https://oktelugu.com/

Joe Biden Car: ఢిల్లీకి చేరిన అమెరికా అధ్యక్షుడి కారు.. ఎంత శక్తిమంతమైందో తెలుసా?

ఈ నెల 9, 10 తేదీల్లో ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సదస్సు జరగనుంది. 20 దేశాధినేతలు పాల్గొనే ఈ సదస్సుకు సంబంధించి ఇప్పటికే కేంద్రం భద్రతా సిబ్బందిని, సాంకేతికత నిఘాను పటిష్టంగా ఏర్పాటు చేసింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 8, 2023 / 02:46 PM IST

    Joe Biden Car

    Follow us on

    Joe Biden Car: భారత్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీ 20 సదస్సుకు పలు దేశాల అధ్యక్షులు ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఈ సందర్బంగా ఆయనకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ శుక్రవారం(సెప్టెంబర్‌ 8న) ఢిల్లీ చేరుకోనున్నారు. ఈ క్రమంలోనే జో బైడెన్‌ ప్రయాణించే కారు ది బీస్ట్‌ గురువారం భారత్‌కు చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు ఏ దేశం వెళ్లినా.. ఆయన కంటే ముందే.. ఆయన కారు ఆ దేశానికి చేరుకుంటుంది. సొంత వాహనంలోనే అగ్రరాజ్య అధినేత విదేశీ పర్యటనలు చేస్తుంటారు. తాజాగా భారత్‌ రానున్న నేపథ్యంలో ది బీస్ట్‌ కారు భారత్‌కు చేరింది. ఈ కారుకు సంబంధించిన భద్రతా పరమైన ఫీచర్లు వింటే ఆశ్చర్య పోవాల్సిందే. ఎందుకంటే అందులో ఉన్నన్ని భద్రతా ప్రమాణాలు ఏ కారులోనూ ఉండవు. అందుకే అది ప్రపంచంలోనే సేఫెస్ట్‌ కారుగా పేరు గాంచింది. మరి ఆ విశేషాలు మనం కూడా తెలుసుకుందాం.

    ఢిల్లీలో పటిష్ట భద్రత..
    ఈ నెల 9, 10 తేదీల్లో ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సదస్సు జరగనుంది. 20 దేశాధినేతలు పాల్గొనే ఈ సదస్సుకు సంబంధించి ఇప్పటికే కేంద్రం భద్రతా సిబ్బందిని, సాంకేతికత నిఘాను పటిష్టంగా ఏర్పాటు చేసింది. అయితే ఆయా దేశాల నేతలు భారత్‌ అందించే భద్రతతోపాటు సొంత సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసుకుంటారు. అందులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రయాణించే కారు ‘ది బీస్ట్‌’ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సదస్సుకు ఒక రోజు ముందే( సెప్టెంబర్‌ 8న) భారత్‌కు రానున్న జో బైడెన్‌ మోదీతో ద్వైపాక్షిక భేటీ కానున్నారు. బైడెన్‌ ఆకాశంలో ప్రయాణించేందుకు ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంతోపాటు హెలికాప్టర్లను ఉపయోగిస్తారు. ఇక రోడ్డుపై ప్రయాణించేందుకు ది బీస్ట్‌ను వాడతారు. దీనికి ఎన్నో విశిష్ఠతలు ఉన్నాయి.

    అమెరికా అధ్యక్షుడి కారు ప్రత్యేకం..
    – ఆయా దేశాది నేతలు సొంత సెక్యూరిటీ ఏర్పాటుచేసుకున్నా.. అందులో అమెరికా అధ్యక్షుడి కారు ది బీస్ట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ ‘ది బీస్ట్‌’ కారును కాడిలాక్‌ వన్, ఫస్ట్‌ కార్‌ అని కూడా పిలుస్తారు.

    – ఈ కాడిలాక్‌ మోడల్‌ను 2018లో అమెరికా అధ్యక్షుడి కాన్వాయ్‌లోకి తీసుకొచ్చారు. లేటెస్ట్‌ ఫీచర్లతో, అత్యంత భద్రతా ప్రమాణాలతో ఈ కారును తయారు చేశారు. అమెరికా అధ్యక్షుడు ఏ దేశానికి వెళ్లినా ఈ బీస్ట్‌ కారు కూడా అక్కడ పెట్టాల్సిందే.

    – ఈ కారు అద్దాలు 5 ఇంచుల మందం, డోర్లు 8 ఇంచుల మందం ఉంటాయి. ఇక గాజు, పాలీకార్బొనేట్‌లతో ఐదు లేయర్లతో ఈ అద్దాలు తయారు చేశారు.

    – ఇందులో కేవలం డ్రైవర్‌ విండో మాత్రమే 3 ఇంచులు తెరుచుకుంటుండగా.. మిగతా అద్దాలేవీ తెరుచుకోవు. కారు మొత్తం బుల్లెట్‌ ప్రూఫ్‌ కలిగి ఉండి.. రసాయన, జీవాయుధ దాడులను తట్టుకుంటుంది.

    – అప్‌డేటెడ్‌ టెక్నాలజీతో తయారు చేసిన ఈ బీస్ట్‌ టైర్లు.. పగిలిపోకుండా పంక్చర్‌ కాకుండా ఉంటాయి. ఒకవేళ అవి డ్యామేజ్‌ అయినా అందులోని స్టీల్‌ రీమ్‌లతో ప్రయాణిస్తుంది.

    – స్టీల్, అల్యూమినియం, టైటానియం, సిరామిక్‌తో తయారు చేసిన ఈ బీస్ట్‌.. బాంబు బ్లాస్ట్‌లను కూడా తట్టుకుంటుంది.

    – ఎమర్జెన్సీ సమయంలో ఉపయోగించే ప్యానిక్‌ బటన్‌తో పాటు ఆక్సిజన్‌ కూడా ఉంది. అధ్యక్షుడి బ్లడ్‌గ్రూప్‌ సంబంధించిన బ్లడ్‌ బ్యాగ్‌లు కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి.

    – ఇక ఫ్యూయల్‌ ట్యాంక్‌ను ఏది ఢీకొట్టిన పేలకుండా ఉంటుంది. డ్రైవర్‌ క్యాబిన్‌లో కమ్యూనికేషన్, జీపీఎస్‌ ట్రాకింగ్‌ ఉంటుంది.

    – ఇక ఈ బీస్ట్‌ కారును సాధారణ డ్రైవర్లు నడపలేరు. బీస్ట్‌ డ్రైవర్‌కు అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ శిక్షణ ఇస్తుంది. ఇందులో ఏదైనా ఎమర్జెన్సీ తలెత్తితే అధ్యక్షుడిని ఎలా కాపాడాలనే దానిపై కూడా ట్రైనింగ్‌ ఇస్తారు.

    – ప్రతీ రోజు బీస్ట్‌ డ్రైవర్‌కు మెడికల్‌ టెస్టులు చేస్తారు. ఏదైనా అనుకోని పరిస్థితి ఎదురైతే 180 డిగ్రీల ‘జె టర్న్‌’తో కారును తప్పించేలా డ్రైవర్‌కు ట్రైనింగ్‌ ఇస్తారు.

    – ఇక కారు లోపలి భాగానికి మొత్తం గ్లాస్‌ అడ్డుగా ఉంటుంది. ఈ గ్లాస్‌ను అధ్యక్షుడు మాత్రమే కిందికి దించే వీలుంది. అధ్యక్షుడి సీట్‌ వద్ద శాటిలైట్‌ ఫోన్‌ ఉండగా.. దాని నుంచి నేరుగా అమెరికా ఉపాధ్యక్షుడు, పెంటగాన్‌కు ఫోన్‌ చేసి మాట్లాడే వీలు ఉంటుంది.

    యువ సైన్యంతో భద్రత..
    ఇక ఢిల్లీలో బైడెన్‌కు సంబంధించి భద్రతా ఏర్పాట్లను అమెరికా అధికారులు కొన్నివారాల కిందటే వచ్చి పర్యవేక్షిస్తున్నారు. బైడెన్‌ దగ్గర సెక్యూరిటీలో 21 నుంచి 28 ఏళ్ల వయసుగల సిబ్బంది ఉంటారు. వారి వద్ద పిస్తోళ్లు, లాంగ్‌ రేంజ్, షార్ట్‌ రేంజ్‌ వెపన్స్‌ ఉంటాయి. ఏవైనా దాడుల నుంచి అధ్యక్షుడిని తప్పించడానికి బుల్లెట్‌ రెసిస్టెంట్‌ షీట్లను ఉపయోగిస్తారు. అయితే బైడెన్‌ భద్రత కోసం భారత్‌కు 75 నుంచి 80 వాహనాలు తీసుకు రానున్నట్లు అమెరికా చెప్పగా.. పలు చర్చల తర్వాత వాటి సంఖ్యను 60 కి తగ్గించినట్లు తెలుస్తోంది.