ABN RK – KCR: కెసిఆర్, ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ సమకాలీకులు.. ఒకరు రాజకీయ నాయకుడు అయితే.. మరొకరు పాత్రికేయుడు.. ఇద్దరు కూడా డక్కా మొక్కిలు తిని ఈ స్థాయికి వచ్చినవారే. టెంపర్మెంట్ విషయంలో మాత్రం ఎక్కడా తగ్గరు. ఇద్దరి మధ్య బావ బామ్మర్ది సంబంధం ఉంది.. ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి కేసీఆర్ ను రాధాకృష్ణ ప్రొజెక్ట్ చేస్తూనే ఉన్నాడు. తెలంగాణ పేరు వినిపిస్తేనే అంత దూరం పెట్టే పత్రికలు ఉన్నప్పటికీ… తన పత్రికలో మాత్రం విస్తారమైన స్పేస్ కల్పించిన ఘనత రాధాకృష్ణకే దక్కుతుంది. కవిత బతుకమ్మను కూడా భారీ స్థాయిలో ప్రచారం చేసింది ఆర్కే.. అదే సమయంలో కేసీఆర్ తప్పులను కూడా ఎండగట్టింది ఆర్కేనే. ఈ విషయాన్ని కూడా పలు సందర్భాల్లో కేసీఆర్ చెప్పుకొచ్చాడు.. కానీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ… ఇప్పుడు ఎడ మొహం పెడ మొహం గా ఉన్నారు. ఆ మధ్య ఆర్కే సతీమణి కన్నుమూసినప్పుడు కెసిఆర్ నుంచి సరైన పరామర్శ దక్కలేదని జర్నలిస్టు సర్కిల్లో వినిపిస్తూ ఉంటుంది.

ఇక తాజాగా రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాం లో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని ఇంటర్వ్యూ చేశాడు.. ముఖ్యంగా మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసును తెరపైకి తీసుకొచ్చాడు. అందులో జరిగిన వ్యవహారాలను ఒక్కొక్కటిగా రోహిత్ రెడ్డి తో చెప్పించాడు. బహుశా ఈ ఇంటర్వ్యూలో ప్రజలకు తెలియని అనేక విషయాలు వెలుగు లోకి వచ్చే అవకాశం ఉంది. కొన్నింటికి సమాధానం చెప్పలేక రోహిత్ రెడ్డి బేల మొహం వేశాడు. ఆర్కెకు కూడా కావాల్సింది ఇదే కాబట్టి మరింత రెచ్చిపోయాడు.

ఈ ప్రశ్నల సరళి లోనే భారత రాష్ట్ర సమితి ప్రస్తావన వచ్చింది.. కెసిఆర్ ప్రధానమంత్రి అయితే తాను తెలుగువాడిగా, తెలంగాణ వాడిగా గర్వపడతానని, ఆ జాబితాలో ముందు వరుసలో ఉంటానని ఆర్కే తన మనోగతాన్ని వెల్లడించాడు.. అంతేకాదు కెసిఆర్ ప్రధానమంత్రి కావాలి అని కూడా కోరుకుంటున్నానని స్పష్టం చేశాడు.. ఇదే సమయంలో కెసిఆర్ కు భారతీయ జనతా పార్టీ అసలైన మొగుడని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆర్కే మాటలతో కెసిఆర్ కు తనతో ఎంత సాన్నిహిత్యం ఉందో అవగతం అవుతున్నది. అంతేకాదు బావ కళ్ళల్లో ఆనందం కోసం బామ్మర్ది పడే తాపత్రయం కనిపిస్తోంది. ఎంతైనా వారిద్దరూ హగ్గు దోస్తులు, పెగ్గు దోస్తులు. తల్లి పుట్టిల్లు మేనమామకు తెలియదా అన్నట్టు… ఒకరి గుట్టు మట్లు ఇంకొకరికి తెలుసు.. అందుకే ఓపెన్ గా మాట్లాడుతారు.. ఇందులో ఆర్కే బయటపడతాడు.. కెసిఆర్ మాత్రం కొన్ని సందర్భాల్లోనే బరస్ట్ అవుతాడు.