
విశాఖపట్నంపై విషవాయువు చిమ్మి ప్రాణాంతకంగా మారిన ఎల్‌జీ పాలిమర్స్ కేవలం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అండతోనే భద్రతా చర్యల పట్ల మొదటి నుండి నేరమయ నిర్లక్ష్య ధోరణులు అనుసరిస్తూ వస్తున్నట్లు స్పష్టమవుతున్నది. ఆ నిర్లక్ష్యమే ప్రస్తుతం జరిగిన ఘోర ప్రమాదానికి కారణమని వెల్లడవుతున్నది.
అవసరమైన పర్యావరణ అనుమతులు ఏవీ లేకుండానే, ప్రామాణిక భద్రతా చర్యలు చేపట్టకుండా, కేవలం రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దల అండదండలు ఉన్నాయన్న భరోసాతో ఈ కంపెనీ యాజమాన్యం దురహంకార ధోరణులు ప్రదర్శిస్తూ వచ్చిన్నట్లు తేలుతున్నది.
మే 17తర్వాత రోడ్లపైకి బస్సులు..?
అందుకనే యాజమాన్యాన్ని బాధ్యునిగా చేసి, తగు చర్య తీసుకొనే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వపరంగా ఇప్పుడు జరగడం లేదు. పైగా, రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా రూ 30 కోట్లను ఉదారంగా సహాయ చర్యలకు విడుదల చేయడం ద్వారా బాధితులను, విమర్శకులను శాంతపరచి, ఈ నేరం నుండి యాజమాన్యాన్ని కాపాడే ప్రయత్నం జరుగుతున్నట్లు భావించ వలసి వస్తున్నది.
రాష్ట్రంలో ఇటువంటి విషవాయువు విరజిమ్మే మరో కంపెనీ లేకపోవడంతో దీని భద్రత ప్రమాణాల పర్యవేక్షణ పట్ల సంబంధిత అధికారులు సహితం ఉదాసీనంగా వ్యవహరించినట్లు కనిపిస్తున్నది. పైగా ఆ కంపెనీకి ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల అండదండలు ఉంటూ ఉండడంతో కాలుష్య నిరయంత్రణ బోర్డు అధికారులు సహితం ఏమీ పట్టించుకోలేదని విమర్శలు చెలరేగుతున్నాయి.
స్టైరిన్ ట్యాంకులో ఉష్ణోగ్రతలు పెరగడం, వాయువు లీక్ కావడం ఇదే మొదటిసారి కాదని, కొంతకాలంగా జరుగుతూనే ఉందని స్వయంగా కంపెనీ ప్రతినిధే మీడియా ముందు వెల్లడించడం ఈ సందర్భంగా గమనార్హం. ఏమి చేసినా ఎవ్వరు తమను ఏమీ చేయలేరులే అన్న ఆ కంపెనీ యాజమాన్యపు భరోసాను ఈ ప్రకటన స్పష్టం చేస్తుంది.
ఆ భరోసాతోనే ఎటువంటి భద్రతా చర్యలను ఈ కంపెనీ పాటించడం లేదని, కనీసం తగిన నైపుణ్యం గల అధికారులను కూడా అందుబాటులో లేకుండా వ్యవహరిస్తున్నారని తెలుస్తున్నది. ఈ నిర్లక్ష్యం కారణంగానే ఇప్పుడు భారీ మూల్యం చెలించుకోవలసి వచ్చింది.
ఈ సందర్భంగా గ్యాస్ లీక్ పై కంపెనీ ప్రతినిధులు రోజుకొక మాట చెబుతూ వాస్తవాలని కప్పిపుచ్చే ప్రయత్నాలు ఇంకా చేస్తూనే ఉన్నారు. మొదట స్టైరిన్ ట్యాంకుకు అనుసంధానమైన రిఫ్రిజిరేషన్ యూనిట్‌లో లోపం ఉందన్నారు. రిఫ్రిజిరేషన్ బాగున్నప్పటికీ ట్యాంకుకు యూనిఫార్మ్‌గా కూలింగ్ అందలేదని రెండోసారి చెప్పారు.
కూలింగ్ అంతా ట్యాంకు కింది భాగం లోనే ఉండిపోయిందని, పైన లేయర్ చల్లబడలేదని మూడోసారి అన్నారు. ఇలాంటివి తరచూ జరుగుతుంటాయని కూడా ధీమాగా చెప్పుకొచ్చారు.సాధారణంగా పాలిస్టైరిన్‌ను తయారుచేయడానికి ట్యాంకులోని స్టైరిన్‌ని రియాక్టర్‌లోకి పంపుతూ ఉష్ణోగ్రతలు పెంచుతారు.
అక్కడ కొన్ని రసాయన క్రిస్టల్స్ జత చేస్తారు. అప్పుడు పొలమరైజేషన్ జరుగుతుంది. ఆ సమయంలో చాలావేడి జనిస్తుంది. పెద్ద బాంబు పేలితే ఎంత వేడి పుడుతుందో అంతవేడి ఉంటుంది. దానిని కూలర్స్‌తో కంట్రోల్ చేస్తారు.ఇందుకోసం వాటర్ జాకెట్లు, కూలింగ్ జాకెట్లు వినియోగిస్తారు. ఈ పొలమరైజేషన్ నుంచి పాలిస్టైరిన్ బయటకు వస్తుంది.
అయితే సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఈ పొలమరైజేషన్ ప్రక్రియ స్టైరిన్ ట్యాంకులో దానికదే జరిగిపోయింది. ట్యాంకులోని స్టైరిన్ వేడెక్కి ఆవిరిగా మారి పైకప్పునకు అంటుకుని క్రిస్టల్స్‌గా మారింది. కొద్దిసేపటికి ఆ భారం పెరిగి… మరుగుతున్న స్టైరిన్‌లో పడడంతో ఆటోమేటిగ్గా పొలమరైజేషన్ మొదలైంది.
అత్యధిక ఉష్ణోగ్రతలు నియంత్రించేందుకు ప్రయత్నించకపోవడంతో పైకప్పునున్న వాల్వుల ద్వారా ఆవిరి విషవాయువుగా బయటకు వచ్చింది. మనుషులు లోపలకు దిగి క్లీన్‌చేసే మ్యాన్‌హోల్ బద్ధలై అందులో నుంచి భారీగా విషవాయువులు బయల్పడ్డాయి. అదే 12 ప్రాణాలను బలితీసుకుంది.
స్టైరిన్ ప్రమాదం జరిగితే దాని ప్రభావాన్ని తగ్గించడానికి విరుగుడు రసాయనం తగిన మోతాదులో దగ్గర ఉంచుకోవాలి. యాజమాన్యం ఆ పని కూడా చేయకపోవడంతో ప్రమాదం జరిగాక ఆ రసాయనం తెప్పించుకోవడానికి రాష్ట్రప్రభుత్వాన్ని అనుమతి కోరడం వారి నిర్లక్ష్య ధోరణిని వెల్లడి చేస్తుంది.
అప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పందించి గుజరాత్ నుంచి ప్రత్యేక విమానంలో తీసుకురావడంతో దానిని ఉపయోగించి విషప్రభావాన్ని అదుపులోకి తీసుకు రాగలిగారు.