Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల ఫలితాలను చంద్రబాబు ప్రభావితం చేశారా? కాంగ్రెస్ గెలుపునకు ఆయనే కారణమయ్యారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనిపై అప్పుడే విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. బీ ఆర్ఎస్ కు ఓటమి తప్పదు అని ఒక నిశ్చయానికి వచ్చిన విశ్లేషకులు అప్పుడే.. దానికి గల కారణాలు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ గెలుపునకు ఏ ఏ అంశాలు దారితీశాయో అన్న విషయమై పోస్టుమార్టం సైతం ప్రారంభమైంది.
అయితే ప్రధానంగా చంద్రబాబు అరెస్టు, తదనంతర పరిణామాలే తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కారణమన్న అభిప్రాయం ప్రధానంగా వినిపిస్తోంది. అయితే చంద్రబాబు అంతలా ప్రభావితం చేయగలిగారా? అన్న ప్రశ్న సైతం ఉత్పన్నమవుతోంది. తెలంగాణలో దాదాపు 50 నియోజకవర్గాల్లో సెటిలర్స్ తో పాటు కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారు. ప్రధానంగా గ్రేటర్ పరిధితో పాటు ఖమ్మం జిల్లాలో కమ్మ సామాజిక వర్గం ఓటర్లు అధికం. గెలుపోటములను నిర్దేశించే స్థాయిలో వారు ఉన్నారు. ఏపీలో చంద్రబాబు అక్రమ కేసులు అరెస్టు అయ్యారు. దానికి కారణం ఏపీ సీఎం జగన్. అందుకు సహకరించింది బిజెపి పెద్దలు. జగన్ కెసిఆర్ కు మిత్రుడు. దీంతో సహజంగానే బీఆర్ఎస్, బిజెపిలపై ప్రతికూల ప్రభావం చూపింది. కాంగ్రెస్ పార్టీకి లాభించింది.
చంద్రబాబు అరెస్టు తరువాత మంత్రి కేటీఆర్ వ్యవహార శైలి కూడా బీఆర్ఎస్ కు మైనస్ గా మారింది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఒక ట్వీట్ చేశారు. అది జగన్ చర్యలను సమర్థించేలా ఉంది. అటు తరువాత చంద్రబాబు అరెస్టుపై హైదరాబాదులో నిరసన చేపెడితే.. దానిని కూడా నియంత్రించారు. ఇది తెలుగుదేశం అభిమానులతో పాటు సెటిలర్స్, కమ్మ సామాజిక వర్గం పై పెను ప్రభావం చూపాయని ప్రస్తుతం విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.పైగా ఎన్నికల్లో టిడిపి పోటీ చేయకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించింది.
టిడిపి శ్రేణులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడానికి మరో కారణం రేవంత్ రెడ్డి. ఆయన సుదీర్ఘకాలం టిడిపిలో పనిచేశారు. చంద్రబాబు అనుంగ శిష్యుడు కూడా. పార్టీ నుంచి దూరమైనా తన మాతృ పార్టీకి మాత్రం ఏనాడూ దూషించలేదు. చంద్రబాబు పై సైతం వ్యతిరేక వ్యాఖ్య చేయలేదు. అటువంటి వ్యక్తి సీఎం అయ్యే ఛాన్స్ ఉండడంతో.. టిడిపి క్యాడర్ అంతా వైసీపీ వైపు వెళ్ళింది. టిడిపి పోటీ చేస్తున్న మాదిరిగానే భావించి.. కాంగ్రెస్ విజయానికి కృషి చేశారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం వెనుక తెలుగుదేశంతో పాటు చంద్రబాబు ఉన్నారన్న విశ్లేషణ ఇప్పుడు అంతటా వినిపిస్తోంది.