TDP Leaders: తెలుగుదేశం పార్టీ అధికారం కోసం అర్రులు చాస్తోంది. తమ పార్టీ అధికారంలో లేకపోతే నష్టాలే వస్తాయని తెలుసుకుని ఇప్పుడు ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే పొత్తులతోనే పోటీకి వెళ్లాలని భావిస్తోంది. 2019లో అధికారం కోల్పోవడంతో చాలా మంది నేతలు పార్టీని వీడారు. ఇతర పార్టీల్లోకి వెళ్లారు. దీంతో ఇప్పుడు పార్టీ దాదాపుగా ఒంటరిదైపోయిందనే సంకేతాలు వస్తున్నాయి. దీంతో పార్టీలో మళ్లీ పునరుత్తేజం నింపాలని అధినేత చంద్రబాబు ఆశిస్తున్నారు. దీని కోసమే పార్టీని ప్రక్షాళన చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు.

ఇన్నాళ్లు పార్టీని నమ్ముకున్న సీనియర్లకు టికెట్లు ఇవ్వడంతో ఓటర్లు తిరస్కరించారు. వైసీపీ యువరక్తాన్ని బరిలోకి దించడంతో అటు వైపు మొగ్గు చూపారు ఓటర్లు. దీంతో ఈసారి బాబు కూడా యువతనే ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కొందరు నేతలపై సర్వేలు నిర్వహిస్తున్నారు. సర్వేల ఆధారంగానే పార్టీ టికెట్లు కేటాయించేందుకు బాబు సిద్ధమైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కాకపోతే పాత తరం వారి వారసులకే టికెట్లు ఇవ్వాలని చూస్తున్నారు. దీంతో వృద్ధ నేతలు తమ వారసులను ముందుకు తీసుకొస్తున్నారు. ఎలాగైనా తమ వారికి టికెట్లు దక్కించుకునే పనిలో పడుతున్నారు. అధినేత మెప్పు కోసం ఆరాటపడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో తమ ఉనికి ఉండేలా చూసుకోవాలని భావిస్తున్నారు. దీని కోసమే అహర్నిశలు శ్రమిస్తున్నారు.
Also Read: AP Govt Employees: మొత్తానికి ఏపీ ఉద్యోగుల కడుపు సల్లబడింది.. కానీ ట్విస్ట్ ఇదే..
అయితే పొత్తులు పెట్టుకుంటే కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి వస్తుందని భావిస్తున్నారు. అదే జరిగితే తమ సీటు ఎక్కడ ఫలహారమైపోతుందో అనే బెంగ అందరిలో పట్టుకుంది. మరోవైపు చంద్రబాబు పొత్తులతోనే అధికారం దక్కించుకోవాలని బలంగా అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ర్టంలో ఏ స్థానాలు పొత్తులో భాగంగా త్యాగం చేయాల్సి వస్తుందోనని అందరిలో అయోమయం నెలకొంది.