రాజకీయాల్లో వలసలు కామన్. ఎప్పుడు ఏ నాయకుడు ఏ పార్టీలోకి దూకుతాడో ఎవరం అంచనా వేయలేం. పార్టీలో ప్రాధాన్యం లేదనో.. టికెట్ ఇవ్వడం లేదనో.. ఇతర నేతలతో పొసగడం లేదనో.. ఏదో ఒక కారణంతో పార్టీలు మారుతూనే ఉంటారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది వైసీపీ నేతలు ఆ పార్టీలోకి వెళ్లిపోయారు. ఆ స్థాయిలో చంద్రబాబు కూడా వలసలను ప్రోత్సహించారు కూడా. అయితే.. ఏపీలో ఇప్పుడు జగన్ రాజ్యం నడుస్తోంది. దీంతో ప్రతిపక్ష టీడీపీని వీడి ఇప్పటికే చాలా క్యాడర్ వైసీపీలోకి దూకేసింది.
Also Read: బీజేపీని బుట్టలో వేసేందుకు బాబు రాజకీయం
అయితే.. అలా వలస వచ్చిన నేతలకు జగన్ కూడా తనదైన రీతిలో మర్యాద చేస్తున్నారట. చంద్రబాబును దెబ్బతీయడానికి టీడీపీ నుంచి వచ్చే నేతలకు వైసీపీ సాదర స్వాగతం పలుకుతోంది. వైసీపీ కండువాలు కప్పుతోంది. ఇప్పటికే అలా నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని జగన్ చెబుతున్నారట. తనను నమ్మి వచ్చిన వారికి.. వారికిచ్చిన హామీలను అమలుచేస్తానని జగన్ సన్నిహితుల వద్ద మాట్లాడుతుండడం చర్చనీయాంశమైంది.
మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి రాగా అందులో రెండు నియోజకవర్గాల్లో మాత్రమే ఎక్కువగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒకటి గన్నవరం కాగా, మరొకటి చీరాల నియోజకవర్గం. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ నుంచి వచ్చిన వల్లభనేని వంశీ, వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావుకు మధ్య పొసగడం లేదు. రెండు వర్గాలు గన్నవరంలో బాహాబాహీ అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. ఇద్దరి చేతులు కలిపి సయోధ్యగా ఉండాలని కోరారు. అయితే వివాదం సద్దుమణుగుతుందని భావించారు. జగన్ స్వయంగా చెప్పడంతో గన్నవరం సెట్ అవుతుందనుకున్నారు. కానీ యార్లగడ్డ వెంకట్రావు వర్గం మాత్రం ఇందుకు సహకరించేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది.
Also Read: ఇసుక పాలసీ పేరిట ఈ కుప్పిగంతులేలా?
ఇక చీరాల నియోజకవర్గంలోనూ అదే జరుగుతోంది. ఇక్కడ వైసీపీ ఇన్‌చార్జిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్‌ను కాదని పార్టీలోకి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాంకు ప్రాధాన్యత ఎక్కువ దొరుకుతోంది. దీంతో ఆమంచి ఇబ్బందిగా ఫీలవుతున్నారు. వైసీపీ అగ్రనాయకత్వం అనేకసార్లు పంచాయితీలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే అధిష్టానం మాత్రం కొత్తగా పార్టీలో వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడి వైసీపీ నేతలు యార్లగడ్డ వెంకట్రావు, ఆమంచి కృష్ణమోహన్ వర్గాలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నాయని సమాచారం.