https://oktelugu.com/

Gaddar- KCR: గద్దర్ కు కేసీఆర్ సరైన న్యాయం చేయలేదా? పట్టించుకోలేదా?

అసెంబ్లీలో తన ప్రభుత్వం చేసిన గొప్పలను కేసీఆర్ గంటలపాటు చెప్పుకుంటున్నారు. ఆయన ప్రసంగం ప్రారంభించిన కొద్దిసేపటికి గద్దర్ చనిపోయినట్టు సమాచారం అందింది.

Written By:
  • Rocky
  • , Updated On : August 8, 2023 12:17 pm
    Gaddar- KCR

    Gaddar- KCR

    Follow us on

    Gaddar- KCR: గద్దర్.. తెలంగాణ గొంతుక. ఉద్యమంలో ఆయన పాటకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రత్యేక రాష్ట్రం కోసం నినదించి యువతను ఉద్యమం వైపు నడిపిన యుద్ద నౌక. పీడితుల బతుకుబాటకు నిలువెత్తు రూపమైన ప్రజా వాగ్గేయకారుడి మరణంతో యావత్ తెలుగు సమాజం దిగ్భ్రాంతికి గురైంది. లెఫ్ట్, రైట్ భావజాల వైరుధ్యాలను పక్కనపెట్టి.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు గద్దర్ మృతదేహానికి నివాళులర్పించేందుకు పోటెత్తారు.

    అయితే ఈ సమయంలో అధికార భారత రాష్ట్ర సమితి వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. తొలుత కాంగ్రెస్ నాయకులు అంతా తామై వ్యవహరించారు. అనివార్య పరిస్థితుల్లోనే భారత రాష్ట్ర సమితి నాయకులు స్పందించారు. గద్దర్ అంతిమయాత్రలో కూడా ఎన్నికల క్రెడిట్, రాజకీయాలకు పాల్పడటం అందరిని ఆశ్చర్యపరిచింది. గద్దర్ మరణించిన విషయం తెలిసిన వెంటనే అందరికంటే ముందు కాంగ్రెస్ నాయకులు స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ ఇన్చార్జి మాణిక్ రావ్ ఠాక్రే, ఆ పార్టీ ఎమ్మెల్యే సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అపోలో ఆసుపత్రికి తరలి వెళ్లారు. పార్థివ దేహాన్ని సందర్శించారు. వాస్తవానికి గద్దర్ మరణ వార్త తెలిసే నాటికి రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో ఉన్నారు. వెంటనే దాన్ని రద్దు చేసుకొని ఆయన హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు. గద్దర్ మృతదేహాన్ని ఎల్బీ స్టేడియంలోకి తీసుకొచ్చేందుకు చొరవ చూపారు. ఎల్బీ స్టేడియం గేట్లను తొలగించి ప్రజలు సందర్శించే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. అప్పటికి తెలంగాణ అసెంబ్లీ కొనసాగుతోంది.

    ఆ అసెంబ్లీలో తన ప్రభుత్వం చేసిన గొప్పలను కేసీఆర్ గంటలపాటు చెప్పుకుంటున్నారు. ఆయన ప్రసంగం ప్రారంభించిన కొద్దిసేపటికి గద్దర్ చనిపోయినట్టు సమాచారం అందింది. అయినప్పటికీ కెసిఆర్ గద్దర్ ప్రస్తావన తీసుకురాలేదు. రెండు గంటల పాటు సాగిన కేసీఆర్ ప్రసంగంలో గద్దర్ ప్రస్తావన తీసుకురాకపోవడం విశేషం. గద్దర్ అభిమానులను ఇది తీవ్రంగా నిరశపరిచింది. మరోవైపు మంత్రి కేటీఆర్ గద్దర్ గురించి మాట్లాడి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గద్దర్ మృతి నేపథ్యంలో సోషల్ మీడియాలో వెల్లువెత్తిన నిరసన భారత రాష్ట్ర సమితి నాయకులను ఆలోచనలో పడేసింది. అందుకే వెంటనే అధికారిక లాంఛనాలకు సంబంధించిన ప్రకటన విడుదలైంది. రెండవ రోజు సోమవారం కూడా అనివార్యమైన పరిస్థితిలోనే కొన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు గద్దర్ను అక్కున చేర్చుకోవడాన్ని అర్థం చేసుకున్న భారత రాష్ట్ర సమితి.. వెంటనే తన పార్టీ ఎమ్మెల్యేలను ఎల్బీ స్టేడియానికి పంపించింది. చివరికి ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం గద్దర్ ఇంటికి వెళ్లి నివాళులు అర్పించారు. గద్దర్ అంతిమయాత్రలోనూ భారత రాష్ట్ర సమితి నాయకులు పోటాపోటీ రాజకీయాలకు పాల్పడ్డారు. గద్దర్ అంత్యక్రియల్లో కంటోన్మెంట్ భారత రాష్ట్ర సమితి నేతల మధ్య ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి కారు గుర్తుపై పోటీ చేయాలనుకుంటున్న మన్నె క్రిశాంక్, ఎర్రోళ్ల శ్రీనివాస్, గజ్జల నాగేష్ ఎవరికి వారు తామై కనిపించారు. కొంత మంది నాయకులు జన సమీకరణ చేశారు. అంతిమయాత్రలో తోపులాట జరిగేందుకు ఇది కూడా ఒక కారణమైందని తెలుస్తోంది. ఇక కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి నాయకులు పోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బ్రదర్ నివాసం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరస్పరం తారసపడలేదు. అంతిమయాత్ర వాహనం రాకముందే గద్దర్ ఇంటికి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. పైగా ఆయన అక్కడే ఉన్నారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి వస్తున్నారని తెలుసుకొని ఐదు నిమిషాల ముందే రేవంత్ రెడ్డి అక్కడ నుంచి వెళ్లిపోయారు. కెసిఆర్ వచ్చిన వెంటనే అక్కడే ఉన్న బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కూడా వెళ్లిపోయారు.