CM Jagan: తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడూ ఏపీ రాజకీయాల్లో తలదూర్చలేదు. ఆయన ఫోకస్ అంతా ఎప్పుడూ తెలంగాణ రాజకీయాలపై, పాలనపై పెడుతారు. ఎప్పుడైనా రాజకీయంగా విమర్శలు చేయాల్సి వచ్చిన్నపుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై విరుచుకుపడతారు. గతంలో కేంద్రంలో అధికారంలో ఉండి, ఇప్పుడు ప్రతిపక్ష స్థానానికే పరిమితమైన కాంగ్రెస్ పై కూడా విమర్శలు చేస్తారు. కానీ ఏపీపై పెద్దగా వ్యాఖ్యలు చేయరు. అయితే ఇటీవల జరగిన ప్లీనరీ సమావేశంలో తెలంగాణ కంటే ఏపీ వెనకబడిపోయిందని మాట్లాడారు. దీనిపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అది జగన్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయన్న విషయంలో ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు.

ఎన్నికల సమయంలో వైసీపీకి సపోర్ట్..
2014 జూన్ 2న ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ, ఏపీగా విడిపోయింది. అదే సమయంలో ఇటు తెలంగాణాలో టీఆర్ ఎస్, అటు ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టాయి. అప్పటి నుంచి కేసీఆర్ తెలంగాణలో పాలన, కేవలం ఇక్కడి రాజకీయాలపై మాత్రమే పూర్తి దృష్టి పెట్టారు. కానీ తెలుగుదేశం సందర్భం వచ్చినప్పుడల్లా ఇక్కడ పోటీ చేయడం, రాజకీయ పదవులు దక్కించేందుకు ప్రయత్నాలు చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సమయంలో టీఆర్ ఎస్‌కు వ్యతిరేకంగా పొత్తుతో పోటీ చేసింది టీడీపీ. ఎన్నో విభేధాలు ఉన్న కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకొని, సీపీఐతో కూడా కలిసి పోటీ చేసింది. కానీ టీఆర్ ఎస్ ఘన విజయం సాధించి రెండో సారి అధికారం చేపట్టింది. ఆ ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇక్కడి రాజకీయాల్లో చూపించిన అత్యుత్సాహం కేసీఆర్‌కు కోపం తెప్పించింది. అందుకే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ పరోక్షంగా టీడీపీని ఉద్దేశించి మాట్లాడారు. ఏపీలో టీడీపీకి వ్యతిరేకంగా ఉండి వైసీపీకి పూర్తి మద్దతు తెలిపింది. అప్పుడే మొదటి సారి ఏపీ రాజకీయాల్లోకి కేసీఆర్ వేలుపెట్టారు. ఇక అప్పటి నుంచి మళ్లీ ఆ రాజకీయాల జోలికి వెళ్లలేదు. తెలంగాణలోనే తన పని చూసుకుంటున్నారు.
ప్లీనరీలో వ్యాఖ్యలు జగన్‌కు మేలు చేస్తాయా ? కీడు చేస్తాయా ?
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ప్లీనరీ వేడుకల్లో సీఎం కేసీఆర్ ఏపీ ప్రస్తావన తీసుకొచ్చారు. తెలంగాణ కంటే అభివృద్ధిలో ఏపీ వెనకబడిపోయిందంటూ చెప్పుకొచ్చారు. విడిపోయాక తెలంగాణ అంధకారమవుతుందున్న ఆంధ్ర రాష్ట్రమే ఇప్పుడు కరెంటు కోతలతో ఇబ్బందులు పడుతుందని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలు ప్రస్తుత సీఎం జగన్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అక్కడ పోటీ చేయాలనే అంశంపై కూడా కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే జగన్, కేసీఆర్ లు ఇద్దరు చాలా కాలం నుంచి స్నేహంగా ఉంటున్నారు. ఒకరి అభిప్రాయాలకు ఒకరు గౌరవం ఇస్తున్నారు. అక్కడ పోటీ చేస్తే జగన్ మేలు చేసే విధంగా మాత్రమే కేసీఆర్ అడుగులు వేస్తారని, ఆయనకు నష్టం చేకూర్చే విధంగా మాత్రం ఉండకపోవచ్చని తెలుస్తోంది.