వీల్ చైర్ సానుభూతి మమతను గెలిపించిందా?

  దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌రిగాయి. కానీ.. దేశం మొత్తం దృష్టి నిలిపిన ఎన్నిక బెంగాల్ దే. దేశంలో ఎంతో ప్రాముఖ్య‌త క‌లిగిన రాష్ట్రాల్లో ఒక‌టైన బెంగాల్లో పాగా వేయాల‌ని బీజేపీ పుట్టిన కానుంచీ ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది. కానీ సాధ్యం కాలేదు. స్వ‌తంత్రం తొలినాళ్ల‌లో కాంగ్రెస్‌, ఆ త‌ర్వాత క‌మ్యూనిస్టులు సుదీర్ఘ‌కాలం బెంగాల్ ను పాలించారు. మ‌మ‌తా బెన‌ర్జీ సార‌థ్యంలోని తృణ‌మూల్ కాంగ్రెస్ వ‌రుస‌గా రెండు సార్లు అధికారం సాధించి.. మూడోసారి పీఠం కోసం […]

Written By: Bhaskar, Updated On : May 2, 2021 4:30 pm
Follow us on

 

దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌రిగాయి. కానీ.. దేశం మొత్తం దృష్టి నిలిపిన ఎన్నిక బెంగాల్ దే. దేశంలో ఎంతో ప్రాముఖ్య‌త క‌లిగిన రాష్ట్రాల్లో ఒక‌టైన బెంగాల్లో పాగా వేయాల‌ని బీజేపీ పుట్టిన కానుంచీ ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది. కానీ సాధ్యం కాలేదు. స్వ‌తంత్రం తొలినాళ్ల‌లో కాంగ్రెస్‌, ఆ త‌ర్వాత క‌మ్యూనిస్టులు సుదీర్ఘ‌కాలం బెంగాల్ ను పాలించారు. మ‌మ‌తా బెన‌ర్జీ సార‌థ్యంలోని తృణ‌మూల్ కాంగ్రెస్ వ‌రుస‌గా రెండు సార్లు అధికారం సాధించి.. మూడోసారి పీఠం కోసం బ‌రిలోకి దిగింది. ఈ నేప‌థ్యంలో బీజేపీకి ఎప్పుడూ అవ‌కాశ‌మే ద‌క్క‌లేదు. దీంతో ఎలాగైనా.. ఈ సారి బెంగాల్ సింహాస‌నం అధిష్టించాల‌ని కంక‌ణం క‌ట్టుకుంది క‌మ‌ల‌ద‌ళం.

ప్ర‌చారం కూడా హోరాహోరీగా సాగింది. బెంగాల్లో బీజేపీ గెల‌వ‌బోతోంద‌న్నంత‌గా మీడియాలోనూ క‌థ‌నాలు వెల్లువెత్తాయి. ఇక‌, ఎన్నిక‌ల ప్ర‌చారంలో నేత‌ల మాట‌లు.. తుపాకీ తూటాలై పేలాయి. కేంద్రంలోని బీజేపీ అన్ని అస్త్రాల‌ను ప్ర‌యోగించింది. ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. కేంద్ర కేబినెట్ మొత్తం బెంగాల్లో మ‌కాం వేసింది. ప్ర‌ధాని మోడీ, రాజ‌కీయ దురంద‌రుడిగా పేరుగాంచిన అమిత్ షా దృష్టి మొత్తం ఆ రాష్ట్రం మీద‌నే పెట్టారు. బెంగాల్లో స‌రికొత్త అధ్యాయం మొద‌లు కానుంద‌ని, దీదీ అరాచ‌క పాల‌న‌కు ముగింపు త‌థ్య‌మ‌ని బీజేపీ నేత‌లు నిన‌దించారు.

అటు మ‌మ‌తా బెన‌ర్జీ కూడా తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీ గూండాల‌కు ఇక్క‌డ చోటు లేదు అనేశారు. ఎన్నిక‌ల సంఘాన్ని కూడా నిందించారు. బీజేపీకి అనుకూలంగా నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని ఆరోపించారు. ఈ విధంగా నేత‌ల‌ మాట‌ల యుద్ధం బెంగాల్ దంగ‌ల్ ను మ‌రింత వేడెక్కించాయి. పోరు ర‌స‌వ‌త్త‌రంగా మారిపోయింది. ఎవ‌రు గెలుస్తారో సామాన్యులు అంచ‌నా వేయ‌లేని ప‌రిస్థితి క‌ల్పించారు.

కానీ.. ఫ‌లితాలు వెల్ల‌డ‌వుతుంటే యుద్ధం ఏక‌ప‌క్షంగా సాగింద‌న్న విష‌యం తేట తెల్ల‌మ‌వుతోంది. బెంగాల్ జ‌నం మ‌మ‌త వెంటే నిల‌బ‌డ్డార‌న్న నిజం తేలిపోయింది. ఎన్నిక జ‌రిగిన‌ 292 స్థానాల‌కు గానూ.. తృణ‌మూల్ కాంగ్రెస్ ఏకంగా 207 స్థానాల్లో ఆధిక్యంలో కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే 9 స్థానాల్లో గెలుపు జెండా ఎగ‌రేసింది. ఈ ఫ‌లితాల‌తో బీజేపీ శ్రేణులు తీవ్ర నిరాశ‌లో కూరుకుపోయాయి. ఇంత తేడా ఎలావ‌చ్చింద‌ని? ఎక్క‌డ తేడా కొట్టింద‌ని పోస్టుమార్టం చేసుకుంటున్నాయి.

అయితే.. అంద‌రూ చెబుతున్న మాట ఏమంటే.. మ‌మ‌తా బెన‌ర్జీ సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయ్యింద‌ని అంటున్నారు. నందిగ్రామ్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా త‌న‌పై దాడి జ‌రిగింద‌ని మ‌మ‌త చెప్పిన విష‌యం తెలిసిందే. ఈ దాడిలో కాలికి గాయ‌మైన‌ట్టు వైద్యులు తెలిపారు. ఇదంతా బీజేపీ నేత‌లే చేశార‌ని ఆమె ఆరోపించారు. అప్ప‌టి నుంచి ఆమె వీల్ చైర్ కే ప‌రిమితం అయ్యారు. ఎన్నిక‌ల ప్ర‌చారం కూడా కుర్చీలో కూర్చొనే న‌డిపించారు. రాష్ట్రంలో ప‌లు చోట్ల‌కు ఆమె చైర్ మీద‌నే తిరిగారు.

ఇలా.. వీల్ చైర్ లో తిర‌గ‌డ‌మే ఆమెకు క‌లిసి వ‌చ్చింద‌ని అంటున్నారు. ఆ సెంటిమెంట్ కార‌ణంగానే.. ఓట్ల వ‌ర్షం కురిసింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. దాంతోపాటు బీజేపీ వాళ్ల‌ను బ‌య‌టి వ్యక్తులు అని మొద‌ట్నుంచీ చెబుతూ వ‌స్తున్న మ‌మ‌త‌.. బెంగాల్ ప్ర‌జ‌ల్లోకి ఆ వాయిస్ ను తీసుకెళ్ల‌గ‌లిగార‌ని కూడా అంటున్నారు. ఈ రెండు కార‌ణాల‌తో టీఎంసీ హ్యాట్రిక్ విజ‌యం న‌మోదు చేస్తోంద‌ని విశ్లేషిస్తున్నారు.