
కరోనా పడగ ఇంకా పోలేదు. అది మన చుట్టూ కాచుకొని కూర్చుంది. మొదటి వేవ్ తగ్గిందని బిందాస్ గా రోడ్లమీదకు వచ్చి విచ్చలవిడిగా తిరిగిన జనాలకు రెండో వేవ్ అంటూ కరోనా విరుచుకుపడింది. తన ప్రతాపాన్ని చూపించింది. ఇప్పుడు లాక్ డౌన్ తో సెకండ్ వేవ్ కూడా కంట్రోల్ అయ్యింది. జనాలు రిలాక్స్ అవుతున్నారు. అయితే మూడో వేవ్ ముప్పు పొంచి ఉందని.. సెప్టెంబర్ లో అది పెనుముప్పుగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే ఇంతటి ముందస్తు ఉపద్రవాన్ని అరికట్టాలంటే ప్రభుత్వాలు ముందుగా అప్రమత్తంగా ఉండాలి. కానీ అవే నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఎలా..? ఇప్పుడు ఏపీ మంత్రి అప్పలరాజు చేసిన ఘనకార్యం జాతీయ మీడియాలో పతాక శీర్షిక అయ్యింది. ఇంతటి నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలతో ఏపీ ప్రభుత్వం చెలగాటమాడుతోందని దుమ్మెత్తి పోసింది.
శ్రీకాకుళంలో మంత్రి అప్పలరాజు తాజాగా ‘వైఎస్ఆర్ చేయూత’ పథకంలో భాగంగా మహిళలకు చెక్కుల పంపిణీ చేపట్టారు. దీనికి జాతరలా జనం వెల్లువెత్తారు. కనీసం భౌతిక దూరం లేకుండా.. మాస్కులు కూడా పెట్టుకోకుండా మహిళలు, మగవారు తరలివచ్చారు. ఇంతటి భారీ జనసందోళం కోవిడ్ నిబంధనలకు పూర్తి వ్యతిరేకం. పైగా ప్రభుత్వమే ఇలా నిర్వహించడం దుమారం రేపింది.
పోలీసులు నలుగురు గుమిగూడితే వారిపై లాఠీలు ఝలిపిస్తారు. కానీ మంత్రిగారు ఇలా వేల మందితో చెక్కుల పంపిణీ చేపట్టినా పోలీసులు మిన్నకుండిపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. జాతీయమీడియా ఇండియా టుడే చానెల్ ఏపీ మంత్రిని, ఏపీ ప్రభుత్వ కరోనా ఉదాసీనతపై నిప్పులు చెరిగింది. దేశంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న ఏపీలో ఈ నిర్లక్ష్యం కారణంగానే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని.. ఇది జగన్ సర్కార్ కు కనువిప్పు కలగాలని ఇండియా టుడే విమర్శలు గుప్పించింది.