TSRTC Merge In Govt: వేలకోట్ల ఆస్తులతో ప్రభుత్వంలో తెలంగాణ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ విలీనం దాదాపుగా అయినట్టే. ఈ ప్రక్రియతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ డిపోలు, దాని పరిధిలో ఉన్న భూములు మొత్తం ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లిపోతాయి. 90 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆర్టీసీకి రాష్ట్ర వ్యాప్తంగా 1,404 ఎకరాల భూములు ఉన్నాయి. బస్ భవన్ సహా డిపోలు, బస్ స్టాండ్లు, కమర్షియల్ కాంప్లెక్స్ లు, ఇతర విలువైన ఆస్తులు ఆర్టీసీకి ఉన్నాయి.. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 250కుల భూములు ఉన్నాయి. హైదరాబాద్ నడిబొడ్డున ఆర్టీసీ బస్సు భవన్, ముషీరాబాద్ డిపో, జిహెచ్ఎంసి, జిల్లా కేంద్రాలు, ఇతర పట్టణాల్లో అత్యంత విలువైన భూములు ఉన్నాయి. వీటంన్నిటి మార్కెట్ విలువ 80,000 కోట్ల పై మాటే అని ఆర్టీసీ ఓనర్ అధికారులు చెబుతున్నారు.
వాస్తవానికి ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కుదరదని కెసిఆర్ గతంలోనే చెప్పారు. ఎన్నికల సమయం కావడం, ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం మీద ఆగ్రహంగా ఉండడంతో.. కెసిఆర్ ఉన్నట్టుండి ఒక్కసారిగా విలీనం చేసేశారు. గవర్నర్ కూడా ఒకరోజు సస్పెన్స్ తర్వాత దానికి ఆమోదముద్రవేశారు.. ఆర్టీసీకి ఉన్న విలువైన భూములు అమ్మడానికే ప్రభుత్వం విలీనం అనే ప్రతిపాదన తీసుకొచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆర్టీసీకి రాష్ట్ర వ్యాప్తంగా మూడు జోన్లలో 11 రీజియన్లు ఉన్నాయి. వాటి పరిధిలో 96 డిపోలు కొనసాగుతున్నాయి. గతంలో 99 డిపోలు ఉండగా .. వాటిల్లో మూడు మూతపడ్డాయి. ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బస్ భవన్ విలువే 650 కోట్లు ఉంటుంది. హైదరాబాద్ నడిబొడ్డున ముషీరాబాద్ 1,2,3 డిపోలతో పాటు ఇక గెస్ట్ హౌస్ కూడా ఉంది. ఇవన్నీ ఇంచుమించు 10 ఎకరాలపైనే ఉంటాయి. వీడి దగ్గరలోనే ఆర్టీసీ కల్యాణ మండపం ఉంది. ఉప్పల్ జోనల్ వర్క్ షాప్, జూబ్లీ బస్ స్టేషన్, హయత్ నగర్ దగ్గర ఉన్న ఆర్టీసీ డిపో భూములు, కరీంనగర్ జోనల్ వర్క్ షాప్, కొన్ని ఆర్టీసీ భవనాలు, భూములను తనఖా పెట్టి వివిధ బ్యాంకుల్లో సంస్థల్లో అప్పులు చేసింది.
ఆర్టీసీకి సంబంధించి కీలకమైన నిర్ణయాలకు ప్రత్యేకంగా బోర్డు అనుమతి తప్పనిసరి. భూముల అమ్మకంతో పాటు ఇంకేదైనా చేయాలనుకున్నా బోర్డు తీర్మానం పాస్ చేయాల్సిందే. ఒకవేళ బోర్డు తీర్మానం పాస్ చేసినప్పటికీ అది ఆర్టీసీ అభివృద్ధి కోసం, కార్మికుల సంక్షేమం కోసం మాత్రమే ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం అయితే సంబంధిత శాఖ సెక్రెటరీ జీవో ఇవ్వడంతోనే ఏ పనిచేయాలన్నా పూర్తవుతుంది. దీని వల్ల బోర్డు అధికారాలకు కత్తెర పడుతుంది. ఆర్టీసీలో 43,260 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో డ్రైవర్లు 18,257 మంది. వీరిలో కండక్టర్లు 15,412 మంది. ఇతర సపోర్టింగ్ స్టాఫ్ 9,591. తెలంగాణ ఏర్పడే నాటికి 56,740 మంది కార్మికులున్నారు. సంవత్సరాలలో 13,480 మంది తగ్గిపోయారు. ఆర్టీసీలో 9,144 బస్సులున్నాయి. అందులో సంస్థ కొనుగోలు చేసినవి 6,375, అద్దెకి తీసుకున్నవి 2,769. నెలకు 485.30 కోట్ల ఆదాయం వస్తోంది. 531.36 కోట్లు ఖర్చు చేస్తోంది. తో నెలకు సగటున 46 కోట్ల నష్టం వాటిల్లుతోంది. కార్మికుల వేతనాల కోసం నెలకు 185 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మరోవైపు కార్మికులకు సంస్థ రెండు పిఆర్సీలు ఇవ్వాల్సి ఉంది. 2013 లో ఇవ్వాల్సిన పిఆర్సిని 2015లో ఇచ్చింది..2017, 21లో రెండు పీఆర్సీలు ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఆర్టీసీ వాటిని హోల్డ్ లో పెట్టింది. ఇవి కనుక అమలు చేసి ఉంటే కార్మికులకు జీతాలు భారీగా పెరిగేవి. మరో వైపు తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు 11,500 కోట్ల నష్టాల్లోకి ఆర్టీసీ వెళ్ళిపోయింది. తెలంగాణ ఏర్పడే నాటికి ఆర్టిసి 299.64 కోట్ల నష్టం లో ఉంది.