్ర ప్రజల సొంతం. అయితే వారికి ఆయుధాలుగా నిలిచే విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇవ్వకుండా పాలకులు ఒక పద్ధతి ప్రకారం చేసిన విధ్వంసాలను యువశక్తి కళ్లకు కట్టినట్టు చూపించింది.
పవన్ యువశక్తి మీటింగ్ తరువాత ఉత్తరాంధ్రలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. రాజకీయంగా గతంలో తాము చేసిన తప్పిదాలు పునరావృతం కాకుండా యువకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత ఎన్నికల్లో ప్రత్యేక హోదా, యువతకు లక్ష ఉద్యోగాలు అంటూ జగన్ పార్టీ ట్రాప్ లో ఉత్తరాంధ్ర యువత పడ్డారు. విద్యార్థులు కూడా మోసానికి గురయ్యారు. పవన్ అభిమానులు సైతం ఈ జాబితాలో ఉన్నారు. అయితే యువశక్తిలో యువగళం, యువ ప్రతినిధుల మనోగతం విన్నాక.. అందరిలోనూ ఒకరకమైన భావన కలిగింది. తప్పుచేశామని.. మరోసారి ఆ తప్పు చేయకూడదన్న నిర్ణయానికి వచ్చారు.

వాస్తవానికి యువశక్తి కార్యక్రమాన్ని ప్రభుత్వం లైట్ తీసుకుంది. అటు రాజకీయ పక్షలు సైతం మామ్మూలు కార్యక్రమంగా పరిగణించాయి. వేలల్లోనే ప్రజలు వస్తారని అంచనా వేశారు. అటు నిఘా వర్గాలు సైతం ప్రభుత్వానికి అలానే నివేదించాయి. కానీ అంచనాలు తారుమారయ్యాయి. వందల్లో ప్రారంభమైన యువత ఆగమనం.. వందలు వేలుగా.. లక్షలుగా మారి ప్రభంజనం సృష్టించింది. వీర మహిళలు, విద్యార్థుల రాకతో ‘రణ’స్థలి నిజంగానే తన సార్థకతను చాటుకుంది. ఉత్తరాంధ్రలో మారిన రాజకీయాలకు తొలి అడుగైంది. ప్రజలకు స్ఫూర్తిదాయకమైన పిలుపుగా మారింది. అటు దశాబ్దాలుగా ఉత్తరాంధ్రను ఏలిన కొన్ని కుటుంబాలు తమ ఆధిపత్యానికి గండి తప్పదని భయపడుతున్నాయి. యువ నాయకత్వం వైపు ప్రజలు టర్న్ అయ్యారని తెలుసుకొని దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాయి.