JanaSena: జనసేనలోకి ఒక బలమైన రాజకీయ నేపథ్యం కలిగిన చైతన్య అనే యువతి చేరారు. సామాజిక సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న ఆమె.. జనసేన విధి, విధానాలు నచ్చడంతో ఆ పార్టీలో చేరారు. పవన్ సైతం సాదరంగా ఆహ్వానించారు. స్వచ్ఛంద సేవ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న ఆమెను అభినందించారు. జనసేనలో అంకితభావంతో కృషి చేయాలని ఆశీర్వదించారు. దీంతో చైతన్య ఎవరు? అని బలమైన చర్చ ప్రారంభమైంది.
చైతన్య మాజీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ దివంగత డీకే ఆదికేశవులు నాయుడు మనుమరాలు. కుమార్తె తేజస్విని కూతురే చైతన్య. డీకే ఆదికేశవులు నాయుడు తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పని చేశారు. తిరుపతి ఎంపీగా కూడా వ్యవహరించారు. ఆయన అకాల మరణంతో 2014 ఎన్నికల్లో ఆయన భార్య డీకే సత్య ప్రభ టిడిపి తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంతలోనే ఆదిత్య జనసేనలో చేరడం విశేషం.
పొత్తులో భాగంగా తిరుపతి స్థానాన్ని జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే డీకే ఆదికేశవులు నాయుడు మనవరాలు చైతన్య జనసేనలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవేళ జనసేన కు టికెట్ కేటాయిస్తే చైతన్యకు దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పక్కా వ్యూహంతోనే చైతన్యను జనసేనలో చేర్పించారని తిరుపతి రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత కొన్ని రోజులుగా ఓ ట్రస్ట్ ద్వారా చైతన్య సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. ఇప్పటికే వైసీపీ తరఫున భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు పేరుని హై కమాండ్ ఖరారు చేసింది.