Amaravati lands: ఆనాడు అమరావతిలో పచ్చని పొలాలు కనిపించలేదా?

ఈ తరుణంలో ఎల్లో మీడియా తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అమరావతిప్రాంతంలో మూడు పంటలు పండే పచ్చని పంట పొలాలు మీకు గుర్తుకు రాలేదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

Written By: Dharma, Updated On : October 16, 2023 2:52 pm
Follow us on

Amaravati lands: విశాఖ నుంచి పాలనకు ఏపీ సీఎం జగన్ సిద్ధపడుతున్నారు. విజయదశమి నుంచి ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. తన వెంట రావాల్సిన శాఖలు గురించి ప్రత్యేక అధికారుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అధ్యయనం తర్వాత ప్రభుత్వానికి నివేదిక చేరనుంది. మరోవైపు సీఎం క్యాంప్ ఆఫీస్ గా భావిస్తున్న రిషికొండలో నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే ఒకవైపు కోర్టులో కేసు పెండింగ్లో ఉండగా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని సాకుగా చూపి యంత్రాంగాన్ని తరలించేందుకు సీఎం జగన్ సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరోవైపు ఎల్లో మీడియా ప్రత్యేక కథనాలను రాస్తుంది. రిషికొండను తొలచి.. పర్యాటక నిబంధనలను తుంగలో తొక్కి నిర్మాణాలు చేపడుతున్నారని ఘోషిస్తోంది. ఇందుకుగాను 270 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టినట్లు.. అదంతా వృధా ప్రయాసేనని.. మరో ఆరు నెలల తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వంలో ఆ కొత్త భవనాలు నిరుపయోగంగా మారుతాయని ప్రచారం చేస్తుంది. పర్యాటక ఆనవాళ్లు లేకుండా జగన్ సర్కార్ చేస్తోందని కథనాలతో వ్యతిరేక ప్రచారాన్ని ఎల్లో మీడియా ప్రారంభించింది. కొండను గుండు కొట్టారని.. నిబంధనలకు విరుద్ధంగా తవ్వారని గణాంకాలతో సహా చెబుతోంది.

ఈ తరుణంలో ఎల్లో మీడియా తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అమరావతిప్రాంతంలో మూడు పంటలు పండే పచ్చని పంట పొలాలు మీకు గుర్తుకు రాలేదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. హైదరాబాదులో అభివృద్ధి చెందిన ప్రాంతాలు.. పూర్వాశ్రమంలో కొండలు, గుట్టలే. వాటిని తవ్వి నిర్మాణాలు చేపట్టారు. నగరీకరణ వైపు అడుగులు వేశారు. బంజారా హిల్స్, జూబ్లీహిల్స్ తో పాటు ఇప్పుడు వెలసిన అన్ని నిర్మాణాలు.. కొండలను తవ్వి చేపట్టినవే. ఆ విషయం ఎల్లో మీడియాకు తెలియంది కాదు. అమరావతికి రైతులు భూములు ఇచ్చారు. ఇది ముమ్మాటికీ వాస్తవం. అదే సమయంలో అక్కడ పొలాలు మూడు పంటలు పండించుకునేందుకు యోగ్యమైనవి. ఎప్పుడైతే అమరావతి ప్రకటించారో.. లక్షల ఎకరాల పచ్చని పంట భూములు రియల్ వెంచర్లుగా మారిపోయాయి. పచ్చదనం కనుమరుగయింది. అప్పుడు ఎల్లో మీడియా పచ్చని పంటలు ధ్వంసమయ్యాయి అన్న వార్త ఏనాడైనా రాసుకొచ్చిందా? వారికి చంద్రబాబు ముఖ్యం. తెలుగుదేశం ప్రయోజనాలు అంతకంటే ముఖ్యం. అందుకే రిషికొండలో జగన్ పాలన ప్రారంభిస్తారని తెలిసి.. విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.