MP Gorantla Madhav
MP Gorantla Madhav: పొలిటికల్ జాక్ పాట్ కు చక్కటి ఉదాహరణ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్. పోలీస్ శాఖలో సిఐ గా ఉంటూ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. హిందూపురం టికెట్ దక్కించుకున్నారు. ఎంపీగా గెలిచారు. అయితే ఎంత వేగంగా రాజకీయ తెరపైకి వచ్చారో.. అదే స్పీడ్ లో వివాదాలను తెచ్చుకున్నారు. తన అశ్లీల ప్రవర్తనతో ఇప్పుడు రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇన్నాళ్లు తనను వెనకేసుకొచ్చిన అధినేత జగన్ సైతం గోరంట్ల మాధవ్ ను పక్కన పెట్టేశారు.దీంతో మాధవ్ పొలిటికల్ లైఫ్ ప్రశ్నార్ధకంగా మిగిలింది.
ఎంపీ టికెట్ ను తప్పించి ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి గోరంట్ల మాధవ్ తో పోటీ చేయిస్తారని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఏకంగా మాధవ్ ను గాలిలో పెట్టారు. కనీసం అసెంబ్లీకి పంపించే ఆలోచనలో జగన్ లేనట్లు తెలుస్తోంది. రాజకీయం కోసం ఉన్న ఉద్యోగాన్ని సైతం మాధవ్ వదులుకున్నారు. అనంతపురం జిల్లాలో సీఐ గా ఉండేవారు. పోలీసులపై జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సవాల్ చేస్తూ ఆయనతోనే తలబడ్డారు. వార్నింగ్ ఇచ్చినంత పని చేశారు. ఆ సాహసం మెచ్చి జగన్ గోరంట్ల మాధవ్ ను చేరదీశారు. ఎంపీగా గెలిపించుకున్నారు. ఎన్నికల్లో మాత్రం మొండిచేయి చూపి ఆయనకు షాక్ ఇచ్చారు.
హిందూపురం పార్లమెంట్ స్థానం సమన్వయకర్తగా జోలదరాసి శాంత నియమితులయ్యారు. బళ్లారికి చెందిన మాజీ మంత్రి శ్రీరాములకు ఈమె స్వయానా సోదరి. గాలి జనార్ధన రెడ్డి బ్యాచ్ అన్నమాట. గాలి జనార్దన్ రెడ్డి తో పాటు శ్రీరాములతో జగన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ తరుణంలోనే హిందూపురం తెరపైకి శాంత వచ్చారు. మంగళవారం మధ్యాహ్నం ఆమె సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. సాయంత్రానికి హిందూపురం లోక్ సభ అభ్యర్థిగా ఆమె పేరును ప్రకటించారు. గోరంట్ల మాధవ్ ను పూర్తిగా పక్కన పెట్టేశారు.రాజకీయాల్లో దూకుడు కొంతవరకే అక్కరకు వస్తుందనడానికి గోరంట్ల మాధవ్ చక్కటి ఉదాహరణ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.