Venkaiah Naidu: ‘రిటైర్ అవ్వలేదు.. అవ్వాల్సి వచ్చింది’ అంటూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. తన మనసు, శరీరం ఇంకా రాజకీయాల్లో ఉండాలని.. సేవ చేయాలని ఉన్నదని.. కానీ రాజకీయాల్లోంచి తనకు శాశ్వతంగా రిటైర్ ఇచ్చేశారని వెంకయ్య మాటల్లో ఆవేదన ప్రస్ఫుటంగా కనిపించింది. దీన్ని బట్టి బీజేపీలో మోడీకి ఎదురునిలిచే నేతలందరినీ తొక్కేసినట్టే.. తనను కూడా తొక్కేశారని ‘వెంకయ్య’ పరోక్షంగా ఒప్పుకున్నట్టైంది. బీజేపీలో ఎంతో యాక్టివ్ పొలిటీషియన్ గా ఉన్న వెంకయ్యను ఉపరాష్ట్రపతిగా ఎందుకు పంపారు? ఎందుకు తనకు రిటైర్ మెంట్ ఇచ్చారు? వెంకయ్య ఎందుకు ఇలాంటి మాటలు అన్నారన్నది హాట్ టాపిక్ మారింది. వెంకయ్యకు మోడీ కావాలనే పక్కనపెట్టారని.. అది వెంకయ్య ఇష్టం లేదని తేలింది. ఏబీఎన్ ఆర్కే నిర్వహించిన ‘ఓపెన్ హార్ట్’లో నిజంగానే ఓపెనప్ అయ్యారు వెంకయ్య. ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సంచలనమవుతున్నాయి.

దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి. దీనిని అధిష్టించిన ఏకైక తెలుగు వ్యక్తి నీలం సంజీవరెడ్డి. ఈ పదవికి అడుగు దూరంలో ఆగిపోయిన మరో వ్యక్తి వెంకయ్యనాయుడు. రాజకీయాల్లో 5 దశాబ్దాలు ఉన్న ఆయన తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో పదవులు చేపట్టారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయకపోయినా ఆయన రాజకీయ చతురత, నాయకత్వ లక్షణాలతో పదవులే ఆయనను వెతుకుంటూ వచ్చాయి. ఆ పదవులకు కూడా వన్నె తెచ్చారు వెంకయ్య. పార్లమెంటులో తెలుగు గొంతుక వినిపించడంలో వెంకయ్యకు సాటిలేరు. అందరికీ అర్థమయ్యే ఆంగ్లంలో కూడా ఆయన మాట్లాడేవారు. ఇటీవలే ఉపరాష్ట్రపతిగా రిటైర్ అయ్యారు. రాష్ట్రపతి పదవి వస్తుందని అందరూ భావించారు. మరో తెలుగు వ్యక్తి దేశ అత్యున్నత పదవి చేపడతారని ఆశించారు. కానీ అడుగు దూరంలో ఆగిపోవడాని అనేక కారణాలు ఉన్నాయంటున్నారు వెంకయ్య. ఏబీఎన్ రాధాకృష్ణ నిర్వహించిన ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో సంచలన నిజాలు బయటపెట్టారు వెంకయ్య. మోదీపైనా కీలక వ్యాఖ్యలు చేశారు.
-త్వరగా రిటైర్ అయ్యారట..
తెలుగు రాజకీయాల్లో కీలక నేత అయిన వెంకయ్యకు ఆంధ్రప్రదేశ్‌పై ఎనలేని ప్రేమ. అందుకే రాష్ట్ర పునర్విభజన సమయంలోనూ ఆయన ఆంధ్రాకు పదేళ్ల ప్రత్యేక హోదా కోసం పట్టుపట్టి సాధించారు. కానీ తర్వాత వాళ్ల ప్రభుత్వమే వచ్చినా దానిని అమలు చేయించలేకపోయారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండి కూడా ప్రత్యేక హోదా విషయంలో యూపీయే హయాంలోలాగా మోదీపై ఒత్తిడి తేలేకపోయారన్న అపవాదు ఉంది. కానీ ఈ ఒత్తిడే ఆయనను రాజకీయాల నుంచి రిటైర్ అయ్యేలా చేసిందనే వాదన కూడా ఉంది. మోదీ ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చి రాజకీయాలకు దూరం చేశారని ఇప్పటికీ ప్రచారం ఉంది. వెంకయ్య కూడా తాను తొందరగా రాజకీయాలకు దూరమయ్యానన్న భావనలో ఉన్నారు. ఆర్కేతో ఈ విషయాన్ని కుండ బద్ధలు కొట్టారు. ఇంకొన్నాళ్లు రాజకీయాల్లో ఉంటే బాగుండు అన్న భావన వ్యక్తం చేశారు.

-తాజా రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు..
వెంకయ్య తాజా రాజకీయాలపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయాలకు నాలుగు ‘సీ’లు క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాంటాక్ట్ అవసరముండేవన్నారు. నేటి రాజకీయ నేతల్లు ఇవి కరువయ్యాయని తెలిపారు. ప్రస్తుతం కొత్తగా నాలుగు ‘సీ’ చేరాయని తెలిపారు. అవి క్యాస్ట్, కమ్యూనిటీ, క్యాష్, క్రిమినాలిటీ అని పేర్కొన్నారు. ఇప్పుడున్న రాజకీయాల్లో తాను రాణించలేనని అంగీకరించారు. కానీ ఉప రాష్ట్రపతి పదవి తన రాజకీయ జీవితానికి బంధం వేసిందని అభిప్రాయపడ్డారు.
-మోదీ, బీజేపీ గురించి..
ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ పరిస్థితిపై కూడా వెంకయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నాయకుడు అధ్వానీని కాదని మోదీని ప్రధాని అభ్యర్థిగా 2014లో ఎంపిక చేయాల్సిన పరిస్థితి వివరించారు. బీజేపీ సిద్ధాంతం పరంగా 70 ఏళ్లు దాటిన వారు రాజకీయాలకు దూరంగా ఉండాలి. కానీ మోదీ విషయంలో దానిని అతిక్రమించారు. అందుకు అప్పుడు ఆయనకు ఉన్న ఇమేజ్ కారణమని చెప్పారు. 70 ఏళ్ల నిబంధనను అది ఓవర్‌కమ్ చేసిందని పేర్కొన్నారు. ఇక నాటి బీజేపీకి, ప్రస్తుత బీజేపీకి ఉన్న తేడాను కూడా ఆయన వెల్లడించారు. మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా మారక తప్పదని అన్నారు. బీజేపీలో మార్పు వచ్చిన మాట వాస్తవమే అని అంగీకరించారు. పరిస్థితుల ప్రభావంతో ఇలా జరిగిందని అభిప్రాయపడ్డారు.
మొత్తంగా ఆర్కే వెంకయ్య నుంచి కీలక విషయాలనే రాబట్టారు. తాజాగా రాజకీయ ఆరోపణలు, కక్ష సాధింపు చర్యలు, ధూషణలు, బూతు భాష గురించి కూడా వెంకయ్య అభిప్రాయాలు రాబట్టారు. వెంకయ్య కూడా ఓపెన్‌గా సమాధానాలు చెప్పారు.