Etela Rajender
Etela Rajender: ఎన్నికలు సమీపిస్తున్నాయంటే.. సర్వేలు కోకొల్లలుగా పుట్టుకొస్తాయి. సర్వే సంస్థలతోపాటు పార్టీలు కూడా కొన్ని సంస్థలతో సర్వేలు చేయించుకుంటున్నాయి. ఇంకా కొన్ని సంస్థలు గాలి లెక్కలతో రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. వాటి ఫలితాల్లో వాస్తవం ఎంత అన్నది ప్రశ్నార్థకమవుతోంది. తాజాగా తెలంగాణలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే తెలుగు రాష్ట్రాలతోపాటు జాతీయ స్థాయిలో లోక్‌సభ ఎన్నికలపై టైమ్స్‌నౌ సర్వే చేసింది. ఇందులో ఆంధ్రా, తెలంగాణలో పరిస్థితులను వివరించింది. బీఆర్‌ఎస్ 9–11, బీజేపీ 3–5, కాంగ్రెస్ 1–3 లోక్‌సభ స్థానాలు గెలుచుకుంటాయని తెలిపింది. ఈ ఫలితాలపైనే మూడు పార్టీల్లో చర్చ జరుగుతోంది. ఇంతలో మరో సర్వే తెలంగాణలో చర్చనీయాంశమైంది.
సీఎం అభ్యర్థిపై సీ ఓటర్ సర్వే..
తెలంగాణలో మరో నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం అభ్యర్థి ఎవరు అనేదానిపై సీఓటర్ సర్వే ఫలితాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇది సీఓటర్ చేసిందా.. లేక తప్పుడు సమాచారమా అనేది ఆ సంస్థ తెలుపాలి. అయితే ఈ సర్వే ఫలితాలు మాత్రం కొంత ఆశ్చర్యకరంగా ఉన్నాయి.
ఈటలకు 39 శాతం..
తెలంగాణ సీఎంగా ఎవరు అనే అంశంపై నిర్వహించిన సర్వేలో ఈటల రాజేందర్‌కు 39 శాతం మంది మద్దతు తెలిపినట్లు సీ ఓటర్ సర్వే ప్రకటించింది. ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు 33 శాతం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి 28 శాతం ప్రజలు మద్దతు తెలిపారని ప్రకటించింది. అయితే ఈ ఫలితాలపై సీ ఓటర్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
వాస్తవానికి భిన్నంగా..
సీఓటర్ సర్వే ఫలితాలు వాస్తవానికి భిన్నంగా ఉన్నట్లు చాలామంది అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా కాదని ఎవరికీ ఎక్కువ మంది మద్దతు ఇవ్వరనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అయితే సర్వేలో మాత్రం ఈటల సీఎం కేసీఆర్‌ను మించి పోయారు. అయితే ఫలితాలు ఎలా ఉన్నా.. ఇందులో వాస్తవం ఎంత అన్నదే ప్రస్తుతం చర్చనీయాంశమైంది.