జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై చేస్తున్న విమర్శలను జేసీ తిప్పికొట్టారు. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వైఎస్ఆర్ తమకు ఎప్పటికి నరరూప రాక్షసుడే అంటూ అనడంపై స్పందించారు. అంత తీవ్రంగా మాట్లాడుతున్నా వైసీపీ నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారంటూ విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలపై ఒంటికాలిపై లేచే నేతలున్న వైసీపీ ఎందుకు మాట్లాడడం లేదని విమర్శించారు. బూతుతు తిడుతున్నా పెదవి విప్పకుండా ఉండడం ఏమిటని ప్రశ్నించారు. తమ ప్రాంత నేతలపై విరుచుకుపడుతున్నా ఆగ్రహం రాకుండా ఎలా ఉంటుందని మండిపడ్డారు.
వైఎస్సార్ ను తెలంగాణ నేతలు తిట్టడం బాగా లేదని అన్నారు. వైఎస్సార్ తనకు ఆప్తుడని వ్యాఖ్యానించారు. పెద్ద మనిషిని పట్టుకుని ఇష్టమొచ్చినట్లు తిట్టడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. తెలంగాణ నేతలు వైఎస్సార్ ను రాక్షసుడిగా అభివర్ణించడం భావ్యం కాదని సూచించారు. విపక్షాల మీద విరుచుకుపడే మంత్రులు ఇప్పుడు గాజులు తొడుక్కున్నారా అని విరుచుకుపడ్డారు.
సీఎం జగన్ తోపాటు మంత్రులు సైతం తెలంగాణ నేతల బూతులు చూస్తూ ఊరుకుంటుంటే జేసీ మాత్రం నోరు విప్పడంపై అందరిలో మంచి అభిప్రాయం కలుగుతోంది. గతంలో చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చేయండి అన్న జగన్ ఇప్పుడు ఎందుకు పెదవి విప్పడం లేదో అర్థం కావడం లేదన్నారు. కొడాలి నాని, అనిల్ యాదవ్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి నేతలు ప్రస్తుతం ఏం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
వైఎస్సార్ కు మద్దతుగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడడంతో వైఎస్ అభిమానుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. తెలంగాణ నేతలపై వ్యాఖ్యలు చేయడానికి తోకలు ముడిచే మంత్రుల డొల్లతనాన్ని ప్రభాకర్ రెడ్డి భలే బయట పెట్టారని సూచిస్తున్నారు. మంత్రులే ముందుకు రాకపోవడంతో జేసీ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. మొత్తానికి వైఎస్ అభిమానుల గుండెల్లో జేసీ చోటు సంపాదించుకున్నారు.