‘‘రెండేళ్ల నుంచి రూపాయి జీతం పెరుగలేదు.. ఐఆర్, పీఆర్సీ గురించి మాట్లాడరు.. దసరా పండుగకు సీఎం తీపి కబురలేదు.. ఉద్యోగుల కొనుగోలు శక్తి పెంచడం లేదు.. మా పరిస్థితే బాగాలేదు.. మా జీతం విరాళమివ్వడానికి మీరెవరూ..?) అంటూ జేఏసీ నేతలపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరినీ సంప్రదించకుండా ఒక రోజు వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇవ్వాలని ఉద్యోగ జేఏసీ తీసుకున్న నిర్ణయంపై భగ్గుమంటున్నారు. లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం మూడు నెలలు జీతం కోత పెట్టినప్పుడు కనీసం స్పందించని జేఏసీ కి ఒక్క రోజు జీతం కోత నిర్ణయం తీసుకునే అధికారం ఎలా ఉందని నిలదీశారు.
Also Read: జగన్ తనదైన రీతిలో మర్యాద చేస్తున్నాడట!
* పీఆర్ సీ లేదు… డీఏలు రావు
2018 జులై నుంచి వేతన సవరణ జరుగాల్సి ఉందని, మూడు డీఏలు కూడా పెండింగ్ లో ఉన్నాయని, పొరుగు రాష్ట్రం ఐఆర్ ఇస్తుంటే ఇక్కడ చాలీచాలని జీతంతో బతుకిలిడుస్తున్నామని వాపోయారు. కోత పెట్టిన వేతనాలు ఇంకా చేతికి రాకముందే, దసరా పండుగకు ముందు ప్రభుత్వం నుంచి ఏవైనా సానుకూల నిర్ణయాలు వెలువడుతాయోనని ఆశించాం.. అయితే ఒక్క రోజు వేతనాన్ని విరాళంగా చెల్లిస్తామని లేఖ ఏవిధంగా ఇస్తారని మండిపడ్డారు. దసరాకు ముందు పెండింగ్ డీఏలపై ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వెలువడాల్సి టైంలో జేఏసీ సొంత నిర్ణయాలు తీసుకోవడం తప్పని ఆక్షేపించారు. ఈమేరకు ఉద్యోగ జేఏసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 25సంఘాలతో కూడిన తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల సంయుక్త కార్యాచరణ కమిటీ, జాక్టో తదితర ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఐక్య వేదిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ కె.లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్ సభాకర్ రావు, కో చైర్మన్ ఎ.రాజేంద్ర బాబు గురువారం లేఖను సీఎస్ సోమేశ్ కుమార్కు అందించారు. ప్రభుత్వ వేతనంలో కోత పెట్టే ముందు ఉద్యోగుల అభిప్రాయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జేఏసీ ఉద్యుగులందరీ పక్షాన ప్రాతినిధ్యం వహించడం లేదని ఆరోపించారు. ముఖ్య మంత్రి సహాయనిధికి విరాళం ఇవ్వలేమని, తమకు అంత స్థోమత లేదని పెన్షనర్ల జేఏసీ స్పష్టం చేసింది. పెన్షనర్ల సమస్యలు వినడానికి సీఎంకు సమయమే లేదని, ఆరేళ్లుగా విజ్ఞప్తులు చేస్తున్నా అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని ఆక్షేపించారు.
* కేంద్రం అలా.. రాష్ట్రం ఇలా
కేంద్ర ప్రభుత్వానికి కూడా నిధుల కొరత ఉన్నా ఉద్యోగులను మెరుగ్గా చూసుకుంటోందని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చెబుతున్నారు. లాక్ డౌన్ కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాలంటే ప్రజల కొనుగోలు శక్తి పెరుగాలని భావిస్తున్న కేంద్రం.. తనవంతుగా ఉద్యోగులకు మరిన్ని డబ్బులు అందుబాటులో ఉండేలా చూస్తోందని, ఉద్యోగులకు వివిధ రకాల రుణాలు అందిస్తోందని, ఈ ఏడాది షరతులు లేకుండా ఎల్‌టీయేను ఖర్చు పెట్టుకునేందుకు పర్మిషన్ ఇచ్చిందని గుర్తు చేశారు. దసరా సందర్భంగా బోనస్ కూడా ప్రకటించిందన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అలాంటి ప్రతిపాదనే లేకపోవడం శోచనీయమన్నారు. లాక్ డౌన్ లో కేంద్రం కూడా రాష్ట్రంలాగే ఆర్థికంగా ఇబ్బంది పడినా, ఉద్యోగుల కొనుగోలు శక్తి పెంచడానికి చర్యలు తీసుకుంటోందన్నారు.
Also Read: బిహార్ లో బీజేపీ ఫీట్లు.. ఫలిస్తాయా?
* డీఏ లు ఇస్తేనే పండుగ సంబురం..
రాష్ట్రంలో 2.96లక్షల మంది ఉద్యోగులు, 2.78లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. వీరికి రెండేళ్లుగా రూపాయి వేతనం పెరుగలేదు. 2013 నాటి పీఆర్సీ వేతనాలతోనే నెట్టుకొస్తున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. 2018 జూన్ 30తో పీఆర్ సీ గడువు ముగిసిందని, అదే సంవత్సరం జులై నుంచి కొత్త పీఆర్సీ అమలు కావ్సలి ఉన్నా.. ఇప్పటికీ పురోగతి లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 63శాతం ఫిట్ మెంట్ తో వేతనాలు సవరించాలని కోరామని.. అయినా ప్రభుత్వం దిగిరాలేదన్నారు. కనీసం 27శాతం ఐఆర్ ఇవ్వాలని కోరినా అతీగతీ లేదని వాపోయారు. 2019జనవరి, 2019 జులై, 2020 జనవరికి సంబంధించిన మూడు డీఏలు రావాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా డీఏలు ఇస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తొక్కిపెట్టిందని వాపోయారు. మూడు డీఏలు పెండింగ్ లో ఉండడంతో జీతంలో ఎలాంటి మార్పు లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు ఏలాగూ బోనస్ లు ఇవ్వదు కనీసం మూడు పెండింగ్ డీఏలు ఇస్తేనే తమ ఇండ్లల్లో పండుగ సంబరం ఉంటుందని చెబుతున్నారు.